ప్రజాశక్తి – భీమవరం
ఉపాధ్యాయ ఎంఎల్‌సి ఎన్నికకు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ఉమ్మడి తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల పరిధిలోని ఉపాధ్యాయ ఎంఎల్‌సి ఉపఎన్నికల నిర్వహణ కోసం పోలింగ్ సిబ్బంది, మెటీరియల్ ఆర్‌డిఒల పర్యవేక్షణలో ఆయా పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్లినట్లు తెలిపారు. ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎంఎల్‌సి ఉపఎన్నికల పోలింగ్ నిర్వహించేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. గురువారం బ్యాలెట్ పద్ధతిలో ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకూ పోలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. పోలింగ్ ప్రక్రియ పూర్తయిన తరువాత ఆయా పోలింగ్ సామగ్రి భీమవరం జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన మధ్యంతర రిసీప్షన్ కేంద్రానికి తరలించి, అదేరోజు రాత్రి బ్యాలెట్ బాక్సు, ఇతర పత్రాలు అత్యంత భద్రత మధ్య కాకినాడకు తరలిస్తామని తెలిపారు. ఓట్ల లెక్కింపు ఈ నెల 9వ తేదీన కాకినాడలో నిర్వహించడం జరుగుతుందన్నారు. సహాయ రిటర్నింగ్ అధికారిగా జిల్లా రెవెన్యూ అధికారి మొగిలి వెంకటేశ్వర్లు వ్యవహరిస్తారని తెలిపారు. ఎన్నికల నిర్వహణకు పశ్చిమగోదావరి జిల్లాలో 20 పోలింగ్ కేంద్రాలు, 26 మంది పిఒలు, 78 మంది ఎపిఒలు, 26 మంది మైక్రో అబ్జర్వర్లు, 20 మంది రూట్ ఆఫీసర్లు, జోనల్ ఆఫీసర్లుగా ముగ్గురు ఆర్‌డిఒలు, ప్రతి పోలింగ్ కేంద్రంలో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మొత్తం ఓటర్ల సంఖ్య 3,729 మంది కాగా పురుషులు 2,268 మంది, మహిళలు 1,461 మంది ఉన్నారన్నారు. మండలాల వారీగా అత్తిలిలో 90 మంది, ఆకువీడులో 90 మంది, ఆచంటలో 63 మంది, భీమవరంలో 759 మంది, గణపవరంలో 66 మంది, ఇరగవరంలో 53 మంది, కాళ్లలో 52 మంది, మొగల్తూరులో 88 మంది, నరసాపురంలో 425 మంది, పెంటపాడులో 73 మంది, పోడూరులో 71 మంది, పాలకోడేరులో 102 మంది, పెనుమంట్రలో 85 మంది, పెనుగొండలో 156 మంది, పాలకొల్లులో 480 మంది, తాడేపల్లిగూడెంలో 377 మంది, తణుకులో 407 మంది, ఉండిలో 69 మంది, వీరవాసరంలో 129 మంది, యలమంచిలిలో 94 మంది ఓటర్లు ఉన్నారన్నారు. ఆర్‌డిఒ కార్యాలయంలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రం నుంచి పోలింగ్ మెటీరియల్ తరలింపును, సిబ్బంది, ఇతర అనుబంధ విధులను ఆర్‌డిఒలు ప్రవీణ్ కుమార్ రెడ్డి, దాసి రాజు, ఖతీబ్ కౌసర్ బానో, అర్బన్ తహశీల్దార్లు, ఇన్‌ఛార్జి ఎలక్షన్ సూపరింటెండెంట్ మర్రాపు సన్యాసిరావు, ఎన్నికల విధులు ఇతర అధికారులు పర్యవేక్షించినట్లు తెలిపారు.