ప్రజాశక్తి – ఏలూరు ప్రతినిధి : మినుము, పెసర, కందులు, ఉలవలు వంటి అపరాల పంటలపై వైరస్ తెగుళ్లు దాడి చేస్తున్న పరిస్థితి నెలకొంది. దీంతో పంట చివరి దశలో దెబ్బతినే పరిస్థితి ఏర్పడడంతో రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. తగు సూచనలు, సలహాలు ఇవ్వాల్సిన వ్యవసాయాధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే పెద్దఎత్తున పెట్టుబడి ఖర్చు అవ్వడంతో తమ పరిస్థితి ఏంటన్న భయం అన్నదాతను వెంటాడుతోంది. జిల్లాలో ఏలూరు, పెదపాడు, దెందులూరుతోపాటు ఇతర మండలాల్లోనూ రైతులు పెద్దఎత్తున అపరాల సాగు చేపట్టారు. ఏలూరు జిల్లా వ్యాప్తంగా పెసర పంట 15,847 ఎకరాల్లో, మినుము సాగు 23,437 ఎకరాల్లో, 23 ఎకరాల్లో కంది, 156 ఎకరాల్లో ఉలవ, ఇతర పంటలు కలుపుకుని మొత్తం దాదాపు 39,475 ఎకరాల్లో రైతులు అపరాల సాగుచేశారు. పశ్చిమలోనూ పలుచోట్ల అపరాల సాగు సాగుతోంది. ప్రస్తుతం పంటంతా పూత, పిందె దశలో ఉంది. దాళ్వా లేకపోవడంతో పెదపాడు వంటి మండలాల్లో అపరాల సాగుపైనే రైతులు పూర్తిగా ఆధారపడిన పరిస్థితి నెలకొంది. పూత, పిందె దశలో వైరస్, తెగుళ్లు అపరాల పంటలను నాశనం చేస్తున్నాయి. ఆకులు ఎండిపోయి మొక్క దెబ్బతినే పరిస్థితి ఏర్పడింది. తెగుళ్లను అరికట్టేందుకు రైతులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. పెద్ద ఎత్తున పురుగుమందులు పిచికారీ చేస్తున్నారు. అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో రైతులకు ఏంచేయాలో దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. పురుగుమందు పిచికారీ చేయాలంటే ఎకరాకు ప్రతిసారీ రూ.రెండు వేల నుంచి రూ.మూడు వేల వరకూ అవుతోందని రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఈ దశలో తెగుళ్ల దాటితో దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపనుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే అన్ని ఖర్చులూ కలుపుకుని ఎకరాకు రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకూ అవుతోందని రైతులు చెబుతున్నారు. దిగుబడి సరిగ్గా రాకపోతే రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడనుంది. ఏలూరు రూరల్‌లోని మాదేపల్లి, లింగారావుగూడెం గ్రామాల్లో అపరాల పంటలపై వైరస్, తెగుళ్లు మరింత ఎక్కువగా ఉన్న పరిస్థితి ఉన్నట్లు రైతులు చెబుతున్నారు. తెగుళ్లు నివారణకు సంబంధించి రైతులకు సరైన సూచనలు ఇవ్వాల్సిన స్థానిక వ్యవసాయశాఖ అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెగుళ్ల నివారణకు సంబంధించి అధికారులు రైతులకు సరైన సూచనలు, సలహాలు ఇస్తే మేలు జరిగే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా తెగుళ్లతో పంట దెబ్బతిన్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాల్సి ఉంది.కౌలురైతులపై తీవ్ర ప్రభావం ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాలో వ్యవసాయ సాగులో 70 శాతం కౌలురైతులే చేస్తున్నారు. పంటలు దెబ్బతింటే కౌలురైతులే తీవ్రంగా నష్టపోతున్నారు. ఆ కారణంగానే కౌలురైతుల ఆత్మహత్యలు చోటు చేసుకుంటున్నాయి. ఖరీఫ్‌లో తుపాన్లు, భారీ వర్షాలతో రైతులు తీవ్ర నష్టాలను చవిచూశారు. పంట నష్టపరిహారం మాత్రం భూ యజమానుల ఖాతాల్లోకి చేరింది. ఇప్పుడు అపరాల సాగులోనూ కౌలురైతులే అత్యధికంగా ఉన్నారు. పంట దెబ్బతింటే కౌలు రైతులు నష్టపోనున్నారు. కౌలు రైతులకు అండగా ఉంటామంటూ అధికారంలోకొచ్చిన కూటమి ప్రభుత్వం ఇప్పటికీ వారికి అనుకూలంగా ఏ ఒక్క నిర్ణయమూ తీసుకోలేదు. కొత్త కౌలుచట్టం తెస్తామని హామీ ఇచ్చిన పట్టించుకోని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం అందించే ఏ ఒక్కసాయమూ కౌలురైతులకు అందడం లేదు. అపరాల రైతుల సమస్యలపై అధికారులు దృష్టిసారించి ఆదుకోవాల్సి ఉంది.అపరాల రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి కె.శ్రీనివాస్, రైతు సంఘం జిల్లా కార్యదర్శికృష్ణా డెల్టా పరిధిలో రెండో పంటకు సాగునీరందక పెద్దఎత్తున రైతులు అపరాల సాగు చేపట్టారు. తెగుళ్లకు సంబంధించి పురుగుల మందులకు రూ.వేలు ఖర్చు చేస్తున్నా ఫలితం లేకుండా పోయింది. పూత, పిందె దశలో పంటలు ఎండిపోతున్నాయి. ఎకరాలకు రెండు, మూడు క్వింటాళ్ల దిగుబడి వచ్చే పరిస్థితి కూడా కనిపించడం లేదు. నష్టపోతున్న అపరాల రైతులను ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకోవాలని కోరుతున్నాం.
