రాయలంలో భారీ అగ్నిప్రమాదం

 

ప్రజాశక్తి – భీమవరం రూరల్‌

భీమవరం మండలం రాయలం గ్రామ పరిధిలో ప్లాస్టిక్‌ స్క్రాప్‌ గొడౌన్‌లో ఆదివారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పెద్దఎత్తున అగ్నికీలలు ఎగసి పడి దట్టమైన పొగ అలుముకోవడంతో చుట్టుపక్కల ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. భీమవరంలోని రెండు ఫైరింజన్లుతోపాటు ఆకివీడు ఫైరింజన్‌ కూడా రంగంలోకి దిగి మంటలు అదుపు లోకి తీసుకొచ్చాయి. జిల్లా అసిస్టెంట్‌ ఫైరాఫీసర్‌ సిహెచ్‌.సూర్యప్రకాష్‌ ఆధ్వర్యంలో సుమారు రెండు గంటలకుపైగా 20 మంది సిబ్బంది కష్టపడి మంటలను అదుపు చేశారు. చుట్టుపక్కల అపార్టుమెంట్లు ఉండటంతో వాటిలోని ప్రజలంతా ఆందోళనకు గురయ్యారు. ఈ సందర్భంగా ప్రమాదంపై ఫైరాఫీసర్‌ సూర్యప్రకాష్‌ మాట్లాడుతూ గొడౌన్‌ వెనుక భాగంలో చెత్తకు నిప్పంటించడంతో ఆ మంటల కారణంగా గొడౌన్‌లో సామగ్రి దగ్ధమైం దన్నారు. ఈ ప్లాస్టిక్‌కు మండే గుణం ఉండడంతో ఒక్కసారిగా మంటలు, పొగ పెద్దఎత్తున ఎగసిపడ్డా యన్నారు. నష్టం అంచనా వేయాల్సి ఉందని తెలిపారు.

➡️