జిల్లాలో 1461 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు

140 మంది సెక్టార్‌ అధికారుల నియామకం
కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌
ప్రజాశక్తి – భీమవరం
రాబోయే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జిల్లాలో 1461 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశామని కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి సుమిత్‌కుమార్‌ తెలిపారు. 140 మందిని సెక్టార్‌ అధికారులుగా నియమించామని, ఎన్నికల విధుల్లో వీరంతా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లో బుధవారం నరసాపురం, పాలకొల్లు, ఆచంట నియోజకవర్గాల సెక్టార్‌ అధికారులకు కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ ఆధ్వర్యాన శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ సెక్టార్‌ పరిధిలో ఏదైనా సమస్య ఉంటే వెంటనే రిటర్నింగ్‌ అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. సెక్టార్‌ అధికారికి పోలింగ్‌కు వారం రోజులు ముందు మేజిస్ట్రేట్‌ అధికారాలు ఇస్తారన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలతో మమేకమై సమాచారం సేకరించి పోలింగ్‌ స్టేషన్లను మ్యాపింగ్‌ చేయాలన్నారు. పోలింగ్‌ రోజు ఉదయం 5.30 గంటల తర్వాత మాక్‌ పోలింగ్‌ నిర్వహించాల్సి ఉంటుందన్నారు. ఆ సమయానికి ఒక్క ఏజెంట్‌ వచ్చినా 15 నిమిషాలు వేసి చూసి మాక్‌ పోలింగ్‌ ప్రారంభించాలన్నారు. ఏజెంట్లు ఎవరూ రాకపోతే ఉదయం 6.25 నిమిషాల వరకు వేచి చూసి ఆ తర్వాత మాక్‌ పోలింగ్‌ నిర్ణీత సమయంలోపు పూర్తి చేయాలన్నారు. మాక్‌ పోలింగ్‌ సమయంలో 50 ఓట్లను వేసి పరిశీలించాల్సి ఉందన్నారు. అలాగే బియు యూనిట్‌ పని చేయక మార్చిన సందర్భంలో కూడా మాక్‌ పోలింగ్‌ నిర్వహించాల్సి ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఇన్‌ఛార్జి డిఆర్‌ఒ బి.శివన్నారాయణరెడ్డి, ఇఆర్‌ఒలు, సెక్టార్‌ అధికారులు పాల్గొన్నారు.ఎన్నికల్లో సెక్టార్‌ అధికారుల బాధ్యత కీలకం: జెసి ఉండి: ఎన్నికల నిర్వహణలో సెక్టార్‌ అధికారుల బాధ్యత కీలకమని, ప్రతి అంశాన్నీ క్షుణ్ణంగా అవగాహన చేసుకుని ఎన్నికలను విజయవంతంగా నిర్వహించడానికి కృషి చేయాలని జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.రామ్‌సుందర్‌రెడ్డి తెలిపారు. బుధవారం ఉండి ఎంపిడిఒ కార్యాలయంలో ఉండి నియోజకవర్గ సెక్టార్‌ అధికారులు, పోలీస్‌ అధికారులకు జెసి శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. సెక్టార్‌ అధికారుల పరిధిలోని పోలింగ్‌ స్టేషన్లను ఒకటికి, రెండుసార్లు పరిశీలించుకుని ఎన్నికలకు సిద్ధంగా ఉండాలన్నారు. గత ఎన్నికల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రతి విషయంలో అప్రమత్తంగా మెలగాలని జెసి దిశానిర్దేశం చేశారు.

➡️