పోలీస్‌స్టేసన్‌ వద్ద మృతదేహంతో ఆందోళన

రైతు, కౌలుదారు గ్రూపుల మధ్య ఘర్షణ
పరస్పర కేసులు నమోదు
మూడు రోజుల తర్వాత కౌలు రైతు కుమారుడు మృతి
హత్య కేసుగా నమోదు చేయాలని మృతుని బంధువుల ఆందోళన
పోస్టుమార్టం రిపోర్ట్‌ ఆధారంగా నమోదు చేస్తామని చెప్పిన పోలీసులు
ప్రజాశక్తి – ఆకివీడు
మండలంలోని చినకాపవరం గ్రామానికి చెందిన జనసేన నాయకుడు పెద్దిరెడ్డి శ్రీనివాసరావు కుమారుడు పెద్దిరెడ్డి జాన్‌ పీటర్‌ (నన్ని)(25) సోమవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఫీడర్‌ మృతదేహంతో కుటుంబసభ్యులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఆకివీడు పోలీస్‌ స్టేషన్‌కు చేరారు. జాన్‌ మృతిని హత్యగా నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. ఇందుకు సంబంధించి బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని చినకాపవరం గ్రామానికి చెందిన పెద్దిరెడ్డి శ్రీనివాసరావు ప్రస్తుతం భీమవరంలో కాపురం ఉంటున్న అనంతపల్లి వెంకటరత్నం కుటుంబీకులకు చెందిన పంట భూమిని సుమారు మూడు దశాబ్దాలుగా కౌలుకు సాగు చేస్తున్నారు. అయితే ఆ భూమిని యజమాని వెంకటరత్నం కుటుంబీకులు అమ్మకానికి పెట్టారు. భూమి తానే కొనుక్కుంటానంటూ శ్రీనివాసరావు యజమాని దగ్గరికి వెళ్లాడు. తనకు తగిన ధర రానందున శ్రీనివాసరావుకు అమ్మడానికి యజమాని నిరాకరించారు. ఈ స్థితిలో భూమి ఖాళీ చేయడానికి శ్రీనివాసరావు నిరాకరించాడు. భూ యజమాని వెంకటరత్నం మనుషులు చేలు ఊడుస్తామంటూ ఈ నెల 26వ తేదీ చేలోకి దిగారు. అదే సమయానికి శ్రీనివాసరావు మనుషులు కూడా చేలోకి దిగారు. ఈ క్రమంలో ఇరు గ్రూపుల వారు ఘర్షణ పడ్డారు. ఇరు గ్రూపుల వారు రెండు రోజుల తర్వాత ఆదివారం స్థానిక పోలీస్‌ స్టేషన్‌కు చేరి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఇరు గ్రూపులవారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం భూమి కౌలుదారు శ్రీనివాసరావు కుమారుడు జాన్‌ పీటర్‌ ఆకస్మికంగా మరణించాడు. శుక్రవారం జరిగిన ఘర్షణలో తగిలిన గాయాల వల్ల తన కుమారుడు మరణించాడని జాన్‌ పీటర్‌ తండ్రి శ్రీనివాసరావు ఆరోపించారు. ఆ మేరకు కేసు నమోదు చేయాలంటూ ఆకివీడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేయడం తత్సార్యం చేస్తున్నారంటూ మృతదేహాంతో ఆకివీడు పోలీస్‌స్టేషన్‌ వద్ద ఆందోళన చేశారు. విషయం తెలుసుకున్న ఎంఎల్‌ఎ మంతెన రామరాజు, జనసేన నాయకులు జుత్తిగ నాగరాజు, టిడిపి నాయకులు ముత్యాల వెంకటేశ్వరరావు(రత్నం) పోలీస్‌స్టేషన ్‌కు చేరుకుని కేసు నమోదు చేయాలంటూ పోలీసులతో మాట్లాడారు. ఇదే అంశంపై ఇప్పటికే కేసు నమోదు చేసి ఉన్నందున పోస్టుమార్టం అనంతరం మిగిలిన కేసులు ఉంటాయని పోలీసులు చెప్పారు. అందుకు జనసేన, టిడిపి నాయకులు అంగీకరించలేదు. ఉన్నతాధికారులకు సమాచారం అందించామని, న్యాయ సూచన, సలహాల మేరకు, అధికారుల ఆదేశాలతో వ్యవహరిస్తామని ఎస్‌ఐ నాగబాబు చెప్పారు. టిడిపి, జనసేన నాయకులు ఆ దిశగా తామే ప్రశ్నిస్తామంటూ భీమవరం జిల్లా ఎస్‌పి వద్దకు వెళ్లారు. సమస్యలకు దారి తీయకుండా ముందస్తుగా పోలీసులు సుమారు 30 మంది ఎఆర్‌ సిబ్బందిని, మరో 20 మంది సివిల్‌ సిబ్బందిని దింపారు. భీమవరం రూరల్‌ సిఐ సత్యకిషోర్‌ మరో ముగ్గురు ఎస్‌ఐలు ఆకివీడు స్టేషన్‌కు తరలివచ్చారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భీమవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

➡️