కార్పొరేషన్లు కకావికలం..!

బిసి, ఎస్‌సి, ఎస్‌టి, మైనార్టీ కార్పొరేషన్లు నిర్వీర్యం
ఐదేళ్లలో ఉపాధి రుణాలకు పూర్తిగా తిలోదకాలు
సంక్షేమ పథకాలకిచ్చే సొమ్ము సామాజిక తరగతుల వారీగా ప్రభుత్వం లెక్క
కార్పొరేషన్ల రుణాలతో గతంలో ఎంతోమందికి జీవనోపాధి
ఎన్నికల తరుణంలో కార్పొరేషన్ల పనితీరుపై తీవ్ర చర్చ
ప్రజాశక్తి – ఏలూరు ప్రతినిధి
వెనుబడిన తరగతులకు అండగా నిలవాల్సిన కార్పొరేషన్లు నిర్వీర్యమైపోయాయనే ఆవేదన అందరిలోనూ వ్యక్తమవుతోంది. గడిచిన ఐదేళ్లలో కార్పొరేషన్ల ద్వారా ఇచ్చే ఉపాధి రుణాలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో బిసి, ఎస్‌సి, ఎస్‌టి, మైనార్టీలకు తీరని నష్టం జరిగింది. సంక్షేమ పథకాల సొమ్మునే సామాజిక తరగతులవారీగా ప్రభుత్వం లెక్కలు చెప్పడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో దాదాపు 40 లక్షల జనాభా ఉన్నారు. వీరిలో బిసి జనాభా దాదాపు 37 శాతం వరకూ ఉండగా, ఎస్‌సి జనాభా 20.6 శాతం, ఎస్‌టి జనాభా 2.8 శాతం, ముస్లిం 2.19, క్రిస్టియన్‌ జనాభా 2.77 శాతం ఉన్నారు. గత ప్రభుత్వాల పాలనలో బిసి, ఎస్‌సి, ఎస్‌టి, మైనార్టీ కార్పొరేషన్ల నుంచి ఆయా తరగతుల ప్రజలకు పెద్దఎత్తున ఉపాధి రుణాలు అందించేవారు. రూ.రెండు లక్షల రుణం అందిస్తే రూ.లక్ష సబ్సిడీని ప్రభుత్వం ఇచ్చేది. రూ.లక్ష రుణం ఇస్తే రూ.50 వేలు సబ్సిడీ వర్తించేది. రుణం తీసుకున్న లబ్ధిదారులు కచ్ఛితంగా ఏదోక ఉపాధి పొందుతున్నట్లు చూపించాల్సి ఉండేది. కిరాణా దుకాణాలు, పాడి పరిశ్రమ, వివిధ రకాల దుకాణాలు ఏర్పాటు చేసుకుని కార్పొరేషన్ల రుణాలతో ఎన్నో కుటుంబాలు ఉపాధి పొందేవి. ఇవికాకుండా రూ.20 లక్షల ఖరీదు చేసే కార్లను సైతం కార్పొరేషన్ల ద్వారా అందించేవారు. బ్యాంకుల ద్వారా రుణాలు ఇచ్చేవారు. కారు నడుపుకుంటూ ప్రతినెలా బ్యాంకులకు వాయిదాలు చెల్లిస్తూ కుటుంబాన్ని పోషించుకునేవారు. కార్పొరేషన్ల రుణ వితరణలో ప్రత్యేక విభాగం నిరంతరం పనిచేసేది. గడిచిన టిడిపి ప్రభుత్వ హయాంలో బిసి, ఎస్‌సి, ఎస్‌టి, మైనార్టీలకు కార్పొరేషన్ల ద్వారా పెద్దఎత్తున రుణాలు మంజూరు చేసిన ప రిస్థితి ఉంది. అప్పట్లో కార్పొరేషన్ల ద్వారా కార్లు పొంది ఇప్పటికీ ఉపాధి పొందుతున్న కుటుంబాలు ఉన్నాయి. అంతకు ముందు కాంగ్రెస్‌ ప్రభుత్వంలోనూ ఇదే ఒరవడి కొనసాగింది. వైసిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్పొరేషన్ల పరిస్థితి పూర్తిగా మారిపోయింది. 56 కార్పొరేషన్లుగా విస్తరించి ఛైర్మన్లను ప్రకటించినప్పటికీ జనానికి ఉపయోగపడని పరిస్థితి ఉంది. గడిచిన ఐదేళ్లలో కార్పొరేషన్ల ద్వారా ఏఒక్క కుటుంబానికీ ఉపాధి లభించని పరిస్థితి ఏర్పడింది. దీంతో జిల్లాలో 60 శాతానికిపైగా ఉన్న వెనుకబడిన సామాజిక తరగతుల ప్రజానీకానికి స్వయం ఉపాధి అవకాశాలు పూర్తిగా కనుమరుగయ్యాయి. అందరికీ అందించే అమ్మఒడి, చేయూత, పెన్షన్లు వంటి పథకాల సొమ్మును ఆయా సామాజిక తరగతులకు ఖర్చు చేసినట్లు ప్రభుత్వం లెక్కలు చూపించడంపై అంతా మండిపడుతున్నారు. సంక్షేమ పథకాలకు ఇచ్చిన సొమ్ముకు, కార్పొరేషన్ల రుణాలకు ఏవిధంగా పోలిక పెడతారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కార్పొరేషన్ల ద్వారా రుణాలందిస్తే చదువుకున్న ఎంతోమందికి ఉపాధి లభించి జీవితంలో నిలదొక్కుకునే వారమని, అటువంటి పరిస్థితి లేకుండా పోయిందని అంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వాలేవీ ఈ విధంగా చేయలేదనే చర్చ నడుస్తోంది. ఎన్నికల తరుణంలో వెనుకబడిన తరగతుల కార్పొరేషన్ల అంశం చర్చనీయాంశంగా మారింది. స్వయం ఉపాధి అవకాశాలు కల్పించే కార్పొరేషన్లను నిర్వీర్యం చేయడంతో వెనుకబడిన తరగతుల ప్రజానీకానికి తీవ్ర నష్టం జరిగిందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.

➡️