అయోమయం… గందరగోళం..!

Feb 10,2024 22:01

ఉండి నియోజకవర్గంలోతెలుగు తమ్ముళ్ల పరిస్థితి
ఎంఎల్‌ఎ అభ్యర్థి ఎవరనే దానిపై తీవ్ర చర్చ
మాజీ ఎంఎల్‌ఎ శివరామరాజుస్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తారని ప్రచారం
ప్రజాశక్తి – ఆకివీడు
టిడిపి ఉండి నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలు గందరగోళ పరిస్థితుల్లో ఉన్నారు. ఒకపక్క ప్రస్తుత ఎంఎల్‌ మంతెన రామరాజు తానే మరోసారి అభ్యర్థినని గతంలోనే ప్రకటించారు. మరోపక్క వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఉండి అసెంబ్లీ నుంచి పోటీ చేస్తున్నట్లు మాజీ ఎంఎల్‌ఎ శివరామరాజు ప్రకటించారు. శివరామరాజుకు టిక్కెట్టు దక్కడం అనుకున్నంత తేలికేం కాదని ఆ పార్టీ కార్యకర్తలు అనుకుంటున్నారు. ఈ క్రమంలో శివరామరాజు కొంతకాలం నుంచి ఊపు పెంచారు. ప్రధానంగా రామరాజుపై ఉన్న కొద్దిపాటి వ్యతిరేకతను తీవ్రతరం చేయడానికి విపరీతంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీలోని వ్యతిరేక గ్రూపులను దగ్గర చేసుకునే ప్రయత్నాలు సాగిస్తున్నారని పలువురు చెబుతున్నారు. తానే టిడిపి అభ్యర్థినని శివరామరాజు పూర్తిస్థాయిలో ప్రచారం సాగిస్తున్నట్లు అభిమానులు చెబుతున్నారు. రాంబాబుకు ఆర్థిక లావాదేవీల మైనస్‌ ఉన్నప్పటికీ ప్రతిపక్ష స్థానంలో ఉండి కూడా ఐదేళ్ల నుంచి పార్టీని, కార్యకర్తలను మోసిన వ్యక్తిగా అందరికీ అభిమానం ఉంది. ఆర్థిక సామాజిక భారాలు ప్రతిపక్షంలో ఉండి మోయటం అంత తేలికేం కాదంటున్నారు రామరాజు అభిమానులు. 2019 ఎన్నికల అయిపోయిన తర్వాత సుమారు నాలుగున్నరేళ్ల వరకూ శివరామరాజు చిరునామా కూడా నియోజకవర్గ ప్రజలకు తెలియదని రామరాజు అభిమానులు అంటున్నారు. ఐదేళ్లుగా పార్టీకి సేవ చేస్తున్నవారిని కాదని పార్లమెంటు స్థానానికి పోటీ చేసి ఓడిపోయి నాడు వెళ్లిపోయిన అభ్యర్థి ఇప్పుడు ఎన్నికలు వచ్చేసరికి తిరిగోచ్చి తానే అభ్యర్థి అంటే ఎలా అంగీకరిస్తామంటూ పార్టీ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు.శివరామరాజు ఓడిపోయిన నాడు ఇక్కడ అతనికి గ్రూపు ఉండేది. ఎన్నికల తెల్లారి నుంచి ఆయన కనిపించకపోవడంతో ఆ గ్రూపు కాస్త ప్రస్తుత నాయకుల గ్రూపులుగా మారిపోయాయి. పాత గ్రూపు ఉదంటూ రంగంలోకి దిగిన శివరామరాజుకు ఆశించిన మేర ప్రజల్లో ఆదరణ కనబడటం లేదని స్థానికులు అంటున్నారు. ఇదిలా ఉండగా రెండు రోజుల క్రితం పార్టీకి చెందిన నాలుగు మండలాల ప్రధాన నాయకులు, అధ్యక్షులు ఉండి మండలంలో సమావేశమయ్యారు. వీరందరూ రాంబాబుకు మద్దతుగా సమావేశమైనట్లు తెలుస్తోంది. తానే అభ్యర్థినని, లేదా స్వతంత్రంగా పోటీ చేస్తానని శివరామరాజు ప్రచారం చేసుకుంటున్నారని, ప్రస్తుత ఎంఎల్‌ఎ రామరాజు తన పని తాను చేసుకుపోతున్నారని రాంబాబు అభిమానులు చెబుతున్నారు. ప్రస్తుతం నియోజకవర్గంలో వీరిద్దరి మద్దతుదారులు గందరగోళ పరిస్థితుల్లో ఉన్నారు. తమకు అభ్యర్థి ఎవరైనా ఒకటే పార్టీ ప్రధానం అనుకునే వారి పరిస్థితి మాత్రం ప్రశాంతంగా ఉంది. అయితే వారిలో కూడా అభ్యర్థి ఎవరనే ఆత్రుత స్పష్టంగా కనిపిస్తోంది.పార్లమెంట్‌ అభ్యర్థి ఎవరనేది చర్చఇదిలా ఉండగా పార్లమెంటు అభ్యర్థి ఎవరన్నది కూడా ఇక్కడ చర్చ జోరుగా సాగుతోంది. ఏ పార్టీ పోటీ చేసినా కూటమి అభ్యర్థి మాత్రం రఘురామరాజు అన్నది ఇక్కడ ప్రతిఒక్కరు అంగీకరిస్తున్న మాట. అయితే రఘురామరాజు మొదట్లో జనసేన నుంచి పోటీ చేస్తారని కొన్ని లీకులు వచ్చాయి. ఇటీవల ఆయన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా అనధికారికంగా ప్రచారం సాగింది. అయితే గత రెండు రోజుల నుంచి మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో రఘురామరాజు బిజెపి అభ్యర్థిగా ప్రచారం మొదలైంది. ప్రతిపక్ష పార్టీల్లో ఏ పార్టీ నుండైనా అభ్యర్థి మాత్రం రఘురామరాజే అనే ప్రచారం జోరుగా సాగుతోంది.

➡️