సిపిఎం మండల కార్యదర్శిగా అలమహరాజు

ప్రజాశక్తి – వీరవాసరం

సిపిఎం మండల కార్యదర్శిగా బొర్రా అలమహరాజు ఎన్నికైనట్లు జిల్లా నాయకులు జుత్తిగ నరసింహమూర్తి శనివారం తెలిపారు. వీరవాసరం సిపిఎం 8వ మహాసభలు రెండో రోజు నూతన కమిటీ ఎన్నిక జరిగి, పలు తీర్మాణాలు చేసినట్లు తెలిపారు. మండలంలో పెర్కిపాలెం, వీరవాసరం, మత్స్యపురిపాలెంలలో కలుషితమవుతున్న తాగునీటి చెరువులను యుద్ధప్రాతిపదికన ప్రక్షాళన చేసి, ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందివ్వాలన్నారు. చెరువులు లేని గ్రామాలలో ఎన్‌టిఆర్‌ సుజల పథకం ప్రారంభించి తాగునీరు సరఫరా చేయాలని, డ్రెయినేజీలు నిర్మాణాలు చేపట్టాలని, అపారిశుధ్య పరిస్థితులను తొలగించి ప్రజలను అంటు రోగాల నుంచి కాపాడాలని మహాసభ తీర్మాణం చేసింది. రైతులు, వృత్తిదారులు, రైతాంగ సమస్యలను పరిష్కరించాలంటూ తీర్మాణం చేశారు. రైతాంగానికి ముప్పుగా ఉన్న గొంతేరు, తొక్కోడు, దేవరకోడు, బసవరాజుకోడు, బైరవకోడు, పొలమూరు డ్రెయిన్‌లను తక్షణమే ప్రక్షాలన చేయాలంటూ తీర్మాణం చేశారు. దళిత పేటలలోని రోడ్లు, డ్రెయినేజీ సదుపాయాలు కల్పించాలని, నవుడూరు నుంచి మడుగు పోలవరంలంక వరకు ప్రమాదకరంగా ఉన్న రోడ్ల పనులను వెంటనే ప్రారంభించాలని, అనువుగా లేని చోట పేదలకు ఇచ్చిన ఇంటి స్థలాలను వేరొక చోటకు మార్పు చేసి, ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలన్నారు. ఉపాధి హామీ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని, కూలీలకు రెండు వందల రోజుల పనిదినాలు కల్పించాలని, అర్హులైన చేతివృత్తిదారులకు, వితంతువులకు, వృద్ధాప్యం, ఒంటరి మహిళలకు పెన్షన్‌లు మంజూరు చేయాలంటూ పోతుల మృత్యంజయ ప్రవేశపెట్టిన తీర్మాణాలను మహాసభ ఏకగ్రీవంగా తీర్మాణించింది. కన్వీనర్‌తో పాటు పోతుల మృత్యంజయ, తాళ్లూరి హరిహరరామలక్ష్మన్‌, కేతా జ్యోతిబసు, యండమూరి సుబ్బారావు, గొట్టుముక్కల శ్యాంబాబులను మండల కమిటీలో సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని జుత్తిగ నరసింహమూర్తి తెలిపారు.

➡️