బీచ్‌లో ప్రమాదవశాత్తు యువకుడు మృతి

మొగల్తూరు : వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా సహాయ కార్యదర్శి యడ్ల చిట్టిబాబు కుమారుడు మధుబాబు(23) పేరుపాలెం బీచ్‌లో ప్రమాదవశాత్తు మునిగి మృతిచెందారు. సంఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. చిట్టిబాబు కుమారుడు మధుబాబు డిగ్రీ పూర్తి చేసి పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నాడు. సోమవారం నరసాపురం గ్రామీణ మండలం రాజులంక గ్రామానికి చెందిన ఇద్దరు మిత్రులతో కలిసి పేరుపాలెం బీబ్‌కు మధ్యాహ్నం సమయంలో వెళ్లారు. ఈ క్రమంలో సముద్ర అలలలో స్నానం చేస్తూ ఉండగా ప్రమాదవశాత్తు లోపలకు కొట్టుకు వెళ్లి గల్లంతయ్యారు. అతని మిత్రులు చేయందించినా అలల ఉధృతికి లోపలికి కొట్టుకు వెళ్లాడు. కొంత సమయానికి ఒడ్డుకు కొట్టుకు వచ్చారు. స్నేహితులు, ఆ ప్రాంతవాసులు చికిత్స నిమిత్తం మధుబాబును నరసాపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతిచెందినట్లు అక్కడ వైద్యులు నిర్ధారించారు. మధుబాబు మృతదేహాన్ని ముచ్చర్ల త్రిమూర్తులు, ఒడుగు శ్రీను, మొవ్వల పెద్దిరాజు, కొల్లాటి బాబురావు సందర్శించి నివాళులర్పించారు.చిట్టిబాబును పరామర్శిస్తున్న సిపిఎం నాయకులు నరసాపురం: యడ్ల మధుబాబు మృతదేహన్ని నరసాపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న సిపిఎం నాయకులు ఆస్పత్రికి తరలివచ్చారు. సోమవారం రాత్రి యడ్ల చిట్టిబాబును సిపిఎం రాష్ట్ర సీనియర్‌ నాయకులు మంతెన సీతారాం, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బి.బలరాం, సిపిఎం జిల్లా కార్యదర్శి జెఎన్‌వి గోపాలన్‌, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కవురు పెద్దిరాజు, జక్కంశెట్టి సత్యనారాయణ, సిపిఎం నాయకులు ముచర్ల త్రిమూర్తులు, తెలగంశెట్టి సత్యనారాయణ, పొగాకు పూర్ణ, నారాయణ రావు, జల్లి రామ్మోహన్‌ రావు, బి.జార్జి, కాకిలేటి బాలరాజు, బూడిద జోగేశ్వర రావు, నోముల కొండ, కవురు నరసింహస్వామి పరామర్శించారు. ప్రమాదానికి గల కారణాలు అడిగి తెలుసుకుని, ధైర్యం చెప్పారు. అనంతరం శవ కారాగారంలో భద్రపరిచిన మధు బాబు మృతదేహన్ని సందర్శించారు.

➡️