మార్టేరు వ్యవసాయ పరిశోధనా స్థానం ఏ 62 వరి వంగడాలు

Mar 31,2024 21:46

దేశ ఆర్థిక వృద్ధికి దోహదం
ఎడిఆర్‌ డాక్టర్‌ ధన్యంరాజు శ్రీనివాస్‌
ప్రజాశక్తి – పెనుమంట్ర
మార్టేరు వ్యవసాయ పరిశోధనా స్థానంలో రూపొందిన పలు వరి రకాలు ప్రాచుర్యంలో ఉన్నాయని ఎడిఆర్‌ డాక్టర్‌ ధన్యంరాజు శ్రీనివాస్‌ అన్నారు. ఆదివారం ఆయన ప్రజాశక్తితో మాట్లాడారు. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 350 కోట్ల మంది ప్రజలు వరిని ఆహారంగా తీసుకుంటున్నారన్నారు. ఇందుకోసం సాలీనా దాదాపు 160 మిలియన్‌ హెక్టార్లలో వరిపంట సాగు చేస్తూ, సుమారు 700 మిలియన్‌ టన్నుల ధాన్యం ఉత్పత్తి చేయడం జరుగుతుందని తెలిపారు. భారతదేశం ఏడాదికి సుమారు 47 మిలియన్ల హెక్టార్లలో వరి పంటను పండిస్తూ, దాదాపు వంద మిలియన్‌ టన్నుల బియ్యాన్ని ఉత్పత్తి చేస్తుందని చెప్పారు. రైతుల అవసరాలకు అనుగుణంగా అనువైన వరి వంగడాలను రూపొందించడంలో మార్టేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంకు విశిష్ట స్థానం ఉందన్నారు. 1925లో ఏర్పడిన ఈ కేంద్రం వచ్చే ఏడాది శత జయంతి ఉత్సవాలకు సిద్ధమవుతుందని తెలిపారు. ఈ నూరేళ్ల చరిత్రలో ఈ పరిశోధనా స్థానం 62 రకాల వంగడాలు రూపొందించి, విడుదల చేయడం ద్వారా దేశ ఆర్థిక వృద్ధికి ఎంతగానో దోహదపడిందన్నారు. ఈ పరిశోధనా స్థానం నుంచి విడుదలైన వరి రకాల్లో స్వర్ణ, కాటన్‌ దొర సన్నాలు, విజేత, శ్రీ ధృతి రకాలు మిక్కిలి ప్రాచుర్యం పొందాయని చెప్పారు. ప్రస్తుతం స్వర్ణ రకం మన దేశంలోనే కాకుండా ప్రపంచంలోని వివిధ దేశాల్లో గణనీయమైన విస్తీర్ణంలో సాగు చేస్తున్నారని తెలిపారు. మార్టేరు స్థానం నుంచి విడుదలైన రకాలు దేశీయంగా సుమారు 20 శాతం విస్తీర్ణంలో సాగు చేయబడుతూ, దేశ వరి ఉత్పత్తిలో 25 శాతం సాధించడం ఈ స్థానం విశిష్టతకు తార్కాణమని డాక్టర్‌ శ్రీనివాస్‌ చెప్పారు. వ్యవసాయ రంగ అభివృద్ధి పట్ల, రైతాంగ సమస్యల పట్ల ప్రజాశక్తి యాజమాన్యానికి ఉన్న నిబద్దతను ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు.

➡️