నిట్ రిజిస్ట్రార్ దినేష్ శంకర్ రెడ్డి
ప్రజాశక్తి – తాడేపల్లిగూడెం
ఆలోచనలకు పదును పెడితే అద్భుత ఆవిష్కరణలు రూపు దిద్దుకుంటాయని నిట్ రిజిస్ట్రార్ డాక్టర్ పి.దినేష్ శంకర్‌రెడ్డి విద్యార్థులకు సూచించారు. ఎపి నిట్, నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఇన్‌స్పైర్ మనాక్ మెంటార్ షిప్ – 2024 అనే అంశంపై రెండు రోజులుగా నిర్వహిస్తున్న వర్క్ షాప్ మంగళవారం సాయంత్రంతో ముగిసింది. ఈ సందర్భంగా దినేష్ శంకర్‌రెడ్డి మాట్లాడుతూ వైజ్ఞానిక స్పహతోనే దేశాభివృద్ధి సాధ్యమని తెలిపారు. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మక ప్రతిభను వెలికితీయడానికి ఇటువంటి వైజ్ఞానిక ప్రదర్శనలు ఎంతగానో దోహదపడతాయని చెప్పారు. విద్యార్థుల ఆలోచనలు, ఆవిష్కరణలే దేశ అభ్యున్నతికి వెన్నుదన్నుగా నిలుస్తాయని, ప్రతి విద్యార్థీ విభిన్న ఆలోచనలు చేయాలని సూచించారు. పాఠశాల స్థాయిలోనే సరికొత్త ఆలోచనలు అంకురించి నవ కల్పనకు బాటలు వేయాలని చెప్పారు. కష్టపడి చదివిన వారికి తగిన గుర్తింపు, ప్రతిఫలం తప్పనిసరిగా లభిస్తుందన్నారు. కొలువుల సాధనకు సాంకేతిక నైపుణ్యాలే కీలకమని, ప్రతి విద్యార్థీ బాల్యం నుంచే ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకునే స్థాయికి ఎదగాలని తెలిపారు. మెదడు ఎల్లప్పుడూ చురుగ్గా పనిచేయాలని కోరుకునే విద్యార్థులు పుస్తకాలతో స్నేహం చేయాలని వివరించారు. నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ ప్రాజెక్ట్ అసోసియేట్ డాక్టర్ సునీల్ భాస్కర్, సైంటిఫిక్ స్టూడెంట్స్ సొసైటీ ప్రెసిడెంట్ ఎస్‌జి.శ్రీనివాస్, ఎస్‌ఇఆర్‌టి స్టేట్ నోడల్ ఆఫీసర్లు భాగ్యశ్రీ, డాక్టర్ మేరీ మాట్లాడుతూ విద్యార్థుల భాగస్వామ్యంతోనే దేశ ప్రగతి సాధ్యమని, విద్యార్థుల ఆలోచనల్లో ఎల్లప్పుడూ చైతన్య క్రాంతి ప్రసరించాలని తెలిపారు. జాతీయ స్థాయికి ఎంపికైన ఈ 24 మంది విద్యార్థులు ఆగస్టులో ఢిల్లీలో తమ ఆవిష్కరణలను ప్రదర్శించాల్సి ఉంటుందని వివరించారు. పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు, వారి మార్గదర్శకులు మాట్లాడుతూ తమ విద్యార్థులకు తెలియని ఎన్నో విషయాలను ఆచార్యులు తెలియజేశారన్నారు. అనంతరం విద్యార్థులకు ధ్రువపత్రాలను అందజేశారు. ముందుగా ఆచార్యుల బృందం విద్యార్థుల ప్రాజెక్టులను పరిశీలించడంతో పాటు ఆయా ప్రాజెక్టులను సమాజ అవసరాలకు అనుగుణంగా మరిన్ని మెరుగులు దిద్దడానికి అవసరమైన సలహాలు, సూచనలను అందజేశారు. ఈ కార్యక్రమానికి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగం ఆచార్యులు డాక్టర్ పి.శంకర్, కోఆర్డినేటర్‌గా వ్యవహరించారు. ఆచార్యులు డాక్టర్ వి.సందీప్, డాక్టర్ శ్రీఫణికృష్ణ కర్రి, కార్తికేయ శర్మ, డాక్టర్ వినోత్ కుమార్ రాజా, డాక్టర్ భరణీ దరన్ పాల్గొన్నారు.