ప్రజాశక్తి – పాలకొల్లు
వచ్చే జనవరి 5, 6, 7 తేదీలలో రాజమహేం ద్రవరంలో నిర్వహించనున్న ఆంధ్ర సార్వత్రిక పరిషత్ ప్రపంచ తెలుగు మహాసభలను జయప్రదం చేయాలని పరిషత్ వ్యవస్థాపన పాలకొల్లు అధ్యక్షులు డాక్టర్ గజల్ శ్రీనివాస్ పిలుపునిచ్చారు. పాలకొల్లు మాంటిస్సోరీ విద్యా సంస్థల ప్రాంగణంలో బుధవారం కరపత్రాలు ఆవిష్కరించారు. తొలి ఆహ్వాన పత్రికను ప్రచార కార్యదర్శి డాక్టర్ పెద్దిరాజు కోలాటి కమిటీ సభ్యుల చేతుల మీదుగా సంస్థ డైరెక్టర్ డాక్టర్ కెవి.కృష్ణవర్మకు అందించారు. ఈ సందర్భంగా గజల్ శ్రీనివాస్, చీఫ్ కన్వీనర్ డాక్టర్ కేశిరాజు రాంప్రసాద్ మాట్లాడుతూ తెలుగు భాషాభిమానులు, భాషా పండితులు, కవులు కళాకారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తెలుగు భాషాభివృద్ధికి కృషి చేస్తున్న వారందరూ సభల్లో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో పరిషత్ సభ్యులు చేగొండి రంగారావు, నాగలింగేశ్వరరావు, మామిడిశెట్టి శ్రీనివాస్, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.
