తణుకు : పశ్చిమగోదావరి జిల్లా సబ్ జూనియర్ అండర్-16 బాలుర, బాలికల కబడ్డీ సెలక్షన్స్ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల తణుకులో నిర్వహించినట్లు కబడ్డీ అసోసియేషన్ సెక్రటరీ యలమరెడ్డి శ్రీకాంత్ తెలిపారు. బాలుర ఎంపికలను టిడిపి నాయకులు బసవ రామకృష్ణ ప్రారంభించగా, బాలికల ఎంపికలను తణుకు పట్టణ బిజెపి అధ్యక్షులు బొల్లాడ నాగరాజు ప్రారంభించారు. ఈ పోటీలకు జిల్లా నలుమూలల నుంచి 200 మంది క్రీడాకారులు హాజరైనట్లు, వారి నుంచి 12 మంది బాలురను, 12 మంది బాలికలను ఎంపిక చేసి కడప జిల్లాలోని పులివెందులలో జరిగే 39వ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు జిల్లా తరపున పంపుతున్నట్లు సెలక్షన్స్ ఆర్గనైజర్ సంకు సూర్యనారాయణ తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు ఆత్మకూరు రామకృష్ణ, తమరాపు సత్యనారాయణ, బండి సోమేంద్ర నాయుడు, ఎస్.భాస్కరశర్మ, వ్యాయామ ఉపాధ్యాయులు కె.షణ్ముఖం పాల్గొన్నారు.
అత్యాచారాలు, హత్యలు ఆగేదెన్నడు?
ఐద్వా జిల్లా కార్యదర్శి పొగాకు పూర్ణ
తణుకు : అంతర్జాతీయ మహిళా దినోత్సవాలు ఎన్ని సంవత్సరాలు జరిగినప్పటికీ బాలికలపై, మహిళలపై, వృద్ధులపై దాడులు, అత్యాచారాలు, హత్యలు జరుగుతూనే ఉంటున్నాయని ఐద్వా జిల్లా కార్యదర్శి పొగాకు పూర్ణ విమర్శించారు. శనివారం స్థానిక అమరవీరుల భవనంలో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం, సిఐటియు ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పూర్ణ మాట్లాడుతూ మహిళలపై దాడులు ఆగటం లేదని, హింస బాగా పెరిగిందని అన్నారు. ఒక పక్క సనాతన ధర్మం పేరుతో మహిళలపై విపరీతమైన అక్కసు కక్కుకుంటున్నారని, మళ్లీ మహిళలను 100 సంవత్సరాలు వెనక్కి నెట్టే విధంగా పాలకులు మాట్లాడుతున్నారని, ఆనాటి సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకురావాలని వారు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఇప్పటికీ చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ ఇవ్వలేదని, ఏకారణంతో అయితే అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఐక్యరాజ్యసమితి ప్రకటించిందో ఆ కారణాలు పక్కకి పోయి మార్చి 8వ తేదీ అంటే మహిళలకి ఒక దండ వేసి, ఒక శాలువా కప్పి, గౌరవించడం లాగా తయారైందని అన్నారు. మహిళలందరూ ఐక్యంగా పోరాటం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐద్వా పట్టణ కార్యదర్శి కొత్తూరి నాగరత్నం, మహిళలు పాల్గొన్నారు.
దుర్గాప్రసాద్‌కు సత్కారం
పాలకోడేరు : వయోవృద్ధుల సంక్షేమ అప్లెంట్ ట్రిబ్యునల్, మండల లీగల్ సర్వీస్ అథారిటీ సభ్యులుగా సేవలు అందిస్తున్న విస్సాకోడేరు గ్రామానికి చెందిన మేళం దుర్గ ప్రసాద్‌కు అరుదైన సత్కారం లభించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బార్ అసోసియేషన్, మండల లీగల్ సర్వీస్ అథారిటీ సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా జడ్జి లక్ష్మీ నారాయణ, బార్ అసోసియేషన్ అధ్యక్షులు న్యూటన్ ఆధ్వర్యంలో సత్కరించారు. సేవలకు గుర్తింపుగా సత్కారం అందుకోవడం నాపై మరింత బాధ్యత పెంచిందని దుర్గాప్రసాద్ వెల్లడించారు.
ప్రతిభావంతులను ప్రోత్సహించాలి : ఎంఎల్‌ఎ
భీమవరం టౌన్ : దాతలందిస్తున్న సహకారాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని భవిష్యత్‌లో ఉన్నత స్థాయికి చేరుకోవాలని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఛైర్మన్, ఎంఎల్‌ఎ పులపర్తి రామాంజనేయులు(అంజిబాబు) అన్నారు. ఆదివారం భీమవరం అల్లూరి సీతారామరాజు సాంస్కృతిక కేంద్రంలో అల్లూరి సీతారామరాజు సేవా సమితి ఆధ్వర్యంలో 47 మంది దాతల సహకారంతో పట్టణంలోని 219 మంది విద్యార్థులకు రూ.10 లక్షల 95 వేల స్కాలర్ షిప్‌లను ఎంఎల్‌ఎ అంజిబాబు అందించారు. ప్రతిభావంతులను ప్రోత్సహిస్తే అన్ని రంగాల్లోనూ రాణిస్తారని, ప్రతిభకు పేదరికం అడ్డుకాదని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ వేగేశ్న కనకరాజు సూరి పాల్గొన్నారు.
మత్స్యకారులకు అండగా ప్రభుత్వం : విప్ నాయకర్
నరసాపురం : మత్స్యకారులకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని రాష్ట్ర ప్రభుత్వ విప్, నరసాపురం ఎంఎల్‌ఎ బొమ్మిడి నాయకర్ అన్నారు. ఆదివారం పట్టణంలోని జనసేన కార్యాలయంలో వేటకు వెళ్లే మత్స్యకారుల బోట్లకు, ప్రభుత్వం అందించే డీజిల్‌పై సబ్సిడీ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా విప్ నాయకర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మత్స్యకారుల జీవనోపాధికి అన్నివిధాల సహకరిస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లు మత్స్యకారుల జీవన స్థితిగతులను అభివృద్ధి పరచడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారుల బోట్లకు డీజిల్‌పై అందిస్తున్న రాయితీని వినియోగించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర కార్యదర్శి చాగంటి మురళీకృష్ణ, మైలా వసంతరావు పాల్గొన్నారు.
బొండాడలో గ్రామ దేవతల జాతర
ప్రజాశక్తి – కాళ్ల
బొండాడ గ్రామంలో గ్రామ దేవతలు పోలేరమ్మ, మహాలక్ష్మమ్మ ఆలయ 50వ వార్షిక జాతర మహౌత్సవాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. ఆదివారం ఉదయం అమ్మవార్ల ఆలయ ప్రాంగణంలో కలశస్థాపన నిర్వహించారు. 16వ తేదీ వరకు ఆలయ ప్రాంగణంలో హోమాలు, పూజలు, సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు, 19న అఖండ అన్నసమారాధన జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు.
బండి ముత్యాలమ్మ సన్నిధిలో యాత్రికులు
ప్రజాశక్తి – మొగల్తూరు
మండలంలోని ముత్యాలపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న బండి ముత్యాలమ్మ అమ్మవారి ఆలయం ఆదివారం యాత్రికులతో కళకళలాడింది. యాత్రికులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కానుకలు, మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో బండి ముత్యాలమ్మ భజన సంఘం ఆధ్వర్యంలో ఆలపించిన గీతాలు యాత్రికులను ఆకట్టుకున్నాయి. ఆలయ కార్యనిర్వాహణాధికారి మోకా అరుణ్ కుమార్, ఛైర్మన్ కడలి మాణిక్యాలరావుల పర్యవేక్షణలో సిబ్బంది, పాలకవర్గ సభ్యులు యాత్రికులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేశారు. ప్రసాదం వితరణ తదితర సేవా కార్యక్రమాలు నిర్వహించారు.