‘పింఛన్ల’ రగడ..!

 ఎన్నికల కమిషన్‌ ఆదేశాలతో పింఛన్ల పంపిణీకి వాలంటీర్లు దూరం 
ఎన్నికల స్టంట్‌గా అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం
రెండు జిల్లాల్లో 5.10 లక్షల మంది పింఛన్‌దారులు 
3 నుంచి పంపిణీకి సన్నాహాలు.. ఎక్కడిస్తారనే దానిపై లేని స్పష్టత
ప్రజాశక్తి – ఏలూరు ప్రతినిధి
సామాజిక పింఛన్ల పంపిణీపై నెలకొన్న సందిగ్ధత అధికార, ప్రతిపక్షపార్టీల మధ్య ఎన్నికల స్టంట్‌గా మారింది. పింఛన్ల పంపిణీకి వాలంటీర్లను దూరం పెట్టాలన్న ఎన్నికల కమిషన్‌ ఆదేశాలు దీనికి కారణం. పింఛన్ల పంపిణీని ప్రతిపక్షాలు అడ్డుకున్నాయంటూ వైసిపి విమర్శలు గుప్పిస్తుండగా, తాము అలా చేయలేదంటూ టిడిపి నేతలు తిప్పికొడుతున్నారు. ఆర్థిక సంవత్సరం ముగింపు కారణంగా ఈ నెల పింఛన్ల పంపిణీ మూడో తేదీ నుంచి ప్రారంభించనున్నట్లు ఇప్పటికే అధికారులు ప్రకటించారు. అయితే ఇంటికి తెచ్చిస్తారా.. లేక పంచాయతీ కార్యాలయాల వద్దకు వెళ్లాలా అనే దానిపై ఇంకా స్పష్టత రాకపోవడంతో గందరగోళం నెలకొంది. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో వృద్ధాప్య, చేనేత, వితంతు, కల్లుగీత కార్మికులు, మత్స్యకారులు, ఒంటరి మహిళలు, ట్రాన్స్‌జెండర్లు ఇలా 25 రకాలకు చెందిన 5.10 లక్షల మందికి ప్రతినెలా సామాజిక పింఛన్లను ప్రభుత్వం అందిస్తోంది. ఏలూరు జిల్లాలో 2.72 లక్షల మందికి రూ.152 కోట్లు, పశ్చిమగోదావరిలో 2.38 లక్షల మందికి రూ.69.97 కోట్లు సొమ్ము అందిస్తున్నారు. వైసిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి 50 ఇళ్లకూ ఒక్కో వాలంటీర్‌ను నియమించింది. వీరే ప్రతినెలా ఇంటికి తెచ్చి పింఛన్‌దార్లకు సొమ్ము అందిస్తున్నారు. ఎన్నికల సమయంలో వాలంటీర్లు వైసిపికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ప్రతిపక్షాలు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదులు చేశాయి. దీంతో వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని ఎన్నికల కమిషన్‌ ఆదేశాలు జారీ చేసింది. అందులో భాగంగా ఎన్నికల కోడ్‌ ముగిసే వరకూ పింఛన్ల పంపిణీకి వాలంటీర్లను దూరం పెట్టాలని ఎన్నికల కమిషన్‌ తెలిపింది. దీంతో సామాజిక పింఛన్ల పంపిణీ వ్యవహారం ఎన్నికల స్టంట్‌గా మారిపోయింది. వృద్ధులకు అందే పింఛన్‌ సొమ్మును టిడిపి, జనసేన, బిజెపి అడ్డుకున్నాయంటూ వైసిపి పెద్దఎత్తున ప్రచారం చేస్తోంది. అయితే పింఛన్ల పంపిణీని తాము అడ్డుకోలేదంటూ టిడిపి, మిత్రపక్షాలు అదేస్థాయిలో తిప్పికొడుతున్నాయి. మార్చి నెలాఖరుకు ఆర్థిక సంవత్సరం ముగింపు కారణంగా సామాజిక పింఛన్ల పంపిణీ ఈ నెల మూడో తేదీ నుంచి ఏడో తేదీ వరకూ సాగుతుందని అధికారులు ఇప్పటికే ప్రకటించారు. ఇంటికి తెచ్చిస్తారా.. పంచాయతీ కార్యాలయాల వద్దే పంపిణీ చేస్తారా అనేది ఇంకా స్పష్టత లేకుండాపోయింది. వాలంటీర్లు పింఛన్‌ పంపిణీ చేయకూడదని, మొబైల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకోవాలని తెలపడంపై పలుచోట్ల వాలంటీర్లు మూకుమ్మడి రాజీనామాలకు సైతం దిగారు. పింఛన్ల వ్యవహారాన్ని వైసిపి ఎన్నికల ప్రచారాస్త్రంగా ఉపయోగించుకుంటుందని స్పష్టమవుతోంది. అదే సమయంలో సచివాలయ సిబ్బందితో పింఛన్ల సొమ్మును ఇంటికెళ్లి ఇచ్చే అవకాశమున్నా ఎందుకు నిర్ణయం తీసుకోవడం లేదనే చర్చ సైతం నెలకొంది. పింఛన్‌దారులను ప్రసన్నం చేసుకునేందుకు ప్రధాన పార్టీలైన వైసిపి, టిడిపి, జనసేన, బిజెపి తెగ ఆరాట పడుతున్న పరిస్థితి కన్పిస్తోంది.కలెక్టర్‌ ఆదేశాలకు అనుగుణంగా పింఛన్ల పంపిణీఎంఎస్‌ఎస్‌.వేణుగోపాల్‌, డిఆర్‌డిఎ పీడీ, పశ్చిమగోదావరి జిల్లా ఈ నెల మూడో తేదీ నుంచి ఏడో తేదీ వరకూ సామా జిక పింఛన్ల పంపిణీకి ఏర్పాట్లు చేశాం. ఇంటింటికి వెళ్లి ఇవ్వడంపై ఇప్పటి వరకూ ఆదేశాలు రాలేదు. జిల్లా కలెక్టర్‌ ఆదేశాలకు అనుగుణంగా పింఛన్ల పంపిణీ చేపడతాం.

➡️