దూసుకొచ్చిన మృత్యువు

  • ‘ఉపాధి’ కార్మికులపైకి వ్యాను
  • ముగ్గురు దుర్మరణం

ప్రజాశక్తి- మొగల్తూరు : వ్యాను అదుపు తప్పి ఉపాధి కార్మికులపైకి దూసుకెళ్లింది. దీంతో, ముగ్గురు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. బుధవారం చోటుచేసుకున్న ఈ విషాద ఘటనకు సంబంధించి ఎస్‌ఐ జి.వాసు తెలిపిన వివరాల ప్రకారం. పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు పంచాయతీ సుబ్రహ్మణ్యేశ్వరం (నక్కావారిపాలెం) గ్రామానికి చెందిన ఉపాధి కార్మికులు నల్లంవారితోట, పెద్దపల్లవపాలెం గ్రామాల మధ్య ఉన్న పంట బోదెలో పూడిక తొలగించేందుకు కొలతలు తీసుకుంటున్నారు.
గుంటూరు జిల్లా నరసరావుపేట నుంచి మొగల్తూరు వంట నూనె లోడుతో వెళ్తున్న వ్యాను అదుపు తప్పి వారిపైకి దూసుకు వెళ్లడంతో సంఘటన స్థలంలోనే గుబ్బల గంగాదేవి (55), కడలి పావని (45) మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన గంగాదేవి భర్త మాణిక్యాలరావు (62), గుడాల సత్యనారాయణలను తొలుత నరసాపురం ప్రభుత్వాస్పత్రికి, పరిస్థితి విషమంగా ఉండడంతో ఆ తర్వాత భీమవరంలోని ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మాణిక్యాలరావు మృతి చెందారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనా స్థలాన్ని జిల్లా కలెక్టర్‌ చదలవాడ నాగరాణి, ఎంఎల్‌ఎ బొమ్మిడి నాయకర్‌ పరిశీలించారు. నరసాపురం ఆస్పత్రిలో మృతుల కుటుంబాలను పరామర్శించారు.

ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని గ్రామస్తుల ఆందోళన

మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున, గాయపడిన ఉపాధి కార్మికునికి రూ.5 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని కోరుతూ నరసాపురం ప్రభుత్వాస్పత్రి వద్ద గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బాతిరెడ్డి జార్జి, జక్కంశెట్టి సత్యనారాయణ, ఉపాధ్యక్షులు కౌరు పెద్దిరాజు మాట్లాడుతూ మృతుల కుటుంబాలకు, తీవ్రంగా గాయపడిన గుడాల సత్యనారాయణకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు.

➡️