ఓట్ల లెక్కింపును విజయవంతం చేయాలి

ప్రధాన ఎన్నికల కమిషనరు శ్రీ రాజీవ్‌ కుమార్‌

ప్రజాశక్తి – భీమవరం టౌన్‌

జూన్‌ నాలుగో తేదీన జరగనున్న ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన ముందస్తు ఏర్పాట్లను పగడ్బందీగా చేయాలని భారత ప్రధాన ఎన్నికల కమిషనరు శ్రీ రాజీవ్‌ కుమార్‌ ఆదేశించారు. ఎన్నికల ఫలితాల ప్రకటన విషయంలో ఏమాత్రమూ జాప్యం చేయకుండా భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలను పాటిస్తూ త్వరితగతిన కచ్ఛితమైన ఫలితాలను ప్రకటించాలన్నారు. ఐదు దశల్లో ఎన్నికలు జరిగిన రాష్ట్రాల సిఇఒలు, జిల్లాల ఎన్నికల అధికారులతో ఎలక్షన్‌ కమిషనర్లు జ్ఞానేష్‌కుమార్‌, డాక్టర్‌ సుఖ్బీర్‌సింగ్‌తో కలిసి సోమవారం ప్రధాన ఎన్నికల కమిషనరు శ్రీరాజీవ్‌ కుమార్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి, ఓట్ల లెక్కింపునకు చేస్తున్న ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ మాట్లాడారు. ఓట్ల లెక్కింపు కార్యక్రమం ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పక్కా ప్రణాళికతో చర్యలు తీసుకుంటున్నామన్నారు. కౌంటింగ్‌కు సంబంధించిన శిక్షణ కార్యక్రమాలు నిర్వహించామని ప్రధాన ఎన్నికల సంఘం కమిషనరు రాజీవ్‌కుమార్‌కు కలెక్టరు వివరించారు. దీనిపై ఆయన మాట్లాడారు. అదే స్ఫూర్తితో ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ఓట్ల లెక్కింపు రోజు ఇవిఎంలను భద్రపర్చిన స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద అప్రమత్తంగా ఉండాలన్నారు. పాస్‌ లేకుండా ఎవరినీ అనుమతించొద్దన్నారు. నిరంతరాయంగా విద్యుత్తు సరఫరా ఉండేలా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ఐటి డిప్యూటీ డైరెక్టర్‌ బొప్పన బాలయ్య, డిప్యూటీ తహశీల్దార్‌ ఎం.సన్యాసిరావు పాల్గొన్నారు.

➡️