పిహెచ్‌సిలో ఖాళీ పోస్టులు భర్తీ చేయాలి : సిపిఎం

ప్రజాశక్తి – తణుకు రూరల్‌

వేల్పూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని సిపిఎం వేల్పూరు గ్రామ కార్యదర్శి బళ్ల చిన వీరభద్రరావు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు మంగళవారం సిపిఎం గ్రామ కమిటీ తరపున భీమవరం కలెక్టరేట్‌లో జిల్లా మలేరియా అధికారి డాక్టర్‌ గులాబ్‌ రాజకుమార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వీరభద్రరావు మాట్లాడుతూ మండలంలో ఉన్న 9 గ్రామాల ప్రజలకు వేల్పూరులో ఉన్న పిహెచ్‌సి అనేక వైద్య సేవలందిస్తోంది. అయితే ముఖ్యంగా రోగులకు అవసరమైన రక్త పరీక్షలు చేసేందుకు ల్యాబ్‌ టెక్నీషియన్‌, ఎఫ్‌ఎన్‌ఒ, ఎంఎన్‌ఒ, నైట్‌ వాచ్‌మెన్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. సిబ్బంది కొరత కారణంగా రోగులకు పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందుబాటులో లేక రోగులకు ఇబ్బందికరంగా మారిందని పేర్కొన్నారు. గతంలో ఈ ఆసుపత్రి పరిధిలో అందించిన వైద్య సేవలను గుర్తించి అప్పటి కేంద్ర ప్రభుత్వం దేశంలో అత్యుత్తమ పిహెచ్‌సిగా గుర్తించి అవార్డు అందించినట్లు వీరభద్రరావు గుర్తు చేశారు. అటువంటి గుర్తింపు పొందిన ఆసుపత్రి ప్రస్తుతం రోగులకు రక్త పరీక్షలు చేయలేని పరిస్థితిలో ఉందన్నారు. రెండేళ్ల నుంచి ల్యాబ్‌ టెక్నీషియన్‌ లేకపోవడంతో ఇన్‌ఛార్జి టెక్నీషియన్‌ వారంలో రెండు రోజులు విధులు నిర్వహిస్తున్నప్పటికీ మిగతా రోజుల్లో ఆసుపత్రికి వచ్చిన రోగులకు రక్త పరీక్షలు చేయడానికి వీల్లేకుండా పోయింది. దీంతో రోగులు ప్రయివేటు ల్యాబ్‌లను ఆశ్రయించాల్సి వస్తోందని వీరభద్రరావు వాపోయారు. ప్రభుత్వం ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆరోగ్య కేంద్రంలో ఖాళీగా ఉన్న పోస్టులను తక్షణం భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో బి.జార్జి, కె.సుబ్బరాజు పాల్గొన్నారు.

➡️