16న గ్రామీణ బంద్‌ను జయప్రదం చేయాలి

రైతు, కార్మిక సంఘాల రౌండ్‌టేబుల్‌ సమావేశం పిలుపు
ప్రజాశక్తి – భీమవరం
ఈ నెల 16న గ్రామీణ బంద్‌, పారిశ్రామిక సమ్మె నేపథ్యంలో మండల, పట్టణ కేంద్రాల్లో జరిగే నిరసన కార్యక్రమాలను జయప్రదం చేయాలని రైతు, కార్మికసంఘాల రౌండ్‌టేబుల్‌ సమావేశం పిలుపునిచ్చింది. స్థానిక సిఐటియు కార్యాలయంలో శనివారం సంయుక్త కిసాన్‌ మోర్చా ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించారు. సమావేశానికి ఎస్‌కెఎం జిల్లా అధ్యక్షులు జుత్తిగ నరసింహామూర్తి అధ్యక్షత వహించారు. జిల్లా కన్వీనర్‌ ఆకుల హరేరాం మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడంలో విఫలమైందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్‌ శక్తులకు కట్టబెడుతుందని విమర్శించారు. గతంలో పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్‌ కోడ్‌లను అమల్లోకి తెచ్చి కార్మికవర్గానికి తీవ్ర అన్యాయం చేసిందన్నారు. ట్రాన్స్‌పోర్టు రంగాన్ని దెబ్బతీయడానికి ప్రమాదకరమైన క్రిమినల్‌ చట్టాన్ని తీసుకురావడాన్ని వ్యతిరేకించాలన్నారు. ఇటీవల తీసుకొచ్చిన ట్రాన్స్‌పోర్టు బిల్లు లారీ యజమానులకు, ఆటో డ్రైవర్లకు ఉరితాడు వంటిదని హెచ్చరించారు. సమావేశంలో వివిధ కార్మిక, రైతుసంఘాల నాయకులు బి.వాసుదేవరావు, మల్లిపూడి ఆంజనేయులు, చింతకాయల బాబూరావు, చెల్లబోయిన రంగారావు, కళింగ లక్ష్మణరావు, దండు శ్రీనివాసరాజు, జక్కంశెట్టి సత్యనారాయణ పాల్గొన్నారు.

➡️