జనానికి దూరంగా.. సమావేశాల్లో బిజీగా..!

ప్రజాశక్తి – ఏలూరు ప్రతినిధి

జిల్లా అధికారులు క్షేత్రస్థాయిలో ఫీల్డ్‌కు వెళ్లి జనాల సమస్యలను తెలుసుకునే పరిస్థితి లేకుండాపోయింది. ప్రతిరోజూ వీడియో కాన్ఫరెన్స్‌లు, జిల్లా ఉన్నతాధికారుల సమావేశాలతోనే బిజీగా గడుపుతున్నారు. దీంతో క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై అధికారులకు అవగాహన లేకుండా పోతుంది. కిందిస్థాయి అధికారులు ఏం చెబితే అదే వాస్తవమని భావించి నిర్ణయాలు తీసుకుంటున్న పరిస్థితి ఉంటోంది. మండల స్థాయిలో అధికారులు సైతం వీడియో కాన్ఫరెన్స్‌లు, సమావేశాలతో బిజిబిజీగా ఉంటూ ప్రజలకు అందుబాటులో లేని పరిస్థితి నెలకొంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిపాలనలో మార్పు కన్పిస్తుందని అంతా ఆశించారు. అందుకు భిన్నంగా పాలన సాగడంపై విమర్శలు విన్పిస్తున్నాయి. జిల్లా అధికారులు సామాన్యులకు అందుబాటులో లేని పరిస్థితి నెలకొంది. రెండు జిల్లాల్లో దాదాపు 40 లక్షల జనాభా ఉన్నారు. దీంతో ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతున్నారు. కిందిస్థాయి అధికారులకు సమస్యలు చెప్పుకున్నా పరిష్కారం కాకపోవడంతో జిల్లా అధికారులను కలిసి తమ సమస్యను చెప్పుకోవాలని జనం చూస్తున్నా అవకాశం దక్కడం లేదు. వారంలో ఏడు రోజులు వీడియో కాన్పరెన్స్‌లు, సమావేశాలతో బిజీగా ఉంటే ప్రజలను అధికారులు కలిసేదెప్పుడో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఏదైనా శాఖకు సంబంధించి జిల్లా అధికారిని కలవాలంటే ఒక రోజంతా నిరీక్షించినా సాధ్యం కావడం లేదని గగ్గోలు పెడుతున్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లకు హాజరుకాకపోతే జిల్లా అధికారులపై ఉన్నతాధికారులు చిందులు తొక్కుతున్నట్లు తెలుస్తోంది. దీంతో గంటలు తరబడి వీడియో కాన్ఫరెన్స్‌ల్లో పాల్గొనడంతోనే జిల్లా అధికారులకు సరిపోతుంది. వ్యవసాయం, పంచాయతీ, రెవెన్యూ, ఆర్‌డబ్ల్యూఎస్‌, మత్స్యశాఖ, హౌసింగ్‌, మార్కెటింగ్‌ ఇలా ఏశాఖకు సంబంధించిన అధికారులైనా క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్తే ప్రజల సమస్యలు క్షుణ్ణంగా అర్థమవుతాయి. ప్రభుత్వ పథకాల అమలు ఎలా ఉందనేది తెలుస్తోంది. కిందిస్థాయి అధికారులు కార్యాలయాలకు వస్తున్నారో, లేదో అర్థమవుతుంది. అలాకాకుండా జిల్లా, రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా అధికారులకు ఆదేశాలు ఇవ్వడం, జిల్లా అధికారులు కిందిస్థాయి సిబ్బందికి అదే వీడియో కాన్ఫరెన్స్‌లో ఆదేశాలు జారీ చేయడంతోనే రోజులు గడిచిపోతున్నాయి. సోమవారం పిజిఆర్‌ఎస్‌ ఉండటంతో జిల్లా కేంద్రంలోనే అధికారులంతా ఉండాలి. ఆ తర్వాత ఐదు రోజులు కూడా సమావేశాలు, వీడియో కాన్ఫరెన్స్‌ల పేరుతో జిల్లా అధికారులను హెడ్‌క్వార్టర్‌లోనే బందీలుగా ఉంచేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జనం జిల్లా అధికారులను నిలదీస్తే మీటింగ్‌లో ఉన్నామని సమాధానం చెబుతున్నారు. కొన్ని శాఖలకు సంబంధించిన అధికారులు ఇదే అవకాశంగా పని మొత్తం పక్కన పెట్టేస్తున్నారు. ఒకవేళ సమావేశం లేకపోయినా ఉన్నట్లు కార్యాలయాల్లోని అధికారులతో చెప్పించి సొంత పనులు చూసుకుంటున్నారనే విమర్శలు సైతం ఉన్నాయి. ఒకే సమయంలో జిల్లా కలెక్టర్‌, రాష్ట్రస్థాయి అధికారుల వీడియో కాన్ఫరెన్స్‌లు సైతం నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. దీంతో జిల్లా అధికారులకు ఏం చేయాలో అర్థంకాని పరిస్థితి ఉంటుందని తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో అధికారులు ఇస్తున్న నివేదికలకు.. వాస్తవ పరిస్థితికి సంబంధం ఉండటం లేదు. దీంతో ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు అమలు చేసినా జనాలకు చేరని పరిస్థితి ఉందనే చర్చ సైతం సాగుతోంది.జనానికి సోమవారం పిజిఆర్‌ఎస్‌నే దిక్కు.. జిల్లా అధికారులను కలిసే అవకాశం జనానికి లేకుండాపోవడంతో ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో జరిగే పిజిఆర్‌ఎస్‌ (ప్రజాసమస్యల పరిష్కార వేదిక)నే దిక్కుగా మారింది. ఎంఎల్‌సి ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో దాదాపు నెలన్నరపాటు పిజిఆర్‌ఎస్‌ నిలిచిపోయింది. దీంతో జనం తమ సమస్యలను ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. జిల్లా అధికారులు మామూలు రోజుల్లో దొరకకపోవడం, పిజిఆర్‌ఎస్‌లో జిల్లా అధికారులంతా ఉంటారని భావించి జనం దానికి క్యూ కడుతున్నారు. మండలస్థాయిలో పిజిఆర్‌ఎస్‌ అమలు చేస్తున్నా జనాలు అక్కడ ఫిర్యాదులు ఇచ్చేందుకు ఇష్టపడటం లేదు. ఎందుకుంటే మండలస్థాయిలో తీసుకుంటున్న ఫిర్యాదులను అధికారులు సరిగా పట్టించుకోవడం లేదనే అభిప్రాయం జనాల్లో నెలకొంది. వారంలో సగం రోజులైనా జిల్లా అధికారులు క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటేనే ప్రజలకు న్యాయం జరిగే పరిస్థితి ఉంటుంది.

➡️