ఇసుక అక్రమ తవ్వకాలపై ఫిర్యాదు

ప్రజాశక్తి – మొగల్తూరు

మండలంలోని శేరేపాలెం గ్రామ రెవెన్యూ పరిధిలో జరుగుతున్న ఇసుక అక్రమ తవ్వకాలపై నరసాపురం ఎస్‌ఇబి అధికారులు గురువారం తనిఖీలు నిర్వహించారు. శేరేపాలెం పంచాయతీ 6వ వార్డు సభ్యుడు కత్తుల శ్రీనివాస్‌ ఆన్‌ లైన్‌లో స్పందనలో ఈవిషయంపై ఫిర్యాదు చేశారు. గ్రామంలో అనుమతి లేకుండా జరుగుతున్న ఇసుక తవ్వకాల వల్ల రహదారులు చిద్రంగా మారుతున్నాయని, అక్రమ ఇసుక రవాణా ట్రాక్టర్లు సంచారంతో గ్రామంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఫిర్యాదులో పేర్కొనడంతో నరసాపురం ఎస్‌ఇబి సిఐ బి.శ్రీనివాసరావు, రెవెన్యూ సిబ్బందితో గ్రామంలో జరుగుతున్న ఇసుక తవ్వకాలపై తనిఖీలు నిర్వహించారు. అధికారుల తనిఖీ విషయం ముందుగా తెలియడంతో ట్రాక్టర్లు, లారీల ఎగుమతులను ఇసుక మాఫియా ఆపివేసిందని అధికారులు వెళ్లిన వెంటనే తిరిగి ఇసుక తవ్వకాలు, ఎగుమతులు యధావిధిగా జరిగాయని ఫిర్యాదు దారుడు కత్తుల శ్రీనివాస్‌ పేర్కొన్నారు. ఇసుక అక్రమ తవ్వకాలను తక్షణమే నిలిపివేసి తవ్వకందారులపై చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్‌ చేశారు.

➡️