తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు మరో నామినేషన్‌

ప్రజాశక్తి – ఏలూరు : తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎంఎల్‌సి నియోజకవర్గ ఎన్నికలకు సంబంధించి మంగళవారం మరో నామినేషన్‌ దాఖలైంది. ఏలూరుకు చెందిన ములకల శ్రీనివాస్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. ఏలూరు కలెక్టరేట్లో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎంఎల్‌సి నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి, ఏలూరు జిల్లా కలెక్టర్‌ కె.వెట్రిసెల్వికి ములకల శ్రీనివాస్‌ ఒక సెట్‌ నామినేషన్‌ పత్రాలను సమర్పించారు. నామినేషన్‌ వేసిన అభ్యర్థితో రిటర్నింగ్‌ అధికారి ప్రమాణం చేయించారు. సహాయ రిటర్నింగ్‌ అధికారి, ఏలూరు జిల్లా రెవెన్యూ అధికారి వి.విశ్వేశ్వరరావు, ఇతర ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు. పట్టభద్రుల ఎంఎల్‌సి ఎన్నికలకు సంబంధించి ఈ నెల మూడో తేదీన నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. ఇప్పటి వరకూ దాఖలైన నామినేషన్ల సంఖ్య రెండుకు చేరింది. ఇప్పటి వరకూ నామినేషన్లు వేసిన వారంతా ఇండిపెండెంట్‌ అభ్యర్థులే. ఎంఎల్‌సి ఎన్నికల బరిలో నువ్వా..నేనా అంటూ తలపడుతున్న పిడిఎఫ్‌, టిడిపి అభ్యర్థులు ఇంకా నామినేషన్లు వేయలేదు. ఆరు, ఏడు తేదీల్లో ఎక్కువగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ నెల పదో తేదీ వరకూ నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగనుంది. నామినేషన్ల స్వీకరణకు సంబంధించి అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.మీడియా సెంటర్‌ ఏర్పాటు ఉంటుందా? ఎన్నికల సమాచారం వంటివి అందించేందుకు ప్రతి ఎన్నికల్లో మీడియా సెంటర్‌ ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తారు. ఎన్నికల సంబంధిత అధికారులు అందుబాటులోకి రాకపోతే సమాచారం ఇవ్వడంలో మీడియా సెంటర్‌ కీలక పాత్ర పోషిస్తోంది. మీడియా సెంటర్‌ ఏర్పాటు చేస్తామని రిటర్నింగ్‌ అధికారి, జిల్లా కలెక్టర్‌ వెట్రిసెల్వి ఎన్నికల షెడ్యూల్‌ విడుదల సందర్భంగా తెలిపారు. నామినేషన్ల స్వీకరణ ప్రారంభమై రెండు రోజులు గడిచిపోయింది. ఇప్పటి వరకూ మీడియా సెంటర్‌ ఏర్పాటు ఎక్కడా కానరాని పరిస్థితి నెలకొంది. ఎన్నికలకు సంబంధించిన సమాచారం పూరిస్థాయిలో మీడియాకు అందని పరిస్థితి ఏర్పడింది. మీడియా సెంటర్‌ ఏర్పాటు ఉంటుందో, లేదో తెలియని పరిస్థితి నెలకొంది.

➡️