భీమవరంలో బాంబు కలకలం

ప్రజాశక్తి – భీమవరం టౌన్‌

జిల్లా కేంద్రం భీమవరం ప్రజలు బాంబు భయంతో ఉలిక్కిపడ్డారు. దేశవ్యాప్తంగా పేరొందిన శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్‌ సొసైటీ, డాక్టర్‌ బివి.రాజు ఫౌండేషన్‌ విద్యాసంస్థల ప్రాంగణంలోని విష్ణు డెంటల్‌ కళాశాలలో బాంబు పెట్టినట్లు బుధవారం మధ్యాహ్నం ప్రిన్సిపల్‌ డాక్టర్‌ రామరాజుకు మెయిల్‌ వచ్చింది. దీంతో యాజమాన్యం అప్రమత్తమై పోలీ సులకు సమాచారం అందించింది. విద్యార్థులను, అధ్యాపకులను, సిబ్బందిని హుటాహుటీన బయటకు పంపించేశారు. జిల్లా ఎస్‌పి అద్నాన్‌ నయీం అస్మీ పర్యవేక్షణలో ఎప్పటికప్పుడు బాంబ్‌ స్క్వాడ్‌, డాగ్‌ స్క్వాడ్‌ రంగంలోకి దిగి విష్ణు డెంటల్‌ కళాశాలలో జల్లెడ పడుతున్నారు. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకూ తనిఖీలు నిర్వహించారు. అనంతరం డాగ్‌ స్క్వాడ్‌ను రంగంలోకి దింపి మరోసారి తనిఖీలు చేసినా ఎటువంటి అనుమానిత వస్తువులుగాని, పరికరాలుగానీ లభించకపోవడంతో బాంబు బెదిరింపు ఉత్తిదేనని తేలింది. దీంతో అటు యాజమాన్యం, ఇటు పోలీసులు, విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు. అదే సమయంలో పోలీస్‌ సైబర్‌ క్రైమ్‌ టీమ్‌ రంగంలోకి దిగి మెయిల్‌ ఎక్కడ నుంచి వచ్చింది, ఎవరు చేశారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. భీమవరం రూరల్‌ ఎస్‌ఐ వీర్రాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.ఆందోళనకు గురైన విద్యార్థుల తల్లిదండ్రులు కళాశాలకు బాంబు బెదిరింపు రావడంతో విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ప్రధానంగా కళాశాల హాస్టల్లో ఉండి చదువుకుంటున్న దూరప్రాంత విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. యాజమాన్యానికి, సమీప ప్రాంతాల్లో ఉన్న బంధువులకు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఫోన్లు పెద్దసంఖ్యలో వచ్చాయి.

➡️