అసంతృప్తి.. ఆవేదన

టిడిపి, జనసేన నియోజకవర్గ ఆత్మీయ సమావేశం తీరిది
అధినేతలు చంద్రబాబు, పవన్‌ నిర్ణయాలపై ఇరు పార్టీ నేతల్లో అసంతృప్తి
ప్రజాశక్తి – భీమవరం
ఉండి నియోజకవర్గ టిడిపి, జనసేన ఆత్మీయ సమావేశంలో ఇరు పార్టీల నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇరు పార్టీల అధినేతలు చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌ తీసుకున్న నిర్ణయాల పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇరు పార్టీల నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తూనే చివరకు చేసేదేమీ లేక ఎంఎల్‌ఎ మంతెన రామరాజు విజయానికి అంతా కలిసికట్టుగా కృషి చేయాలని నినదించారు. పెద్ద మేరం నిర్మలా ఫంక్షన్‌ హాలులో ఉండి నియోజకవర్గ టిడిపి, జనసేన ఆత్మీయ సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. జనసేన ఎక్కువ సీట్లు పోటీ చేసే విధంగా అధిష్టానం ఆలోచన చేయాలని, ఈ విషయాన్ని చంద్రబాబు, పవన్‌ల దృష్టికి తీసుకెళ్లాలని జనసేన కాళ్ల మండలాధ్యక్షులు రామాంజనేయులు కోరారు. ఉండి స్థానం జనసేనకు కేటాయించాల్సి ఉన్నప్పటికీ ఉమ్మడిలో అది టిడిపికి వెళ్లిందని, లేకపోతే జనసేన ఉండి ఇన్‌ఛార్జి, బిసి ముఖ్య నేత జుత్తిగ నాగరాజు పోటీ చేసేవారని జనసేన పాలకోడేరు మండలాధ్యక్షులు గాదం నానాజీ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఏది ఏమైనప్పటికీ ఉమ్మడి అభ్యర్థిగా ఉన్న ఎంఎల్‌ఎ రామరాజు గెలుపునకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఎంఎల్‌ఎ రామరాజు మాట్లాడుతూ నియో జకవర్గంలో టిడిపి నాయకులకు ఎటువంటి గుర్తింపు ఉంటుందో జనసేనకు కూడా అదే గుర్తింపు ఉంటుందన్నారు. జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జి జుత్తిగ నాగరాజు మాట్లాడుతూ రాష్ట్ర భవిష్యత్తు కోసం పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్‌ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందన్నారు. సీట్ల కేటాయింపుల్లో ఎక్కువ తక్కువ అనే భావం చూడకుండా ఉమ్మడిగా ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు.మాజీ ఎంఎల్‌ఎ శివరామరాజు గ్రూపు దూరంటిడిపి, జనసేన ఆత్మీయ సమావేశానికి మాజీ ఎంఎల్‌ఎ శివరామరాజు గ్రూపు దూరంగా ఉంది. అధిష్టానం తీసుకున్న నిర్ణయం పట్ల శివరామరాజు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ ఆత్మీయ సమావేశానికి ఆయనతో పాటు ఆయన గ్రూపు నేతలు, కార్యకర్తలు, అభిమానులు హాజరు కాలేదు. ఇదిలా ఉంటే ఆత్మీయ సమావేశానికి తమకు ఆహ్వానం రాలేదంటూ శివరామరాజు అసంతృప్తి గ్రూపువారు ఆరోపిస్తున్నారు.
ఉమ్మడి కలయికతో ఉండిలో విజయం సాధిస్తాం
శివరామరాజు విషయంలో అధిష్టానం జోక్యం చేసుకోవాలి
ఎంఎల్‌ఎ మంతెన రామరాజు
కాళ్ల : తెలుగుదేశం, జనసేన పార్టీల ఉమ్మడి కలయికతో ఉండిలో ముందుకు సాగుతూ రానున్న ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఉండి ఎంఎల్‌ఎ మంతెన రామరాజు కోరారు. మండలంలోని పెదఅమిరంలో టిడిపి, జనసేన ఆత్మీయ సమావేశం సోమవారం నిర్వహించారు. ఈ సమావేశానికి ఉండి ఎంఎల్‌ఎ రామరాజు అధ్యక్షత వహించి మాట్లాడుతూ చంద్రబాబునాయుడు రెండేళ్ల క్రితమే సిట్టింగ్‌ ఎంఎల్‌ఎ టిక్కెట్‌ను ఖరారు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఉండిలో ఎటువంటి బేదాభిప్రాయాలు లేకుండా అధిష్టానం జోక్యం చేసుకోవాలని కోరారు. చంద్రబాబు దృష్టిలో శివరామరాజుకు ప్రాధాన్యత ఉందన్నారు. పార్టీ పరిశీలకులు కొత్త నాగేంద్రబాబు మాట్లాడుతూ మాజీ ఎంఎల్‌ఎ శివరామరాజు తప్పకుండా టిడిపి అభ్యర్థి గెలుపు కోసం కృషి చేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి మాజీ ఛైర్మన్‌ ముత్యాలరత్నం, జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జి జుత్తిగ నాగరాజు, గవరలక్ష్మి, టిడిపి మండలాధ్యక్షులు కరిమెరక నాగరాజు, జివి.నాగేశ్వరరావు, దెందుకూరి కోటిరాజు, జనసేన మండలాధ్యక్షులు ఎరుబండి రామాంజనేయులు, మాజీ ఎంపిపి అరేటి వెంకటరత్నప్రసాద్‌, వీరవల్లి శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

➡️