ప్రజాశక్తి – భీమవరం
జిల్లాలో నూటికి నూరుశాతం పన్ను వసూలుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు జిల్లా పంచాయతీ అధికారి బి.అరుణశ్రీ తెలిపారు. పన్ను వసూలు ప్రక్రియను వేగవంతం చేసేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నామన్నారు. పన్ను వసూలు మందకొడిగా ఉన్న మండలాలు, గ్రామాల్లో ప్రత్యేకంగా కేంద్రీకరించామన్నారు. జిల్లా వ్యాప్తంగా రూ.34 కోట్లు డిమాండ్ ఉందని, దీనిలో ఇప్పటివరకూ రూ.20 కోట్లు వసూలు చేసినట్లు తెలిపారు. ఈ నెల 31వ తేదీ నాటికి మిగిలిన పన్నుల సొమ్ము మొత్తాన్ని వసూలు చేసేవిధంగా చర్యలు వేగవంతం చేశామన్నారు. జిల్లాలో పన్ను వసూలు, పారిశుధ్య నిర్వహణ, ప్లాస్టిక్ నిషేధం, చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాల ఏర్పాటు వంటి విషయాలను ప్రజాశక్తి నిర్వహించిన ముఖాముఖిలో డిపిఒ అరుణశ్రీ వివరించారు.ప్రశ్న : జిల్లాలో ఎన్ని మండలాలు ఉన్నాయి? ఎన్ని గ్రామాలు ఉన్నాయి?డిపిఒ: జిల్లాలో 20 మండలాలు ఉన్నాయి. వీటి పరిధిలో 409 గ్రామాలు ఉన్నాయి. ప్రశ్న : జిల్లాలో పన్ను వసూలుకు సంబంధించి డిమాండ్ ఎంత ఉంది? ఇప్పటివరకూ ఎంతమేర వసూలు చేశారు?డిపిఒ : 2024-2025 సంవత్సరానికి సంబంధించి రూ. 30 కోట్ల డిమాండ్ ఉంది. ఇప్పటివరకు రూ. 20 కోట్ల పన్ను వసూలు చేశాం. జిల్లా వ్యాప్తంగా 60 శాతం పన్ను వసూలు నమోదైంది.ప్రశ్న : పాత ఎరియర్ బకాయి ఎంత ఉంది?డిపిఒ: జిల్లా వ్యాప్తంగా ఉన్న వివిధ గ్రామ పంచాయతీల్లో సుమారు రూ.4 కోట్ల 48 లక్షల పాత ఏరియల్ బకాయి ఉంది. దీనిలో ఇప్పటికే కొంతమేర వసూలు చేశాం. పాత ఏరియర్ బకాయి వసూలుపై దృష్టి పెట్టడం జరిగింది.ప్రశ్న : కోటి రూపాయలు బకాయిలున్న గ్రామాలేమైనా ఉన్నాయా?డిపిఒ : కొవ్వాడ, అన్నవరం, వేల్పూరు, గణపవరం, అత్తిలి వంటి ప్రాంతాల్లో రూ.కోటి వరకూ బకాయి పేరుకుపోయింది. పాలకొల్లు, తేతలి, ఉండి, భీమవరం, పెనుగొండ, మండపాక వంటి ఒక్కో ప్రాంతాల్లో రూ.90 లక్షల వరకూ బకాయి ఉంది.ప్రశ్న : నూరుశాతం పన్ను వసూలు చేసిన గ్రామాలు ఉన్నాయా? ఇటువంటి గ్రామాలకు ఏమైనా తోడ్పాటు అందించారు?డిపిఒ : కోమటితిప్ప, మొగల్తూరు, కొత్త నవరసపురం, మైప, వేండ్ర అగ్రహారం, చింతపర్రు, జగన్నాధపురం, మినిమించిలిపాడు, తూర్పుపాలెం, పి.పోలవరం, అప్పన్న చెరువు, వద్దిపర్రు, తోకలపూడి, అప్పారావుపేట, కృష్ణయ్యపాలెం గ్రామాల్లో నూరు శాతం పన్ను వసూలు చేయడం జరిగింది. ఈ గ్రామాల్లో పనిచేస్తున్న పంచాయతీ కార్యదర్శులను జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించి మెమోంటోలతో సత్కరించారు. ప్రశ్న : పన్ను వసూలుకు ఎటువంటి చర్యలు చేపట్టారు? ఎప్పటిలాగా పూర్తి చేస్తారు?డిపిఒ : ఈ ఏడాది పన్ను వసూలుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నాం. బకాయి ఎక్కువ ఉన్న మండలాలు, గ్రామాల్లో ప్రత్యేక డ్రైవ్ ఏర్పాటు చేశాం. ఉదయం నుంచి సాయంత్రం వరకూ పన్ను వసూలుపైనే సిబ్బంది అంతా పనిచేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నెల 31వ తేదీలోపు నూరు శాతం వసూలు చేయాలని లక్ష్యంగా తీసుకుని ముందుకు సాగుతున్నాం.ప్రశ్న : పారిశుధ్యం మెరుగుదలకు ఎటువంటి చర్యలు చేపట్టారు?డిపిఒ : జిల్లా వ్యాప్తంగా పారిశుధ్య మెరుగుదలకు ప్రత్యేక చర్యలు తీసుకున్నాం. స్వచ్చ్ ఆంధ్ర దివాస్ డేలో భాగంగా ప్రతినెలా మూడో శనివారం పారిశుధ్య నిర్మూలనకు ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించి అమలు చేస్తున్నాం. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి రోడ్డు పక్కన ఎక్కడా చెత్త ఉండకూడదు, చెత్త కనిపించకూడదని పంచాయతీ కార్యదర్శులను ఆదేశించాం. ఇప్పటికీ చర్యలు ముమ్మరం చేశాం.ప్రశ్న : జిల్లాలో ప్లాస్టిక్ నిషేధం అమలు ఏ విధంగా జరుగుతుంది?డిపిఒ: జిల్లాలో ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించాలని ముఖ్య ఉద్దేశంతో కలెక్టర్ చదలవాడ నాగరాణి ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అమలు చేస్తున్నారు. జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలు, గ్రామాల్లో దీన్ని పటిష్టంగా అమలు చేసే విధంగా చర్యలు చేపట్టాం. ప్లాస్టిక్ నిషేధంపై ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు వివిధ కార్యక్రమాలు ఇప్పటికే చేపట్టాం. ప్లాస్టిక్ నిషేధాన్ని పటిష్టంగా అమలు చేసుందుకు చర్యలు వేగవంతం చేశాం.ప్రశ్న : ఎస్‌డబ్ల్యూపిసి కేంద్రాలు ఎన్ని ఉన్నాయి? నిర్వహణ ఎలా జరుగుతుంది?డిపిఒ : చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాల (ఎస్‌డబ్ల్యూపిసి)పై ప్రత్యేక దృష్టి పెట్టాం. జిల్లా వ్యాప్తంగా 200 కేంద్రాలను వినియోగంలోకి తీసుకొచ్చాం. మిగిలిన గ్రామాల్లో ఈనెల 31వ తేదీ నాటికి నెలకొల్పాలనే లక్ష్యం తీసుకున్నాం. ప్రతి ఇంటి నుంచీ చెత్త సేకరించడం జరుగుతుంది. తడి, పొడి చెత్త వేరుచేసి వర్మీ కంపోస్ట్ తయారు చేస్తున్నారు. వీటి ద్వారా ఆదాయం పొందే విధంగా చర్యలు చేపట్టాం. ఇప్పటికే కొన్ని గ్రామ పంచాయతీలు ఎస్‌డబ్ల్యూపిసి కేంద్రాల ద్వారా ఆదాయం పొందుతున్నాయి.