తాడేపల్లిగూడెం: స్థానిక గణపతి సెంటర్లో గల ఫ్రూట్ మార్కెట్‌లో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ తాడేపల్లిగూడెం ఇ.స్వరాజ్యలక్ష్మి ఆధ్వర్యంలో 2.0 అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ సిఐ స్వరాజ్యలక్ష్మి మాట్లాడుతూ నవోదయం 2.0 కార్యక్రమం ప్రాధాన్యత వివరించారు. ఈ కార్యక్రమంలో స్టేషన్ ఎస్‌ఐలు మురళీమోహన్‌రావు, దొరబాబు పాల్గొన్నారు.
క్రికెట్ అండర్-19కు శ్రీవెంకట నాగమధు
నరసాపురం: మండలంలోని సరిపల్లి గ్రామానికి చెందిన వెల్లిగట్ల శ్రీవెంకట నాగ మధు ఇంటర్నేషనల్ ఇండో-నేపాల్ సిరీస్ 2025లో క్రికెట్ అండర్-19 కేటగిరీ నుంచి ఎంపికయ్యారు. యువ ఆటగాడిగా మధు అంతర్జాతీయ స్థాయిలో అడుగుపెడుతున్న సందర్భంగా ప్రభుత్వ విప్, ఎంఎల్‌ఎ బొమ్మిడి నాయకర్ అతనిని అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఒకేషనల్ కోర్సులను సద్వినియోగం చేసుకోవాలి
ఉండి: ఉండి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న ఒకేషనల్ కోర్సులైన అగ్రికల్చర్, బ్యూటీ వెల్నెస్ కోర్సులను ప్రతి విద్యార్థి సద్వినియోగం చేసుకోవాలని హెచ్‌ఎం వై.రామలక్ష్మి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తొమ్మిదవ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదివే విద్యార్థులకు అగ్రికల్చర్, బ్యూటీ వెల్నెస్ కోర్సులను ఒకేషనల్ కోర్సులు రాష్ట్ర ప్రభుత్వ అందిస్తుందని, ఈ కోర్సులు ఉండి హై స్కూల్‌లోనే ఉన్నాయని, సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
విద్యాశాఖ పనితీరు సంతృప్తి
కరంస్టేట్ పరిశీలకులు డాక్టర్ ఎండి ఇస్మాయిల్
పెనుమంట్ర : మండలంలోని విద్యాశాఖ పనితీరు పట్ల ఆ శాఖలోని స్టేట్ అబ్జర్వర్ డాక్టర్ ఎండి ఇస్మాయిల్ సంతృప్తి వ్యక్తం చేశారు. శనివారం మండల కేంద్రంలోని ఆర్‌ఎ.జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని ఎస్‌ఆర్‌కెవి ఎంకిడ్స్ సెంటర్‌ను సందర్శించి, ప్రతీ గదిని పరిశీలించారు. కిడ్స్ సెంటర్‌ను చక్కగా నిర్వహించాలని ఆయన సిబ్బందికి ఆదేశించి, తగు సూచనలు చేశారు. కార్యక్రమంలో స్థానిక ఎంఇఒలు వై.లక్ష్మీ నారాయణ, యు.నాగేశ్వరరావు, సిఆర్‌పిలు పాల్గొన్నారు.
జెడ్‌పి హైస్కూల్ ఆకస్మిక తనిఖీ
ఉండి: మండలంలోని కోలమూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా ఉప విద్యాశాఖ అధికారి రమేష్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కోలమూరు గ్రామస్తులు మాట్లాడుతూ తమ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలోని మూడు, నాలుగు, ఐదు తరగతులను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విలీనం చేశారని, దీనివల్ల ప్రాథమిక పాఠశాలలో చేరే విద్యార్థుల సంఖ్య పూర్తిగా తగ్గిపోయిందని, తద్వారా పాఠశాల మూసివేసే ప్రమాదం ఉందని అన్నారు. యధాతధంగా తిరిగి ప్రాథమిక పాఠశాలలో మూడు నుంచి ఐదు తరగతులను ప్రారంభించాలని డివైఇఒ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్పించేందుకు క్యాంపెయిన్ చేసి విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఎంఇఒ-2 బి.వినాయకుడు, గ్రామ ఉపసర్పంచి నడింపల్లి రాంబాబు రాజు ఉన్నారు.
జాతర ఆరంభం
కాళ్ల : జువ్వలపాలెం గ్రామదేవతలైన కనకదుర్గమ్మ, ఎల్లమ్మ, ఎంకమ్మల జాతర మహోత్సవాలు శనివారం ప్రారంభమయ్యాయి. అధికసంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ముఖ్యఅతిధిగా గోకరాజు శివరామరాజు విచ్చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఈ జాతర ఐదు రోజులపాటు జరుగుతుందన్నారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు బొధనపు వెంకటేశ్వరరావు, ఆలయ కమిటీ సభ్యులు బొధనపు కన్నయ్య, గంటికోట నరసింహమూర్తి, నక్కా శ్రీను, బొధనపు పెద్దిరాజు, బొధనపు రాంబాబు, గండి కోట కనకం పర్యవేక్షించారు.
వేంపాడులో ‘ఫొటో కొట్టు గిప్ట్ పట్టు’
కాళ్ల : ఉగాదిరోజు నుంచి రాష్ట్ర ఉప సభాపతి, ఉండి ఎంఎల్‌ఎ కనుమూరు రఘురామకృష్ణంరాజు నియోజకవర్గంలో పారిశుధ్య నిర్వహణ, మంచినీటి కాలువల, పంట కాలువల ప్రక్షాళనపై ప్రత్యేక దృష్టి సారించారు. ‘ఫోటో కొట్టు గిఫ్ట్ పట్టు’ అనే కార్యక్రమం ద్వారా పర్యావరణాన్ని, ప్రజల ఆరోగ్యానికి భంగం కలిగించే వారికి రూ.1000 జరిమానా, ఫొటో, ఆధారాలతో సమాచారం అందించిన వారికి రూ.500 బహూకరణ అనే సరికొత్త ఆలోచనకి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. శనివారం వేంపాడు గ్రామపంచాయతీలో కార్యక్రమ ప్రచారాన్ని విస్తృతంగా గ్రామ సర్పంచి యిర్రింకి పద్మావతి, ఉపసర్పంచి వేగేశ్న సుమన్, పంచాయతీ కార్యదర్శి సుంకర వెంకటేష్, పంచాయతీ సిబ్బంది నిర్వహించారు. పర్యావరణం, ప్రజల ఆరోగ్యంపై గ్రామంలో పలు ప్రాంతాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
వైభవంగా యల్లారమ్మ ఆలయ వసంతోత్సవాలు
తణుకురూరల్ : మండలంలోని మండపాక గ్రామంలో వేంచేసిన శ్రీచక్రరాజ సహిత శ్రీయల్లారమ్మ అమ్మవారి వసంతోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మార్చి 30 నుంచి ఈనెల 13 వరకు జరిగే వసంతోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి జాతర మహోత్సవం అత్యంత వైభవంగా సాగింది. ఈ సందర్భంగా తణుకు ఎంఎల్‌ఎ ఆరిమిల్లి రాధాకృష్ణ, కృష్ణతులసి దంపతులు శనివారం యల్లారమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకు ముందు ఆలయ కమిటీ సభ్యులు, దేవాదాయ శాఖ అధికారులు ఎంఎల్‌ఎ రాధాకృష్ణ దంపతులకు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. వేద మంత్రాల మధ్య వేద పండితులు ఎంఎల్‌ఎ దంపతులను ఆశీర్వదించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులతో పాటు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.