ప్రజాశక్తి – భీమవరం
విశాఖ ఉక్కును పరిరక్షించుకునేందుకు మరో పోరాటానికి నాంది పలికేందుకు కార్మిక, రైతు, వ్యవసాయ, కార్మిక సంఘాలు సిద్ధమవుతున్నాయి. వచ్చేనెల 1, 2, 3 తేదీల్లో రిలే నిరాహార దీక్షలు ప్రారంభించే విధంగా కార్యాచరణ రూపొందించారు. భీమవరం సిఐటియు కార్యాలయంలో కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక ప్రజాసంఘాల సమన్వయ సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు జెఎన్‌వి.గోపాలన్, ఎఐటియుసి జిల్లా నాయకులు చెల్లబోయిన రంగారావు మాట్లాడారు. విశాఖ ఉక్కును అమ్మేయడం కోసం కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు బ్రేక్ పడలేదని, రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో చేతలుడిగి కూర్చుందని విమర్శించారు. ఒకపక్క ప్రయివేటీకరణ చేయబోమని ప్రకటిస్తూనే మరోపక్క పర్మినెంట్, కాంట్రాక్టు కార్మికులను వేర్వేరు రాష్ట్రాల్లో ఉండే స్టీల్ ప్లాంట్లకు బదిలీ చేయడం నాలుగువేల మంది కాంట్రాక్టు కార్మికులను పనిలోకి రావద్దని చెప్పడం ఇవన్నీ చూస్తుంటే స్టీల్ ప్లాంట్‌ను ప్రయివేటీకరణ చేసే ప్రయత్నాలు మొదలయ్యాయని అర్థమవుతోందన్నారు. ఇప్పటికే రాష్ట్రస్థాయిలో అన్ని కార్మిక సంఘాలు, రైతు, వ్యవసాయ కార్మిక, యువజన విద్యార్థి, మహిళా సంఘాలు సమావేశాలు ఏర్పాటు చేసుకుని రిలే నిరాహార దీక్షలు నిర్వహించాలని నిర్ణయించాయన్నారు. దీనిలో భాగంగానే జిల్లాలో కూడా భీమవరంతో పాటు వివిధ పట్టణాల్లో ఆందోళన నిర్వహించడానికి ఈ సంఘాలన్నీ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఒకటిన కార్మిక సంఘాలు, రెండున విద్యార్థి, యువజన మహిళ సంఘాలు, మూడున రైతు వ్యవసాయ కార్మిక కార్మిక సంఘాలు రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నాయని తెలిపారు. ప్రభుత్వం విశాఖ ఉక్కును రక్షించకపోతే కార్మిక రైతు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్రజలే రక్షించుకోవడానికి సిద్ధపడతారని చెప్పారు. ఈ సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జక్కంశెట్టి సత్యనారాయణ, కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఎం.రామాంజనేయులు, సిఐటియు జిల్లా నాయకులు బి.వాసుదేవరావు, ఎం.ఆంజనేయులు పాల్గొన్నారు.