వచ్చే ఐదేళ్లలో 20లక్షల ఉద్యోగాలు

Feb 16,2025 11:56 #West Godavari District

ప్రజాశక్తి-పాలకొల్లు : ప్రతి జనవరిలో జాబ్ క్యాలెండర్, మెగా డీఎస్సీ అంటూ జగన్ నిరుద్యోగులను మోసం, దగా చేశారని మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. పాలకొల్లులో ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం విజయాన్ని కోరుతూ మంత్రి రామానాయుడు ఆదివారం ప్రచారం చేసారు. వచ్చే ఐదేళ్లలో 20లక్షల ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని మంత్రి చెప్పారు. చంద్రబాబు అధికారం చేపట్టిన వెంటనే 16వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డీఎస్సీపై తొలి సంతకం చేశారని గుర్తు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలు ముగియగానే లోకేష్ ఆధ్వర్యంలో డీఎస్సీ విడుదల చేసి, వచ్చే విద్యా సంవత్సరానికి ముందుగానే ఉపాధ్యాయ పోస్టుల నియమకాలు పూర్తి చేస్తాం అన్నారు. వైసీసీ హయాంలో ఉపాధ్యాయులను మద్యం షాపుల దగ్గర విధులకు పెట్టారని గుర్తు చేశారు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందు ప్రతి విద్యార్థికి తల్లికి వందనం అమలు చేస్తాం అన్నారు. ఈ మే నెల నుండి రైతుకు 20వేలు పెట్టుబడి సాయం, అన్నదాత సుఖీభవ అమలు చేయబోతున్నాం అన్నారు. మత్స్యకారులకు ఇచ్చిన హామీ నిలబెట్టుకునేలా, ఏప్రిల్ నెలలో 20 వేలు సాయం అందించబోతున్నాం అన్నారు. రాజధాని అమరావతి, పోలవరం వంటి ముఖ్య ప్రాజెక్టుల పునర్ని నిర్మాణం, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిలుపుదల వంటివి కూటమి ప్రభుత్వ 8 నెలల పాలనలో జరిగాయని చెప్పారు ‌ ఇంకా జిల్లా టిడిపి అధ్యక్షుడు మంతెన రామరాజు, మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్, గవర కార్పొరేషన్ చైర్మన్ మళ్ళ సురేంద్ర తదితరులు పాల్గొన్నారు.

➡️