ఓ(పో)టెత్తిన జనం..!

రెండు జిల్లాల్లో పోలింగ్‌ ప్రశాంతం
ఉదయం నుంచే బారులు తీరిన ఓటర్లు 
మధ్యాహ్నం వరకూ మందకొడిగా పోలింగ్‌ 
పలుచోట్ల ఇవిఎంల మొరాయింపు, చెదురుమదురు ఘర్షణలు 
ఓటేసేందుకు వచ్చి గుండెపోటుతో ఇద్దరు మృతి
ప్రజాశక్తి – ఏలూరు ప్రతినిధి
ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకునేందుకు రెండు జిల్లాలోనూ ఓటర్లు పోటెత్తారు. 2024 సాధారణ ఎన్నికల ప్రక్రియ ఉదయం ఏడు గంటలకు ప్రారంభం కావడంతో జనం ఉదయం నుంచే పోలింగ్‌ బూత్‌ల వద్ద బారులుతీరారు. ఎండబారిన పడకుండా ఓటేయాలని అంతా ముందుగానే పోలింగ్‌ బూత్‌లకు తరలొచ్చారు. అయితే ఇవిఎంల మొరాయింపు తదితర కారణాల రీత్యా మధ్యాహ్నం ఒంటిగంట వరకూ పోలింగ్‌ రెండు జిల్లాల్లోనూ నత్తనడకన సాగింది. మధ్యాహ్నం ఒంటి గంటకు రెండు జిల్లాల్లోనూ 42 శాతానికి మించి పోలింగ్‌ నమోదు కాని పరిస్థితి ఉంది. దీంతో పోలింగ్‌ శాతం గత ఎన్నికల కంటే భారీగా తగ్గుతుందా అనే అనుమానాలు నెలకొన్నాయి. ఓటేయడానికి వచ్చిన ప్రతిఒక్కరూ పోలింగ్‌ బూత్‌ వద్ద కనీసంగా గంట నుంచి రెండు గంటలకుపైగా నిలబడాల్సిన పరిస్థితి నెలకొంది. సోమవారం ఉష్ణోగ్రత తీవ్రస్థాయిలో ఉండటంతో ఎండకు తాళలేక జనం అల్లాడిపోయారు. చాలాచోట్ల వృద్ధులు స్పృహా తప్పిపడిపోయిన పరిస్థితి కన్పించింది. భీమవరం మండలం యనమదుర్రు, కైకలూరు మండలం వింజరంలో ఇద్దరు వృద్ధులు పోలింగ్‌ బూత్‌ వద్దే గుండెపోటుతో మృతి చెందిన ఘటనలు చోటుచేసుకున్నాయి. ఉంగుటూరు మండలం కైకరం, ముసునూరు మండలం గోపవరం, కాళ్ల, నరసాపురం, పాలకొల్లు, భీమవరం, పాలకోడేరు మండలాల్లో అనేక పోలింగ్‌ బూత్‌ల్లో ఉదయం ఇవిఎంలు మొరాయించాయి. తర్వాత సరిచేయడంతో పోలింగ్‌ ముందుకు సాగింది. ఓటు వేసేటప్పుడు ఓటింగ్‌కు ఇవిఎంలు ఎక్కువ సమయం తీసుకోవడం కారణంగానే పోలింగ్‌ నత్తనడకన సాగిందనే చర్చ నడిచింది. పలు పోలింగ్‌బూత్‌ల వద్ద పోలీస్‌ బందోబస్తు సరిగా లేకపోవడంతో తోపులాటలు చోటుచేసుకున్నాయి. పోలింగ్‌ బూత్‌లో జనం ఉదయం నుంచి కిటకిటాలడుతూనే ఉన్నారు. బెంగుళూరు, హైదరాబాద్‌, చెన్నరు వంటిచోట్ల ఉద్యోగాలు చేస్తున్నవారు, ఉపాధి కోసం వెళ్లిన వారు సైతం సొంత ప్రాంతాలకు తరలొచ్చి ఓటుహక్కు వినియోగించుకున్నారు. అలావచ్చిన వారికి రాజకీయ పార్టీలు దారి ఖర్చులు, ఓటుకు నోటు సైతం ఇచ్చిన పరిస్థితి ఉంది. ఉంగుటూరు నియోజకవర్గం భీమడోలు మండలంలో ఎంఎల్‌ఎ పుప్పాల వాసుబాబు తమ్ముడు ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో ఇరుగ్రూపుల మధ్య ఘర్షణ చోటుచోసుకోవడంతో పోలీసులు రంగప్రవేశం చేసి సద్దుమణిచారు. లింగపాలెం మండలం ధర్మాజీగూడెంలో టిడిపి, వైసిపి గ్రూపుల మధ్య ఘర్షణ జరగడంతో పోలీ సులు లాఠీఛార్జి చేశారు. రెండు జిల్లాల్లోనూ చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్‌ ప్రశాంతంగా సాగింది.సాయంత్రం ఐదుగంటలకు పోలింగ్‌ ఇలా రెండు జిల్లాల్లోనూ ఓటర్లు పెద్దఎత్తున ఓటు హక్కు వినియోగించుకోవడంతో సాయంత్రం ఐదు గంటలకు ఏలూరు జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో 72.03 శాతం, పశ్చిమగోదావరి జిల్లాలో 68.36 శాతం ఓటింగ్‌ జరిగింది. అత్యల్పంగా ఏలూరు నియోజకవర్గంలో 64.59 శాతం పోలింగ్‌ జరిగింది. సాయంత్రం ఆరు గంటలు దాటిన తర్వాత పోలింగ్‌ బూత్‌ల వద్ద ఓటర్లు ఉండటంతో వారికి ఓటువేసే అవకాశం కల్పించారు.

➡️