సమస్యల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ వహించాలి

జిల్లా కలెక్టర్‌ ప్రశాంతి

ప్రజాశక్తి – భీమవరం

జగనన్నకు చెబుదాం, స్పందన సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టరు పి.ప్రశాంతి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో జగనన్నకు చెబుదాం, స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా నలుమూలలా ప్రజల నుంచి వచ్చిన 230 వినతలను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు మాట్లాడుతూ జగనన్నకు చెబుదాం – స్పందన అర్జీలను అర్జీదారులు సంతృప్తి చెందే స్థాయిలో నాణ్యతతో పరిష్కరించాలని, సంబంధిత అధికారులను ఆదేశించారు. అదేవిధంగా స్వీకరించిన అర్జీలకు తప్పనిసరిగా ఎండార్స్మెంట్‌ అంద జేసేలా చర్యలు తీసుకోవడంతో పాటు అర్జీదారులకు ఇచ్చే ఎండార్స్మెంట్‌ను కార్యాలయాల వద్దకు పిలిపించి అందజేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. అర్జీదారులు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు అర్జీలను తప్పనిసరిగా పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఇన్‌ఛార్జి డిఆర్‌ఒ బి.శివనారాయణరెడ్డి, ట్రెయినీ డిప్యూటీ కలెక్టరు, ఇన్‌ఛార్జి జిల్లా గృహ నిర్మాణ శాఖ పీడీ కానాల సంగీత్‌ మాధర్‌, జిల్లా వార్డు, గ్రామ సచివాలయాల అధికారి కెసిహెచ్‌.అప్పారావు, ఇన్‌ఛార్జి డిఆర్‌డిఎ పీడీ ఎంఎస్‌ ఎస్‌ వేణుగోపాల్‌, ఇన్‌ఛార్జి జిల్లా పంచాయతీ శాఖ అధికారి ఎం. నాగలత పాల్గొన్నారు.కలెక్టరు ప్రశాంతికి వినతి ఎపి వికలాంగ సంఘాల ఐక్య కార్యచరణ సమితి జిల్లా జెఎసి జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాంతికి వినతిపత్రం అందజేశారు. జిల్లా అధ్యక్షులు దిడ్ల సురేష్‌, ఆర్గనైజింగ్‌ కార్యదర్శి బొమ్మిడి అప్పారావు, కార్యనిర్వాహక సభ్యులు కందుల సురేష్‌, మరో 17 మంది సభ్యులు కలిసి 20 డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందించి సమస్యలు విన్నవించారు. ముఖ్యంగా ఆర్‌పిడి యాక్ట్‌ 2016 వెంటనే అమలు చేయాలన్నారు. వికలాంగులకు అంత్యోదయ అన్న యోజన రేషన్‌ కార్డు మంజూరు చేయాలని, సామాజిక పెన్షన్‌ రూ.3 వేల నుంచి రూ.6 వేలకు పెంచాలని కోరారు. వారి సమస్యల పట్ల జిల్లా కలెక్టరు సానుకూలంగా స్పందించారు.

➡️