బ్లడ్‌ బ్యాంకులో రక్త నిల్వలు పెంచాలి

ప్రజాశక్తి – భీమవరం

రాయలంలో జిల్లా రెడ్‌క్రాస్‌ కార్యాలయం, కపొనెంటు బ్లడ్‌ బ్యాంకు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్‌ చదలవాడ నాగరాణి బుధవారం పరిశీలించారు. ఇంటర్నేషనల్‌ రెడ్‌క్రాస్‌ సహకారంతో సమకూర్చుకున్న రూ.2 కోట్ల విలువైన యంత్రాలు, పరికరాలు, మౌలిక సదుపాయాలను జిల్లా కలెక్టర్‌ పరిశీలించారు. నేషనల్‌ సెంట్రల్‌ డ్రగ్‌ అధారిటీ న్యూఢిల్లీ వారి నుంచి బ్లడ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు లైసెన్స్‌ మంజూరు చేయడం జరిగిందని, జిల్లా కలెక్టర్‌కు జిల్లా రెడ్‌ క్రాస్‌ ఛైర్మన్‌ తెలిపారు. యంత్రాలు, పరికరాలు పనిచేసే విధానాన్ని తెలుసుకుని జిల్లా కలెక్టర్‌ సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ రక్త దాతలను ప్రోత్సహించి, ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కృత్రిమంగా రక్తాన్ని తయారు చేయలేమని, దాతల నుంచి మాత్రమే రక్తాన్ని సేకరించగలమని, ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాలని తెలిపారు. సాధ్యమైనంత తొందరలో బ్లడ్‌బ్యాంకు కేంద్రాన్ని ప్రారంభించి, ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు తీసుకోవాలన్నారు. రూ.2 కోట్ల విలువైన ఎక్యూప్‌మెంట్‌ అందించిన ఇంటర్నేషనల్‌ రెడ్‌ క్రాస్‌ సంస్థ, ఇండియన్‌ రెడ్‌క్రాస్‌, జిల్లా రెడ్‌ క్రాస్‌ శాఖకు కలెక్టరు ధన్యవాదాలు తెలిపారు. ఆమె వెంట తహశీల్దార్‌ రావి రాంబాబు, జిల్లా రెడ్‌క్రాస్‌ సంస్థ ఛైౖర్మన్‌ ఎం.శివరామ భద్రిరాజు, కోశాధికారి కె.తిరుపతిరాజు, ఎంసి సభ్యులు కె.రఘు సీతారామ కృష్ణంరాజు, సిహెచ్‌వి.ఫణి, కె.రామకృష్ణంరాజు పాల్గొన్నారు.

➡️