స్వచ్ఛాంధ్ర ర్యాకింగ్స్‌లో ..పశ్చిమకు 24, ఏలూరుకు 15వ స్థానం

స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర లక్ష్య సాధనలో భాగస్వాములు కావాలని పిలుపు

సింగిల్‌ వాడకం ప్లాస్టిక్‌ను తరిమికొడదాంతణుకులో స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో సిఎం చంద్రబాబు

ప్రజాశక్తి – ఏలూరు ప్రతినిధి, తణుకు, రూరల్‌

స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌లో ప్రతి విభాగంలో పనితీరు ఆధారంగా ర్యాంకింగ్స్‌ తయారు చేశామంటూ రాష్ట్రంలో 26 జిల్లాలకు సిఎం ప్రకటించిన ర్యాంకుల్లో పశ్చిమ 97 పాయింట్లతో 24వ స్థానం, ఏలూరు 108 పాయింట్లతో 15వ స్థానంలో నిలిచాయి. జపాన్‌ వంటి దేశాల్లో రోడ్డుపై చెత్త వేయరని, మనకూ అలాంటి అలవాట్లు రావాలని తెలిపారు. స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం తణుకులో సిఎం పర్యటించారు. ఉదయం తొమ్మిది గంటలకు హెలీకాఫ్టర్‌లో తణుకు చేరిన సిఎంకు మంత్రులు, ఎంఎల్‌ఎలు, అధికారులు పుష్పగుచ్ఛాలు ఇచ్చి స్వాగతం పలికారు. అక్కడ నుంచి రోడ్డు మార్గం గుండా ఎన్‌టిఆర్‌ పార్కు, కూరగాయాల మార్కెట్‌, ఐక్యనగర్‌లో సిఎం పర్యటించారు. మున్సిపల్‌ కార్మికులతో కలిసి చెత్త ఊడ్చి ఎత్తిపోశారు. వారితో కలిసి ఫొటోలు దిగారు. కూరగాయల మార్కెట్‌లో వేస్టేజ్‌ను ఎరువుగా మార్చే యంత్రాలను పరిశీలించారు. ఐక్యనగర్‌లో పి4 విధానంలో అభివృద్ధి పనులు, పార్క్‌ నిర్మాణంపై అక్కడి జనంతో మాట్లాడారు. అనంతరం బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ప్రజావేదిక వేదిక ప్రాంగణానికి చేరుకుని ముందుగా అక్కడ ఏర్పాటు చేసి వివిధ శాఖలకు సంబంధించిన స్టాల్స్‌ను పరిశీలించి వేదికపైకి సిఎం చేరుకున్నారు. ముందుగా జిల్లా కలెక్టర్‌ నాగరాణి మాట్లాడుతూ ఒక్కసారి వాడి పారవేసిన ప్లాస్టిక్‌ను నిషేధించే విధంగా కృషి చేస్తున్నామన్నారు. స్టీల్‌ గ్లాసులు, ప్లేట్లు అమల్లోకి తెస్తున్నామని తెలిపారు. కొత్తగా ఏర్పడిన జిల్లా కావడంతో మౌలిక సదుపాయాల కొరత ఉందని, కలెక్టరేట్‌ను ప్రజల భాగస్వామ్యంతో నిర్మించుకునే విధంగా చేయాలని సిఎంను కోరారు. భీమవరాన్ని అర్బన్‌ డవలప్‌మెంట్‌ అధారిటీగా ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం మున్సిపల్‌ కార్మికులు రమణ, దుర్గావెంకటేష్‌, గంగాధరరావులతోపాటు, పరిశుభత్రపై విశేష సేవలందిస్తున్న సూర్యచంద్రరావు, వనజ, గాదం లక్ష్మిని శాలువ కప్పి, జ్ఞాపికతో సిఎం సత్కరించారు. ప్రజావేదికలో పాల్గొన్న నర్సింగరావు, భాస్కరరావు, నందినితో సిఎం ముఖాముఖి మాట్లాడారు. అనంతరం సిఎం చంద్రబాబు మాట్లాడుతూ స్వచ్ఛాంధ్ర లక్ష్య సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణకు అందరూ కృషి చేయాలని, ఇళ్లతో పాటు మన చుట్టూ ఉన్న పరిసరాలు, స్కూళ్లు, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలు, బహిరంగ ప్రదేశాలు, ప్రార్థనా మందిరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందన్నారు. అనంతరం అందరితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు రామానాయుడు, నారాయణ, గొట్టిపాటి రవికుమార్‌, పలువురు ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు, నాయకులు, కార్యర్తలు అధికారులు పాల్గొన్నారు. తణుకు నియోజకర్గ అభివృద్ధి పనులకు సిఎం హామీలు ప్రజావేదిక కార్యక్రమంలో ఎంఎల్‌ఎ ఆరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ తణుకు నియోజకర్గంలో పలు సమస్యలను సిఎం దృష్టికి తీసుకెళ్లారు. ఆటోవర్కర్స్‌, మెకానిక్‌లు దాదాపు ఐదు వేల మంది ఉన్నారని, అటో నగర్‌ ఏర్పాటుకు రూ.ఆరు కోట్ల నిధులు ఇవ్వాలని కోరారు. గత ప్రభుత్వంలో ఇళ్లస్థలాల విషయంలో దోపిడీ జరిగిందని, నిడదవోలుకు దగ్గర కాపవరంలో 23 ఎకరాలు కొనుగోలు చేసి 1,333 మందికి ఇళ్లస్థలాలు ఇచ్చారని, దూరం కావడంతో లబ్దిదారులు ఎవరూ ఇళ్లు కట్టుకోలేదని వారందరికీ న్యాయం చేయాలని కోరారు. టిడ్కో ఇళ్లు ఇవ్వాలని అడిగారు. తణుకులో ట్రాఫిక్‌ నిలిచిపోతోందని, కెనాల్‌ బండ్‌ అభివృద్ధికి నిధులు ఇవ్వాలని కోరారు. జిల్లా ఆసుపత్రి అభివృద్ధికి రూ.20 కోట్లు ఇవ్వాలని సిఎంను ఎంఎల్‌ఎ కోరారు. అంతేకాకుండా సమ్మర్‌ స్టోరేట్‌ ఏర్పాటు, డ్రెయినేజీ సమస్యల పరిష్కారానికి నిధుల సమస్యను సిఎం దృష్టికి తీసుకెళ్లారు. మెయిన్‌ ఆర్‌అండ్‌బి రోడ్డుకు నిధులు, బ్రిడ్జ్‌ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని సిఎంను కోరారు. దీనిపై సిఎం చంద్రబాబు మాట్లాడుతూ రాధాకృష్ణ డైనమిక్‌ ఎంఎల్‌ఎ అని, తన నియోజకవర్గ అభివృద్ధికి పెద్దఎత్తున నిధులు కోరారన్నారు. తణుకు మున్సిపాల్టీ అభివృద్ధికి కృషిచేసిన ముళ్లపూడి హరిశ్చంద్రరావును గుర్తుచేసుకోవాల్సి ఉందని సిఎం తెలిపారు. తణుకు మున్సిపాల్టీ అభివృద్ధికి రూ.50 కోట్లు కేటాయిస్తున్నట్లు సిఎం ప్రకటించారు. అదేవిధంగా ఆర్‌అండ్‌బి రోడ్డు, బ్రిడ్జి నిర్మాణానికి నిధులు కేటాయిస్తామని తెలిపారు. నేషనల్‌ హైవే గ్రాంటుతో ప్రధాన రహదారి పనులు చేసుకోవచ్చన్నారు. జిఎన్‌వి కెనాల్‌ బండ్‌, ఆటోనగర్‌తోపాటు, ఎంఎల్‌ఎ అడిగినా పనులకు నిధులిస్తామన్నారు. తణుకు, భీమవరం రోడ్డు అభివృద్ధికి నిధులిస్తామన్నారు. జిల్లాపై ప్రత్యేక శ్రద్ధ పెడతామని, ఇరిగేషన్‌ పనులు మంత్రి రామానాయుడు చూసుకుంటారన్నారు.సమస్యలపై వినతులు ఇచ్చేందుకు ఎగబడిన జనం ప్రజావేదికకు విచ్చేసిన పలువురు తమ వ్యక్తిగత సమస్యలపై సిఎంకు వినతులు ఇచ్చేందుకు ఎగబడిన పరిస్థితి నెలకొంది. ప్రజావేదికలో ఓ యువతి నందిని మాట్లాడుతూ తన తల్లికి ఆరోగ్యం బాగాలేదని, టెస్టులకు పరీక్షలకు చాలా డబ్బులు ఖర్చు అవుతున్నాయని, పింఛన్‌తోపాటు, సిఎం రిలీఫ్‌ ఫండ్‌ ద్వారా ఆదుకోవాలని సిఎంను కోరింది. సమస్యను పరిష్కరించాలని కలెక్టర్‌కు సిఎం ఆదేశించారు. ఏసమ్మ అనే మహిళ తన కుమార్తెకు మతిస్థితిమతం లేదని, ఆర్యోగ ఖర్చుల భరించలేకపోతున్నామని, ఆదుకోవాలని కోరింది. ఎంఎల్‌ఎను కలవాలని సిఎం తెలిపారు. సిఎంఎ తన ప్రసంగం ముగించుకుని వెళ్లిపోయేటప్పుడు చాలా మంది తమ సమస్యలపై వినతులు సిఎంకు ఇచ్చేందుకు పెద్దఎత్తున గుమిగూడి ఎగబడ్డారు. సిఎం ఆగి చాలా మంది వద్ద వినతులు తీసుకున్నారు. వినతులు ఇవ్వలేని కొంతమంది తీవ్ర నిరాశకు గురయ్యారు. టిడిపి నాయకులు, కార్యర్తలకు దిశానిర్ధేశంస్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ముగిసిన తర్వాత టిడిపి నాయకులు, కార్యకర్తలతో సిఎం ప్రత్యేకం సమావేశమయ్యారు. ఈకార్యక్రమానికి మీడియాకు అనుమతి లేదు. దాదాపు గంటన్నరకు పైగా ఈ సమావేశం సాగింది. అంతర్గత సమాచారం ప్రకారం తాను బాగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని, అదేవిధంగా మీరుకూడా ఉండాలని సిఎం చంద్రబాబు కార్యకర్తలకు సూచించారు. పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. అందుకే ఎక్కడికి వెళ్లినా కార్యకర్తలతో సమావేశం పెడుతున్నానని తెలిపారు. గడిచిన ఐదేళ్లతో అంతా ఇబ్బంది పడ్డామన్నారు. ముఖ్యమంత్రిగా ఉంటూ చాలా కష్టాలు చూస్తున్నానన్నారు. సమస్యలు ఎలా పరిష్కరిస్తారని అంతా అడుగుతున్నారు. దానికి ఒకటే మార్గం.. పారిపోవడం, ఫైట్‌ చేయడం అన్నారు. అఫైట్‌ నేను చేస్తున్నానని తెలిపారు. ఎక్కడైనా కార్యకర్తల కాంట్రాక్ట్‌ బిల్లులు రాజకీయంగా ఆపి ఉంటే చర్యతీసుకునే బాధ్యత మంత్రులు, ఎంఎల్‌ఎలదే అన్నారు. అనుభవం, పరిగెత్తే యువత పార్టీకి అవసరమన్నారు. ఆ విధంగానే పదవులు ఇస్తున్నట్లు తెలిపారు. పార్టీకి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే ఒకటి, రెండుసార్లు చూస్తా, తర్వాత చర్యలు గట్టిగా ఉంటాయని హెచ్చరించారు. ఈసారి మహానాడు కపడలోపెడుతున్నామని తెలిపారు. అంతా ఎప్పుడూ 2029 ఎన్నికల్లో గెలుపుపైనే దృష్టిలో ఉంచుకోవాలన్నారు. పనితీరు బాగాలేని కస్టర్‌ ఇన్‌ఛార్జులను సిఎం మందలించినట్లు సమాచారం. నా చుట్టూ తిరిగితే లాభంలేదు.. మీ పని ప్రజలు చుట్టూ తిరుగుతూ ఓట్లేయించడం.. వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయడం అన్నారు.

➡️