మహిళా ఓటర్లకు చీర ‘ఎర’..!

ప్రజాశక్తి – ఏలూరు ప్రతినిధి

ఎన్నికల షెడ్యూల్‌, నోటిఫికేషన్‌ వెలువడకుండానే ఓటర్లను వలలో వేసుకునేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎంఎల్‌ఎ అభ్యర్థులు ఇప్పటి నుంచే తాయిలాల పంపిణీకి తెరలేపారు. ముఖ్యంగా మహిళా ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు డ్వాక్రా మహిళలకు చీరల పంపిణీ ప్రారంభించారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఎంఎల్‌ఎ అభ్యర్థులు వ్యవహరిస్తున్న తీరు సర్వత్రా చర్చనీయాంశమైంది. మరో నెలరోజులకుగాని ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చే అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు. ఇంకా ప్రధాన ప్రతిపక్ష పార్టీలైన టిడిపి, జనసేన అభ్యర్థులను అధికారికంగా ప్రకటించలేదు. ఇరుపార్టీల్లో తమకు సీటు గ్యారెంటీ అనుకున్న అభ్యర్థులు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం ప్రారంభించడమే కాకుండా, తాయిలాల పంపిణీకి సైతం తెరలేపిన పరిస్థితి ఉంది. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో 14 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇప్పటికే పాలకొల్లు, ఆచంట నియోజకవర్గాల్లో డ్వాక్రా మహిళలకు చీరల పంపిణీ పూర్తయినట్లు తెలిసింది. పాలకొల్లులో వైసిపి, టిడిపి అభ్యర్థులు ఇద్దరూ పోటాపోటీగా డ్వాక్రా మహిళాలకు చీరలు అందించినట్లు తెలుస్తోంది. ఆచంట నియోజకవర్గంలో మాత్రం వైసిపి అభ్యర్థి ఇప్పటికే చీరలు పంపిణీ పూర్తి చేసినట్లు సమాచారం. ఆసరా చెక్కుల పంపిణీ సందర్భంగా అధికార పార్టీ అభ్యర్థులు డ్వాక్రా మహిళలను సమావేశాలకు పిలిచి భోజనాలు పెట్టి, చీరలు అందజేసినట్లు చెబుతున్నారు. ఉండి నియోజకవర్గంలో సిట్టింగ్‌ ఎంఎల్‌ఎ ప్రతి ఓటరుకూ కంచం పంపిణీ చేసినట్లు తెలుస్తోంది. మిగిలిన నియోజకవర్గాల్లోనూ మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు ఎత్తులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చిన తర్వాత అధికారుల నిఘా పెరుగుతుందని, తాయిలాల పంపిణీకి ఇబ్బంది వస్తుందనే కారణంతో అధికార పార్టీ అభ్యర్థులు ముందుగానే అధికార యంత్రాంగం అండతోనే చీరల పంపిణీ సాగించేస్తున్నారు. దీంతో ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులు కూడా అదేబాటలో నడుస్తున్నారు. ఇదంతా బహిరంగంగానే జరుగుతున్న అధికార యంత్రాంగం పట్టనట్లు వ్యవహరిస్తోంది. ఇంతకుముందు ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడిన తర్వాత, ఎన్నికలకు 48 గంటల ముందు అభ్యర్థులు తాయిలాల పంపిణీ చేపట్టేవారు. ఈసారి ముందుగానే ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు చీరల పంపిణీ చేపట్టడం చూస్తే ఈ ఎన్నికలు ఏవిధంగా జరుగుతాయోననే చర్చ నడుస్తోంది. ఎన్నికల ముందు రోజు పరిస్థితి వేరట..! ప్రస్తుతం చీరల పంపిణీతో సరిపెడుతున్నామని, ఎన్నికల ముందు పరిస్థితి వేరుగా ఉంటుందని ఇరు పార్టీలకు చెందిన నాయకుల్లో చర్చ నడుస్తోంది. గత ఎన్నికల్లోనూ ఓటుకు రూ.500 నుంచి రూ.రెండు వేల వరకూ పంపిణీ సాగింది. ఈసారి అంతకంటే ఎక్కువగా డబ్బు కుమ్మరించనున్నట్లు చెబుతున్నారు. అందుకోసం ఇప్పటి నుంచే అన్ని ఏర్పాట్లూ చేసేస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల షెడ్యూల్‌ వస్తే పోలీసులు, అధికారుల నిఘా పెరిగిపోతుందని, అధికారులంతా ఎన్నికల కమిషన్‌ చెప్పినట్లు నడుచుకుంటారని అంచనా వేస్తున్నారు. ఇప్పుడైతే అధికారులు తాము చెప్పినట్లు వింటారని అధికార పార్టీ అభ్యర్దులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎంత ఖర్చు పెట్టాలి, ఏవిధంగా పంపిణీ చేయాలనే వ్యూహాలు ఇప్పటికే సిద్ధం చేసుకుని అధికార పార్టీ నాయకులు రెఢగాీ ఉన్నట్లు సమాచారం. ప్రతిపక్ష పార్టీల అభ్యర్థుల జాబితాను ఇంకా ప్రకటించకపోవడంతో ముందుకు, వెనక్కి ఆలోచన చేస్తున్నట్లు చెబుతున్నారు. ఈసారి ఎన్నికల్లో డబ్బు పెద్దఎత్తున కుమ్మరించి గెలుపు దక్కించుకోవాలని ప్రధాన పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎంఎల్‌ఎ అభ్యర్థులు పంపిణీ చేస్తున్న తాయిలాలపై అధికారులు స్పందించకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముందుముందు పరిస్థితి ఏవిధంగా ఉంటుందో వేచిచూడాలి.

➡️