ఎంఎల్‌ఎ అంజిబాబు
ప్రజాశక్తి – భీమవరం టౌన్
పేదలకు అభయ హస్తం సిఎం సహాయ నిధి అని, బాధిత కుటుంబాలకు ఎన్‌డిఎ కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఛైర్మన్, ఎంఎల్‌ఎ పులపర్తి రామాంజనేయులు(అంజిబాబు) అన్నారు. ఆదివారం ఎంఎల్‌ఎ క్యాంప్ కార్యాలయంలో 39 మంది లబ్ధిదారులకు రూ.46,28,610ల చెక్కులను అంజిబాబు చేతుల మీదుగా అందించారు. ఎంఎల్‌ఎ మాట్లాడుతూ ఆపద సమయాల్లో సిఎం సహాయ నిధికి దరఖాస్తు చేసుకోవాలని, మెరుగైన వైద్యానికి అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని, వైద్యపరంగా ఆపదలో ఉన్నవారికి సకాలంలో చికిత్స కోసం అందిస్తున్న నిధులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్పొరేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందొచ్చని అన్నారు. ఇప్పటి వరకు 5 నెలల్లో 72 మందికి రూ.80,98,251 చెక్కులను భీమవరం నియోజకవర్గంలో అందించామని అన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర నాయకులు కోళ్ల నాగేశ్వరరావు, పొత్తూరి బాపిరాజు, చెనమల్ల చంద్రశేఖర్, బండి రమేష్ కుమార్, పత్తి హరివర్ధన్, యర్రంశెట్టి శివకృష్ణ, ఎంపిటిసి యాళ్లబండి ఇందిర, పడమటి రామకృష్ణ పాల్గొన్నారు.
గుండెపోటుతో లెక్చరర్ మృతి
గణపవరం : గణపవరం డిగ్రీ కాలేజీలో ఇంగ్లీషు లెక్చరర్ టి.అక్కిరాజు శనివారం రాత్రి భీమవరంలోని ఆయన నివాసంలో మృతిచెందినట్లు కాలేజీ ప్రిన్సిపల్ పి.నిర్మలాకుమారి ఆదివారం తెలిపారు. శనివారం రాత్రి గుండెలో నొప్పి రావటంతో ఆయనను కుటుంబ సభ్యులు భీమవరంలోని ప్రయివేటు ఆసుపత్రికి తీసుకువెళ్లారని చెప్పారు. వైద్యం జరుగుతుండగా అక్కిరాజు మృతి చెందారన్నారు. ఆయన మృతికి నిర్మలాకుమారి, కాలేజీ సిబ్బంది తమ సంతాపాన్ని తెలిపారు.
పలుచోట్ల అన్నసమారాధన
గణపవరం : గణపవరం దండు మారెమ్మ జాతర, పిప్పర ముగ్గురమ్మల జాతర మహోత్సవాలు ముగింపు సందర్భంగా ఆదివారం రెండు గ్రామాల్లో భారీ అన్న సమారాధనలు జరిగాయి. ఈ సందర్భంగా ఉంగుటూరు ఎంఎల్‌ఎ పత్సమట్ల ధర్మరాజు, మాజీ ఎంఎల్‌ఎ పుప్పాల శ్రీనివాసరావు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అన్నసమారాధనలో పాల్గొన్నారు.బండి ముత్యాలమ్మ సన్నిధిలో యాత్రికులుమొగల్తూరు : మండలంలోని ముత్యాలపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న బండి ముత్యాలమ్మ అమ్మవారి ఆలయం ఆదివారం యాత్రికులతో కళకళలాడింది. యాత్రికులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కానుకలు, మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో బండి ముత్యాలమ్మ భజన సంఘం ఆధ్వర్యంలో ఆలపించిన గీతాలు ఆకట్టుకున్నాయి. ఆలయ కార్యనిర్వాహణాధికారి మోకా అరుణ్ కుమార్, ఛైర్మన్ కడలి మాణిక్యాలరావుల పర్యవేక్షణలో సిబ్బంది, పాలకవర్గ సభ్యులు యాత్రికులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేశారు. ప్రసాదం వితరణ తదితర సేవా కార్యక్రమాలు నిర్వహించారు.
25 నుంచి నాగర్సాల్ రైలు దారి మళ్లింపు
నరసాపురం: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో పున నిర్మాణ పనుల కారణంగా సికింద్రాబాద్ మీదుగా నరసాపురం నుంచి వెళ్లే నాగర్సాల్ రైలు ఈనెల 25 నుంచి చర్లపల్లి మీదుగా వెళ్తుందని నరసాపురం స్టేషన్ మేనేజర్ గణపతి మధుబాబు తెలిపారు. ఈ రైలు చర్లపల్లిలో ఆగుతుందని, సికింద్రాబాద్ వెళ్లదన్నారు. తిరుగు ప్రయాణంలో కూడా సికింద్రాబాద్ నుంచి కాకుండా చర్లపల్లి నుంచే నరసాపురం వస్తుందని, ప్రయాణికులు గమనించాలని కోరారు
బెల్ట్ షాపు నిర్వాహకుని అరెస్ట్
ఆచంట : పాలకొల్లు ప్రోహిబిషన్, ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ఆదివారం నిర్వహించిన దాడులలో మండలంలోని కోడేరు గ్రామంలో బి.సుబ్బారావు అను వ్యక్తిని అరెస్టు చేసి అతని వద్దనుంచి 07 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ దాడులలో ఎస్‌ఐ జి.రఘు, సిబ్బంది పాల్గొన్నారు. బెల్ట్ షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ మద్దాల శ్రీనివాస్ తెలియజేశారు.
21 నుంచి హ్యండీ క్రాఫ్ట్స్ ఎక్స్ పో
నరసాపురం : మండలంలోని రుస్తుంబాద గ్రామంలోని ఇంటర్నేషనల్ లేస్ ట్రేడ్ సెంటర్ (ఐఎల్‌టిసి)లో మెగా హ్యండీ క్రాఫ్ట్స్ ఎక్స్ పోను ఏర్పాటు చేసినట్లు లేస్ ట్రేడ్ సెంటర్ సమన్వయకర్త కల్వకొలను నాగ తులసీరావు తెలిపారు. స్థానిక ఐఎల్‌టిసిలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎగ్జిబిషన్ వివరాలను తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేతివృత్తులను ప్రోత్సహించాలనే తలంపుతో ఈ హ్యండీ క్రాఫ్ట్స్ ఎక్స్ పో ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఈనెల 21 నుంచి 25 వరకు అయిదు రోజుల పాటు జరిగే ఎక్స్ పోలో దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన హస్త కళాకారులు పాల్గొని తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తారని చెప్పారు. ఉదయం 11 గంటలు నుంచి రాత్రి 8 గంటల వరకు ఎగ్జిబిషన్ ఉంటుందన్నారు. ఈ ఎగ్జిబిషన్‌లో 80 మంది చేతివృత్తిదారులచే 80 స్టాల్స్ ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు.
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి : ఎంఎల్‌ఎ
భీమవరం టౌన్: పరిశుభ్రతలో రాయలం పంచాయతీ మొదటి స్థానంలో ఉండాలని, దీనికి ప్రతిఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఛైర్మన్, ఎంఎల్‌ఎ పులపర్తి రామాంజనేయులు(అంజిబాబు) అన్నారు. మండలంలోని రాయలం గ్రామంలో స్వర్ణ ఆంధ్ర – స్వచ్చ ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎంఎల్‌ఎ అంజిబాబు మాట్లాడుతూ తడి, పొడి చెత్తలను వేరే చేసి అందించాలని, ఎక్కడబడితే అక్కడ చెత్త వేయకూడదని, పర్యావరణ పరిరక్షణకు మొక్కలను కూడా పెంచాలని అన్నారు. అనంతరం మహిళలకు డస్ట్ బిన్స్ అందించి పారిశుధ్య కార్మికులను ఎంఎల్‌ఎ అంజిబాబు సత్కరించారు. ఈ కార్యక్రమంలో రాయలం వాసులు, జనసేన, టిడిపి నాయకులు పాల్గొన్నారు.