ప్రశాంతంగా గ్రూప్‌ – 2 పరీక్షలు

ప్రజాశక్తి – భీమవరం

జిల్లాలో గ్రూప్‌ – 2 ప్రిలిమినరీ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. జిల్లా వ్యాప్తంగా 14,546 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరు కావాల్సి ఉండగా 12,336 మంది మాత్రమే పరీక్ష రాశారు. సుమారు 2210 మంది గైర్హాజరయ్యారు. గ్రూప్‌ – 2 పరీక్షల నిర్వహణకు ఎటువంటి లోటుపాట్లు లేకుండా అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. రెవెన్యూ డివిజన్ల పరిధిలోని భీమవరంలో 21 పరీక్షా కేంద్రాలు, నరసాపురంలో 3, తాడేపల్లిగూడెంలో 13 కేంద్రాలు కలుపుకుని జిల్లా వ్యాప్తంగా 37 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో అభ్యర్థులు ప్రశాంత వాతావరణంలో గ్రూప్‌-2 పరీక్షలు రాశారు. చిన్నపాటి లోటుపాట్లు మినహా జిల్లాలో గ్రూప్‌-2 పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి.పరీక్షా కేంద్రాలను పరిశీలించిన జెసి రామ్‌ సుందర్‌ రెడ్డిజిల్లాలో నిర్వహిస్తున్న గ్రూప్‌-2 పరీక్షా కేంద్రాలను జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ రామ్‌ సుందర్‌రెడ్డి ఆదివారం పరిశీలించారు. విష్ణు కళాశాలలో ఏర్పాటుచేసిన పరీక్షా కేంద్రంలో పరీక్ష నిర్వహణ తీరును తనిఖీ చేశారు. అభ్యర్థుల సంతకాల రిజిస్టర్లను పరిశీలించారు. పరీక్ష సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని, అప్రమత్తంగా ఉండాలని ఇన్విజిరేట్లరకు సూచించారు. పరీక్షలు పూర్తయి పేపర్లు స్ట్రాంగు రూమ్‌కు చేరే వరకూ పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమల్లో ఉండాలన్నారు. ఎక్కడ ఏ చిన్న పొరపాటు జరగకుండా పరీక్షలు విజయవంతమయ్యేలా అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు. కమాండ్‌ కంట్రోల్‌ రూంను పర్యవేక్షించిన ఇన్‌ఛార్జి జిల్లా రెవెన్యూ అధికారి బి.శివనారాయణ రెడ్డిని, పరీక్షల నిర్వహణలో తోడ్పాటును అందించిన ఎపిపిఎస్‌సి సెక్షన్‌ అధికారి జె.జయంతి, ఎఎస్‌ఒ ఎ.నాగలక్ష్మి, జిల్లా కలెక్టర్‌ కార్యాలయ పరిపాలనా అధికారి పిహెచ్‌ జిఆర్‌ పాపారావు, పర్యవేక్షకులు టిఎల్‌ఎస్‌ఎస్‌.ప్రసాద్‌, సిబ్బంది జెసి ప్రత్యేకంగా అభినందించారు.నరసాపురం : గ్రూప్‌-2 ప్రిలిమినరీ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. పట్టణంలోని శ్రీసూర్య డిగ్రీ జూనియర్‌ కళాశాల, వైన్‌, సీతారామపురం స్వర్ణాంధ్ర ఇంజినీరింగ్‌ కళాశాలలో పరీక్షలు నిర్వహించారు. అభ్యర్థులు గంట ముందే పరీక్ష కేంద్రానికి వచ్చారు. పోలీసులు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆర్‌డిఒ ఎంఎ.అంబరీష్‌, డిఎస్‌పి కె.రవి మనోహరాచారితో కలిసి పరీక్షా కేంద్రాలను పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. స్వర్ణాంధ్రలో మొత్తం వెయ్యి మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా 750 హాజరయ్యారని, 250 మంది గైర్హాజరయ్యారని తహశీల్దార్‌ ఎన్‌ఎస్‌ఎస్‌.ప్రసాద్‌ తెలిపారు. శ్రీసూర్యలో 300 మందికి 250 మంది హాజరయ్యారు. వైన్‌ కళాశాలలో 500 మందికి 413 మంది హాజరయ్యారు.

➡️