విఒఎలు, యానిమేటర్ల సమస్యలు పరిష్కరించాలి

కలెక్టరేట్‌ వద్ద ధర్నాలో సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అజయకుమారి, నిర్మలాదేవి

ప్రజాశక్తి – భీమవరం

విఒఎలు, యానిమేటర్ల సమస్యలు పరిష్కరించాలని ఎపి వెలుగు విఒఎలు, యానిమేటర్ల ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అజయకుమారి, నిర్మలాదేవి డిమాండ్‌ చేశారు. స్థానిక కలెక్టరేట్‌ వద్ద సోమవారం తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ధర్నా నిర్వహించి కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. గత 24 ఏళ్లుగా విఒఎలు గ్రామస్థాయిలో మహిళలకు బ్యాంకు రుణాలు ఇప్పించి వారి ఆర్థిక సహకారానికి తోడ్పాటు అందిస్తున్నారన్నారు. అటువంటి విఒఎల పట్ల ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరించడం తగదన్నారు. విఒఎలను మూడేళ్ల కాలపరిమితి పేరుతో ఉద్యోగాల నుంచి తొలగించాలని ప్రభుత్వం చూస్తోందని మండిపడ్డారు. అతి తక్కువ వేతనం రూ.8 వేలు మాత్రమే అందిస్తూ అనేక రకమైన సేవలు చేయించుకోవడం దారుణమన్నారు. కాలపరిమితి సర్క్యులర్‌ను రద్దు చేయాలన్నారు. హెచ్‌ఆర్‌ పాలపీ అమలు చేయాలని, రూ.10 లక్షలు గ్రూపు ఇన్సూరెన్స్‌ సౌకర్యం కల్పించాలని డిమాండ్‌ చేశారు. విఒఎల మెర్జ్‌ ఆపాలని, అన్ని రకాల బకాయిలు వెంటనే చెల్లించాలన్నారు. విఒఎలకు గుర్తింపు కార్డు, యూనిఫామ్‌ ఇవ్వాలన్నారు. పొదుపు మహిళలకు రూ.20 లక్షలకు సున్నా వడ్డీ వర్తింపజేయాలన్నారు. కార్యక్రమంలో ఎన్‌.గోవిందమ్మ, ఆర్‌.విజయకుమారి, శేషారత్నం, పి.లక్ష్మి, హబీబా, కె.రామలక్ష్మి, కళ్యాణి, జ్యోతి, అంగనవాడీ యూనియన్‌ కార్యదర్శి డి.కళ్యాణి పాల్గొన్నారు.

➡️