నరసాపురం నుంచి డైరెక్ట్‌ రైళ్లకు ఏర్పాట్లు

పాలకొల్లు : నరసాపురం, పాలకొల్లు నుంచి బెంగళూరు, వారణాసి, వైజాగ్‌లకు నేరుగా రైలు సౌకర్యం కల్పిస్తున్నట్లు రైల్వే డిఆర్‌సి నెంబర్‌ జక్కంపూడి కుమార్‌ చెప్పారు. శనివారం పాలకొల్లు రైల్వే స్టేషన్‌లో రూ.20 కోట్ల ఖర్చుతో జరుగుతున్న వివిధ పనులను పరిశీలించారు. కుమార్‌తో పాటు కొల్లి కొండా ప్రసాద్‌, బోడ కనకరాజు, చెరుకూరి శ్రీనివాసరావు పాల్గొన్నారు.

ప్రజారోగ్యంతోనే రాష్ట్రాభివృద్ధి

తణుకు రూరల్‌ : ప్రజలు ఆరోగ్యంగా ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి సాధిస్తుందని యువత నాటు సారా, డ్రగ్స్‌ వినియోగానికి దూరంగా ఉండాలని తణుకు ఎక్సైజ్‌ సిఐ ఎస్‌.మణికంఠ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపుమేరకు నవోదయం 2.0 కార్యక్రమాన్ని ఆయన తేతలి గ్రామంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు నాటుసారా, మాదకద్రవ్యాల వినియోగంతో వచ్చే అనర్ధాలపై అవగాహన కల్పించారు. ఎక్సైజ్‌ ఎస్‌ఐ టి.మధుబాబు, కడల శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

26న కౌన్సిల్‌ సాధారణ సమావేశం

నరసాపురం: నరసాపురం పురపాలక మున్సిపల్‌ కౌన్సిల్‌ సాధారణ సమావేశం ఈనెల 26న బుధవారం ఉదయం 11 గంటలకు కౌన్సిల్‌ హాలులో నిర్వహిస్తున్నట్లు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బర్రె శ్రీవెంకటరమణ తెలిపారు. ఈమేరకు ఆమె శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సమావేశానికి సకాలంలో కౌన్సిల్‌ సభ్యులు హాజరు కావాలని కోరారు

ధాన్యం కొనుగోలు కేంద్రాలు సిద్ధం చేయాలి : జెసి

భీమవరం : జిల్లాలో రబీ ధాన్యం కొనుగోళ్లకు ఏప్రిల్‌ మొదటి వారంలో కేంద్రాలను సిద్ధం చేయాలని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ టి.రాహుల్‌ కుమార్‌ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం స్థానిక కలెక్టరేట్‌లో సంబంధిత శాఖల అధికారులతో రబీ సాగుకు సంబంధించిన ధాన్యం కొనుగోళ్లు, పిజిఆర్‌ఎస్‌, రీ సర్వే, రెవెన్యూ సదస్సులు, వెబ్‌ ల్యాండ్‌, ఎపి సేవా సర్వీసులు వంటి గూగుల్‌ మీట్‌ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోనెసంచులు నిల్వ చేయటానికి గోదాములు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రవాణా సౌకర్యానికి వాహనాలు పూర్తిస్థాయిలో సిద్ధం చేసి జిపిఎస్‌ అమర్చాలన్నారు. రైతులు ఆర్‌ఎస్‌కెలకు వెళ్లనవసరం లేకుండా ఆన్లైన్‌ వాట్సాప్‌ చాట్‌ను ప్రభుత్వం రైతులకు అవకాశం కల్పించిందన్నారు. తేమశాతం చూసే పరికరాలు రైతు సేవా కేంద్రాల, మిల్లుల వద్ద ఒకే కంపెనీకి చెందినవి ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో 120 గ్రామాలలో సర్వే పూర్తిచేయడానికి ఇప్పటి నుండే ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలన్నారు. డిఆర్‌ఒ మొగిలి వెంకటేశ్వర్లు, సివిల్‌ సప్లర్సు జిల్లా మేనేజర్‌ టి.శివరామ ప్రసాద్‌, డిఎస్‌ఒ ఎన్‌.సరోజ పాల్గొన్నారు.

హ్యాండీక్రాఫ్ట్స్‌ ఎక్స్‌పో స్టాల్స్‌ పరిశీలన

నరసాపురం : హస్త కళాకారుల ఎగుమతి ప్రోత్సాహక మండలి(ఎక్స్‌పోర్ట్‌ ప్రమోషన్‌ కౌన్సిల్‌ ఫర్‌ హ్యాండీక్రాఫ్ట్‌-ఇపిసిహెచ్‌) అనే సంస్థను 1986లో ఏర్పాటు చేసి, దేశవ్యాప్తంగా ఉన్న హస్తకళాకారులను ఒక చోటికి చేర్చడం జరిగిందని కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ అన్నారు. రుస్తుంబాధ ఇంటర్నేషనల్‌ లేసు ట్రేడ్‌ సెంటర్‌లో హ్యాండీక్రాఫ్ట్స్‌ ఎక్స్‌పో ప్రారంభోత్సవ వేడుకల్లో కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, రాష్ట్ర జలవనరులు శాఖ మంత్రి డాక్టర్‌ నిమ్మల రామానాయుడు, ప్రభుత్వ విప్‌, స్థానిక ఎంఎల్‌ఎ బొమ్మిడి నాయకర్‌, ఆచంట ఎంఎల్‌ఎ పితాని సత్యనారాయణ, ఎపి కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌ కొత్తపల్లి సుబ్బారాయుడు సంయుక్తంగా పాల్గొని ఎగ్జిబిషన్‌ స్టాల్స్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ మాట్లాడుతూ హస్తకళాకారులు తయారు చేసే వివిధ వస్తువులకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎగుమతి చేయడానికి, ఎటువంటి లాభాపేక్ష లేకుండా మద్దతుగా నిలుస్తూ నిరంతరం కృషి చేస్తున్న ఈ సంస్థ ప్రతినిధులు అభినందనీయమని అన్నారు. దేశవ్యాప్తంగా 70 మందికిపైగా హస్త కళాకారులను ఒక చోటికి చేర్చి, వివిధ రకాల వస్తువులను ఇక్కడ ప్రదర్శించడానికి ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్‌ లెస్‌ ట్రేడ్‌ సెంటరు నరసాపురం వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నానని తెలిపారు. మహిళలు, లేసు ఎగుమతి దారులు, పట్టణ ప్రముఖులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

➡️