సిఎం పర్యటన ఏర్పాట్లు ముమ్మరం

ప్రజాశక్తి – తణుకు

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు ఈనెల 15వ తేదీన తణుకు రానున్నారు. మూడో శనివారం నిర్వహించే కార్యక్రమాన్ని సింగిల్‌ యూస్డ్‌ ప్లాస్టిక్‌ నిషేధం అనే స్లోగన్‌తో నిర్వహించనున్న నేపథ్యంలో తణుకులో జరిగే బహిరంగ సమావేశంతోపాటు పార్టీ ప్రతినిధులు, అధికార యంత్రాంగంతో ఏర్పాటు చేసే సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గోనున్నారు. ఈ నేపథ్యంలో తణుకులో జరుగుతున్న సిఎం పర్యటన ఏర్పాట్లను ఎంఎల్‌ఎ ఆరిమిల్లి రాధాకృష్ణ బుధవారం సాయంత్రం జిల్లా కలెక్టర్‌ చదలవాడ నాగరాణి, జిల్లా ఎస్‌పి అద్నాన్‌ నయీం అస్మితో కలిసి పరిశీలించారు. ముళ్లపూడి వెంకటరాయ మెమోరియల్‌ పాలిటెక్నికల్‌ కాలేజీ ఆవరణలో హెలీపాడ్‌, ఆడిటోరియంతోపాటు బహిరంగ సమావేశం జరిగే జిల్లా పరిషత్‌ బాలుర హైస్కూల్‌ ప్రాంగణంలో ప్రజా వేదిక, జాస్తి సీతామహాలక్ష్మి బాలికోన్నత పాఠశాలలో పార్కింగ్‌ ప్రదేశం, స్టాల్స్‌ ప్రదర్శనకు ప్రాథమికంగా స్థలాలను పరిశీలించారు. అనంతరం మార్కెట్‌తోపాటు పెరవలి వైజంక్షన్‌ వద్ద కూరగాయల మార్కెట్‌ ప్రాంతాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. వారి వెంట జెసి టి.రాహుల్‌కుమార్‌ రెడ్డి, అడిషనల్‌ ఎస్‌పి వి.భీమారావు, తాడేపల్లిగూడెం, నరసాపురం ఆర్‌డిఒలు కతీబ్‌ కౌసర్‌ భానో, దాసిరాజు, తాడేపల్లిగూడెం డిఎస్‌పి డి.విశ్వనాథ్‌ పాల్గొన్నారు.

➡️