వాసవీ కళాశాలకు అదనపు సీట్ల కేటాయింపు

ప్రజాశక్తి – తాడేపల్లిగూడెం

తాడేపల్లిగూడెం వాసవీ ఇంజినీరింగ్‌ కళాశాలకు 2025-26 విద్యా సంవత్సరానికి గాను సిఎస్‌ఇ, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ మెషిన్‌ లెర్నింగ్‌ కోర్సుల్లో ఒక్కోదానికి అదనంగా 60 సీట్ల చొప్పున మొత్తం 120 సీట్లను అఖిల భారత సాంకేతిక విద్యా మండలి మంజూరు చేసినట్లు కళాశాల పాలకవర్గ అధ్యక్ష కార్యదర్శులు గ్రంధి సత్యనారాయణ, చలంచర్ల సుబ్బారావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం ఉన్న ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ 120 సీట్లను 180కు అలాగే ఎఐ ఎంఎల్‌ కోర్సులో ఉన్న 120 సీట్లను 180కు పెంచడం జరిగిందన్నారు. పెరిగిన సీట్లతో బిటెక్‌లో సీట్ల సంఖ్య 1320కు పెరగ్గా ఇబిసి రిజర్వేషన్‌ సీట్లతో కలిపి 1,452కు పెరిగినట్లు వారు తెలిపారు. అదనంగా మంజూరైన సీట్లకు కావాల్సిన మౌలిక సదుపాయాలను ఇప్పటికే పూర్తి చేశామని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థికీ ఉన్నత విద్యను అందించడంతో పాటు ఉన్నతస్థాయి ఉద్యోగాలు కల్పించాలన్నదే తమ లక్ష్యమని పేర్కొన్నారు. పాలిసెట్‌ రాసే విద్యార్థుల కోసం కళాశాల అందించే ఉచిత శిక్షణను ఈ నెల 8వ తేదీ నుంచి ప్రారంభించామని, దీనికి తాడేపల్లిగూడెం పరిసర ప్రాంతాలకు చెందిన 500 మందికి పైగా విద్యార్థులు హాజరవుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల పాలకవర్గ కోశాధికారి పేరూరి బాల కాశయ్య, టెక్నికల్‌ డైరెక్టర్‌ చక్కా అప్పారావు, ప్రిన్సిపల్‌ రత్నకరరావు పాల్గొన్నారు.

రాజ్యాంగ పరిరక్షణ కోరుతూ బైక్‌ ర్యాలీ

తణుకు : స్వేచ్ఛ, స్వాతంత్ర, సమానత్వం, సౌభ్రాతృత్వం లక్ష్యంగా ఆవిర్భవించిన భారత రాజ్యాంగాన్ని కేంద్ర ప్రభుత్వ మతతత్వ పాలన కారణంగా ప్రమాదంలో ఉందని, బిజెపి పాలనలో లౌకికవాదం, మానవ హక్కులకు ప్రమాదం ఏర్పడిందని, రాజ్యాంగ లక్ష్యాలు నెరవేర్చడానికి, ప్రజాస్వామ్య మనుగడకు, రాజ్యాంగ పరిరక్షణకు ప్రతీఒక్కరూ ముందుకు రావాలని సిపిఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు పిలుపునిచ్చారు. మార్చి 23 భగత్‌సింగ్‌ వర్ధంతి నుంచి ఏప్రియల్‌ 14 అంబేద్కర్‌ జయంతి వరకు రాజ్యాంగాన్ని పరిరక్షించాలని కోరుతూ సిపిఐ జాతీయ సమితి పిలుపులో భాగంగా రాజ్యాంగ పరిరక్షణ కోరుతూ శుక్రవారం సిసిఐ ఆధ్వర్యంలో తణుకు పట్టణంలో బైక్‌ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఎపి మహిళా సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి సికిలే పుష్పకుమారి, సిపిఐ నాయకులు పుట్టా అమ్మిరాజు, మందుల ముత్తయ్య, గండ్రాపు శ్రీను, పతి రాజశేఖర్‌ పాల్గొన్నారు.

ఉరుములు, మెరుపులతో తేలికపాటి వర్షం

ప్రజాశక్తి – పాలకొల్లు

పాలకొల్లు పట్టణంలో గురువారం అర్ధరాత్రి గంటపాటు ఉరుములు, మెరుపులతో తేలికపాటి వర్షం పడింది. దీంతో విద్యుత్‌కు గంటపాటు అంతరాయం ఏర్పడింది. భారీ ఉరుములు శబ్దాలతో, భారీ మెరుపులతో వాతావరణం ఉండటంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. అయితే గంట తరువాత వీటి ప్రభావం తగ్గడంతో విద్యుత్‌ పునరుద్ధరణ చేశారు.

➡️