బిజెపి ప్రభుత్వాన్ని గద్దె దింపాలి

ప్రజాశక్తి – భీమవరం

పదేళ్ల కాలంలో అన్ని రంగాలనూ అతలాకుతలం చేసి దేశాన్ని అధోగతి పాలు చేసిన బిజెపి ప్రభుత్వాన్ని రాబోయే ఎన్నికల్లో గద్దె దింపాలని ప్రజా సంఘాల నేతలు పిలుపునిచ్చారు. దేశ ప్రజలకు అన్నం పెట్టే రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో చిందిస్తున్న ప్రతి రక్తపుబొట్టుకూ మోడీ తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. సంయుక్త కిసాన్‌ మోర్చా, జాతీయ కార్మిక సంఘాల్లో భాగంగా భీమవరంలో చేపట్టిన గ్రామీణ బంద్‌ విజయవంతమైంది. కార్మికులు, కర్షకులు, రైతులు, ప్రజలు, వివిధ కార్మిక రైతు, కౌలు రైతు, వ్యవసాయ కార్మిక, ట్రేడ్‌ యూనియన్లు, ప్రజా సంఘాల నేతలు బంద్‌లో భాగస్వాములయ్యారు. స్థానిక సిఐటియు కార్యాలయం నుంచి భారీ ప్రదర్శన ర్యాలీ చేశారు. ఈ ప్రదర్శన పాత బస్టాండ్‌, వెంకటేశ్వర స్వామిగుడి, బొంబాయి స్వీట్‌ సెంటర్‌, అంబేద్కర్‌ సెంటర్‌, ప్రకాశం చౌక్‌, పోలీస్‌ బొమ్మ సెంటర్‌, కొత్త బస్టాండ్‌ వరకూ సాగింది. దారిపొడవునా కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న వ్యతిరేక విధానాలపై చేసిన నినాదాలు హోరెత్తాయి. ప్రకాశం చౌక్‌లో ఏర్పాటు చేసిన సభకు సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బి.వాసుదేవరావు అధ్యక్షత వహించారు. సిఐటియు జిల్లా అధ్యక్షుడు జెఎన్‌వి.గోపాలన్‌, ఎఐటియుసి జిల్లా అధ్యక్షులు కోనాల భీమారావు, రైతు సంఘాల రాష్ట్ర నాయకులు లంకా కృష్ణమూర్తి, చింతకాయల బాబూరావు మాట్లాడుతూ స్వామినాథన్‌ కమిటీ సిఫార్సులు అమలు చేయకుండా స్వామినాథన్‌కు భారతరత్న ఇవ్వడం దేశ ప్రజలను మోసం చేయడమే అన్నారు. రానున్న ఎన్నికల్లో మోడీకి తగిన గుణపాఠం చెప్పాలన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి జక్కంశెట్టి సత్యనారాయణ, ఎఫ్‌ఎంఆర్‌ఎఐ రాష్ట్ర నాయకులు పట్టణ పౌర సమాఖ్య జిల్లా కన్వీనర్‌ ఎం.వైకుంఠరావు, రైతు సంఘం నాయకులు దండు శ్రీనివాసరాజు, ఎం.సీతారాంప్రసాద్‌ మాట్లాడారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఇంజేటి శ్రీనివాస్‌, డి.త్రిమూర్తులు, చల్లబోయిన వెంకటేశ్వరరావు, కె.సత్యనారాయణ, కె.వెంకటేశ్వరరావు, బి.వరలక్ష్మి, సామంతుల ఉదయభాస్కర్‌, కె.కృష్ణ, డి.నాగు, కె.కోదండమ్‌ పాల్గొన్నారు.తాడేపల్లిగూడెం : కేంద్రంలోని మోడీ ప్రభుత్వ రైతు, వ్యవసాయ కార్మిక, కౌలు రైతు, కార్మిక ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా సిఐటియు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ఎన్‌కె గ్రౌండ్‌ నుంచి ఆర్‌టిసి బస్టాండ్‌ వరకూ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిఐటియు జిల్లా కార్యదర్శి కర్రి నాగేశ్వరరావు, ఉపాధ్యక్షులు సిరపరపు రంగారావు, ఆటో యూనియన్‌ పట్టణ అధ్యక్షులు కట్రేడ్డి వెంకటేశ్వరరావు హాజరై మాట్లాడారు. కార్యక్రమంలో సిఐటియు పట్టణ కార్యదర్శి కరెడ్ల రామకృష్ణ, అధ్యక్షులు జవ్వాది శ్రీను, గొన్నాబత్తుల నాగేశ్వరరావు, పబ్బాని సురేష్‌, శిద్దిరెడ్డి శేషుబాబు, శ్రీను, పెనుగంటి దుర్గ, నాగేంద్రబాబు, గొర్రెల సతీష్‌ కుమార్‌ పాల్గొన్నారు.నరసాపురం : వ్యవసాయ కార్పొరేట్లకు అప్పగించిన మూడు వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కవురు పెద్దిరాజు డిమాండ్‌ చేశారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వ రైతు, వ్యవసాయ కార్మిక, కౌలు రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా నరసాపురంలో నిరసన తెలిపారు. బస్‌స్టాండ్‌ సెంటర్‌ నుంచి గాంధీ బొమ్మ సెంటర్‌ వరకూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్‌ సెంటర్లో నిరసన తెలిపారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు తెలగంశెట్టి సత్యనారాయణ, సిఐటియు పట్టణ అధ్యక్షులు ముచ్చర్ల త్రిమూర్తులు, పట్టణ కార్యదర్శి పొన్నాడ రాము, జల్లి రామ్మోహనరావు, బొక్కా శ్రీనివాస్‌, గుబ్బల నాగేశ్వరరావు, నోముల కొండ పాల్గొన్నారు. ఎఐటియుసి అనుబంధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం కార్మిక, రైతాంగ వ్యతిరేక చర్యలకు నిరసనగా కార్మికులు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి నెక్కంటి క్రాంతి కుమార్‌, పట్టణ కార్యదర్శి ఆరేటి మృత్యుంజయరావు, సానబోయిన ఫణి రాజు, గుమ్మడి శ్రీను, మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు నెక్కంటి సుబ్బారావు పాల్గొన్నారు.తణుకురూరల్‌ : దేశానికి అన్నం పెట్టే రైతులు, సంపద సృష్టి కర్తలని, కార్మికులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వ మనుగడా సాగదని సిఐటియు జిల్లా కార్యదర్శి పివి.ప్రతాప్‌, ఎఐటియుసి జిల్లా నాయకులు బొద్దాని నాగరాజు హెచ్చరించారు. సిఐటియు, ఎఐటియుసి ఆధ్వర్యంలో నరేంద్ర సెంటర్‌ నుంచి కోర్టు, బిఎస్‌ఎన్‌ఎల్‌ మీదుగా మున్సిపల్‌ కార్యాలయం వరకూ ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కార్యక్రమంలో గార రంగారావు, పి.దక్షిణామూర్తి, పిఎల్‌ నర్సింహారావు, మందుల ముత్తయ్య, విఎ.రాజు, ఎన్‌.ఆదినారాయణ, సంకు మనోరమ, అడ్డగర్ల అజయకుమారి, గిద్దా అన్నపూర్ణ, గండ్రాపు శ్రీను పాల్గొన్నారు.పాలకొల్లు : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక, కర్షక, ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పాలకొల్లులో వివిధ కార్మిక సంస్థలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం గాంధీ బొమ్మ సెంటర్‌ వద్ద ధర్నా నిర్వహించారు. ధర్నాలో సిఐటియు మండల కార్యదర్శి జవ్వాది శ్రీనివాస్‌, కార్మిక నేతలు గుబ్బల సత్యనారాయణ, గంగరాజు, పురుషోత్తం, జి.వెంకటేశ్వరరావు, ఆకుల ప్రసాద్‌, వీర సత్యనారాయణ, టి.సూర్యనారాయణ, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.

➡️