మోతాదుకు మించి..!

ప్రజాశక్తి – ఏలూరు ప్రతినిధి

రబీ సాగులో ఎరువుల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. నాట్లు ఆలస్యం కావడంతో వరి దుబ్బులు త్వరగా తయారు కావాలన్న భావనతో ఎరువులను పెద్దఎత్తున వేస్తున్నారు. గుళికలు, పురుగుమందుల వాడకం సైతం అదేరీతిన కొనసాగుతోంది. దీంతో రబీలో పెట్టుబడి ఖర్చు భారీగా అవుతుండటంతో రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. నాట్లు ఆలస్యంతో రబీ దిగుబడులపై రైతుల్లో గుబులు నెలకొనడం, పెట్టుబడులు అధికమవుతున్న తీరు అన్నదాతను తీవ్రంగా కలచివేస్తోంది. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాలవ్యాప్తంగా రబీలో దాదాపు మూడు లక్షల ఎకరాల్లో రైతులు వరిసాగు చేపట్టారు. డిసెంబర్‌ మొదటివారంలో మిచౌంగ్‌ తుపాను విరుచుకుపడటంతో రబీసాగుపై తీవ్ర ప్రభావం పడింది. ఖరీఫ్‌ మాసూళ్లు పూర్తి చేసి రబీ నారుమడులు వేసేసరికి డిసెంబర్‌ నెలాఖరైంది. దీంతో గతంలో ఎన్నడూ లేనివిధంగా దాదాపు 25 రోజుల వరకూ నాట్లు ఆలస్యమయ్యాయి. ఫిబ్రవరి పదో తేదీ వరకూ రబీ నాట్లు కొనసాగుతూనే ఉన్నాయి. నాట్లు ఆలస్యం కావడంతో పంట ఆలస్యమయ్యే పరిస్థితి నెలకొంది. ఈ ఏడాది మే నెలాఖరు వరకూ రబీ మాసూళ్లు సాగే అవకాశం ఉందని రైతుల అంచనా. దీంతో వరిపైరు త్వరగా ఎదిగేలా చేయాలని రైతులు భావిస్తున్నారు. దీంతో గతంలో ఎన్నడూ లేనివిధంగా ఎరువుల వాడకం భారీగా వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. ఎకరాకు గతంలో నాలుగు బస్తాల ఎరువులు మాత్రమే వాడేవారు. ఇప్పుడు ఏకంగా ఏడు నుంచి ఎనిమిది బస్తాల వరకూ ఎరువులు వేస్తున్నట్లు రైతులు చెబుతున్నారు. దీనిలో సగం యూరియా, మరో సగం డిఎపి, 28-28-0, 14-14-0 వంటి కాంప్లెక్స్‌ ఎరువులను వాడుతున్నారు. కాంప్లెక్స్‌ ఎరువుల బస్తా రూ.1700 పలుకుతోంది. ఈసారి ఎకరాకు రెండు బస్తాలు అదనంగా వేస్తుండటంతో ఎరువుల నిమిత్తమే రూ.నాలుగు వేలు పెట్టుబడి అదనంగా అవుతుందని అన్నదాత ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. పంట అనుకున్న సమయానికి పక్వానికి రాకపోతే నీటిఎద్దడి సమస్య తప్పదని రైతులు ఆందోళన చెందుతున్నారు. దీంతో 20 రోజుల వ్యవధిలోనే ఎకరాకు నాలుగు బస్తాలకుపైగా ఎరువులు వేస్తున్నారు. ఎరువులతోపాటు గుళికలు, పురుగుమందుల నిమిత్తం సైతం రైతులు పెద్దఎత్తున ఖర్చు పెడుతున్నారు. ఎరువుల వాడకంపై రైతులకు అవగాహన కల్పించడంలో అధికారులు విఫలమయ్యారనే విమర్శలు సైతం విన్పిస్తున్నాయి. దీంతో గతంతో పోలిస్తే ప్రస్తుత రబీ సీజన్‌లో పెట్టుబడి ఖర్చు వరిసాగులో ఎకరాకు రూ.ఐదు నుంచి రూ.ఆరు వేల వరకూ పెరిగినట్లు రైతులు చెబుతున్నారు. ఈసారి ఎకరాకు రూ.45 వేలు వరకూ పెట్టుబడి అవనున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ఇంత పెద్దఎత్తున పెట్టుబడి ఖర్చు పెడుతున్న రైతులకు రబీ దిగుబడులపై లోలోన గుబులు నెలకొంది. నాట్లు ఆలస్యం కావడంతో దిగుబడిపై ప్రభావం చూపే ప్రమాదం ఉందని రైతులు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే తీవ్ర నష్టాలు తప్పవని లోలోన ఆందోళన చెందుతున్నారు. కొల్లేరును ఆనుకుని ఉన్న గ్రామాల్లో భూములతోపాటు వివిధ మండలాల్లో శివారు భూములకు నీటిఎద్దడి సమస్య వస్తే పరిస్థితి మరింత ప్రమాదకరంగా ఉంటుందని అన్నదాత భయపడుతున్నాడు. ఎరువులు, పురుగుమందుల వాడకం పెరిగిపోవడం సైతం పంట దిగుబడులపై ప్రభావం చూపే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఖరీఫ్‌లో తుపాను దెబ్బకు తీవ్రంగా నష్టపోయిన రైతులంతా రబీసాగుపైనా ఆశలు పెట్టుకున్నారు. రబీ పంట సక్రమంగా చేతికి అందకపోతే జిల్లా రైతాంగం కోలుకోలేని దెబ్బతినే పరిస్థితి ఏర్పడనుంది.

➡️