ఆందోళనలో రైతులు
నరసాపురం : జిన్నూరు పంట కాలువలో చనిపోయిన కోళ్లను సంచుల్లో మూటలుగా కట్టి కాలువలో పడేస్తునారు. గత కొన్ని రోజులుగా కాలువలో చనిపోయిన కోళ్ల మూటలు కాలువ వెంబడి కొట్టుకురావడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితితో కాలువలో నీరు కలుషితం కావడంతో పాటు గ్రామీణ ప్రాంత ప్రజలు రోగాల బారిన పడతారని సాగునీటి సంఘ అధ్యక్షుడు ఆందోళన వ్యక్తం చేశారు. పరిస్థితిని జలవనరులశాఖ డిఇఇ సిహెచ్.వెంకట నారాయణ దృష్టికి తీసుకువెళ్లారు. ఆయన సోమవారం జిన్నూరు పంట కాలువను మల్లవరం, కొప్పర్రు గ్రామాల పరిధిలో పరిశీలించారు. కాలువలో చెట్ల కొమ్మలకు అడ్డుపడి చనిపోయిన కోళ్ల సంచుల మూటలను తొలగించేందుకు చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా జలనవరులశాఖ డిఇఇ వెంకట నారాయణ మాట్లాడుతూ ఇటీవల కోళ్లకు రోగాలు రావడంతో కోళ్ల ఫారం యజమానులు చనిపోయిన కోళ్లను పంట కాలువలో పడేస్తున్నట్లు తెలిసిందన్నారు. ఈ చిషయమై కాలువ ఎగువన ఉన్న పెరవలి, ఉండ్రాజవరం తదితర మండలాల్లోని పౌల్ట్రీ ఫారం యజమానులకు మంగళవారం నుంచి తానే జలనవరులశాఖ సిబ్బందితో వెళ్లి స్వయంగా నోటీసులు అందజేస్తానన్నారు. డివిజన్ పరిధిలోని జల వనరులశాఖ ఎఇఇలకు కోళ్ల ఫారాలపై నిఘా ఉంచాల్సిందిగా కోరతామన్నారు. చనిపోయిన కోళ్లను గొయ్యి తీసి కప్పెట్టాలని సూచించారు. అలాకాకుండా పంట కాలువల్లో పడేసే కోళ్ల ఫారంలపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.