‘గన్ని’ గరంగరం

ప్రజాశక్తి – ఏలూరు ప్రతినిధి

భీమడోలు టిడిపి ఏలూరు జిల్లా అధ్యక్షులు, ఉంగుటూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జి గన్ని వీరాంజనేయులు టిడిపి అధిష్టానంపై గరంగరంగా ఉన్నారు. పొత్తులో భాగంగా ఉంగుటూరు టిక్కెట్‌ జనసేన అభ్యర్థి పత్సమట్ల ధర్మరాజుకు కేటాయించినట్లు దాదాపు స్పష్టత వచ్చినట్లు ప్రచారం సాగుతోంది. టిక్కెట్‌ జనసేనకు కేటాయించినట్లు టిడిపి అధిష్టానం గన్నికి చెప్పినట్లు తెలిసింది. టిక్కెట్‌ తనకు కేటాయించకపోవడంపై గన్ని వీరాంజనేయులు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. పొత్తు సరే, విజయావకాశాలు చూడరా అంటూ నియోజకవర్గంలోని టిడిపి నాయకులు, కార్యకర్తల వద్ద గన్ని వాపోయినట్లు తెలుస్తోంది. అత్యవసరంగా నియోజకవర్గంలోని టిడిపి నాయకులు, కార్యకర్తలతో భీమడోలులో గురువారం ఆయన సమావేశం నిర్వహించారు. పార్టీ అధిష్టానం తనకు అన్యాయం చేసిందని తీవ్ర ఆవేదనకు గురైనట్లు తెలుస్తోంది. న్యాయం కోసం ఏం చేయాలో తనకు తెలుసు అని వ్యాఖ్యానించినట్లు సమాచారం. కార్యకర్తలు, నాయకుల నిర్ణయం మేరకు ముందుకు సాగుతానని అన్నట్లు తెలిసింది. ఎన్నికల్లో అస్త్ర సన్యాసం చేస్తామంటూ పలువురు నాయకులు సైతం పేర్కొన్నట్లు చెబుతున్నారు. దీంతో ఉంగుటూరు నియోజకవర్గ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. 2014 ఎన్నికల్లో ఉంగుటూరు నియోజకవర్గం నుంచి గన్ని వీరాంజనేయులు ఎంఎల్‌ఎగా గెలిచారు. 2019 ఎన్నికల్లో ఓటమి చెందారు. ఆ తర్వాత టిడిపి ఏలూరు జిల్లా అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఉంగుటూరు నియోజకవర్గ టిక్కెట్‌ తనకే అంటూ గడిచిన ఐదేళ్లుగా పని చేస్తున్నారు. 2019 ఎన్నికల తర్వాత జనసేన ఉంగుటూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా క్షత్రియ సామాజిక తరగతికి చెందిన పత్సమట్ల ధర్మరాజును నియమించింది. అప్పటి నుంచి ఆయన అనేక కార్యక్రమాలు చేస్తూ తమ పార్టీని మరింతగా జనంలోకి తీసుకువెళ్లారు. టిడిపి, జనసేన పొత్తు ఖరారు కావడంతో ఉంగుటూరు టిక్కెట్‌ గన్నికి ఇస్తారా లేక ధర్మరాజుకు ఇస్తారా అనే సందేహాలు అలముకున్నాయి. తొలి జాబితాలో ఉంగుటూరు స్థానంపై ఇరుపార్టీలూ ఎటువంటి ప్రకటనా చేయలేదు. దీంతో ఇరుపార్టీల నాయకుల్లో మరింత టెన్షన్‌ నెలకొంది. ఉంగుటూరు టిక్కెట్‌పై ఇప్పటికీ అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. అయితే జనసేనకు సీటు కేటాయించినట్లు అధిష్టానం నుంచి నాయకులకు సమాచారం అందినట్లు తెలిసింది. దీంతో టిడిపి టిక్కెట్‌ ఆశించిన గన్ని వీరాంజనేయులు అధిష్టానం తీరుపై మండిపడుతున్నారు. ముందుముందు పరిస్థితి ఏ విధంగా ఉంటుందో వేచిచూడాలి. ఉంగుటూరు సీటుపై పునరాలోచించాలిటిడిపి నేత గన్ని వీరాంజనేయులు ఉంగుటూరు సీటు జనసేనకు కేటాయించడంపై టిడిపి, జనసేన అధినేతలు పునరాలోచన చేయాలి. ఈ సీటు జనసేనకు కేటాయించారని తెలియగానే టిడిపి నాయకులు, కార్యకర్తలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. మధ్యాహ్నం 12 గంటలకు మెసేజీ పెడితే మూడు గంటలకు వేలాది మంది ఇక్కడకు చేరుకున్నారు. కార్యకర్తలు, నాయకుల అభిప్రాయాలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్తాను. రాజీనామాలు, ఆందోళనలు వంటివి వద్దని అందరికీ సర్ది చెప్పాను. పొత్తుతో పాటు, గెలిచే అభ్యర్థుల ఎంపిక కూడా ముఖ్యం. జిల్లా అధ్యక్షునిగా నా అభిప్రాయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తాను. అధినాయకులు సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నాను.

➡️