క్రాస్‌ ఓటింగ్‌ కలవరం..!

May 14,2024 22:46

అభ్యర్థుల గెలుపోటములపై ప్రభావం
బిసి సామాజిక తరగతి ఎక్కువ ఓటింగున్న స్థానాల్లో మరింత ప్రభావం పడే అవకాశం
గెలుపోటములపై ఎవరి ధీమా వారిదే
ప్రజాశక్తి – భీమవరం
క్రాస్‌ ఓటింగ్‌ ప్రచారం అభ్యర్థులను కలవరపాటుకు గురి చేస్తుంది. అభ్యర్థుల గెలుపోటముల అంచనాలను సైతం క్రాస్‌ ఓటింగ్‌ తారుమారు చేసిందనే చెప్పొచ్చు. దీంతో అభ్యర్థుల విజయావకాశాలపై ఎవరి ధీమా వారు వ్యక్తం చేస్తున్నా లోలోన గుబులు నెలకొందని తెలుస్తోంది. గతానికి భిన్నంగా అయితే బిసి సామాజిక తరగతి ఎక్కువ ఓటింగ్‌ ఉన్న స్థానాల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉండొచ్చనే అభిప్రాయమూ వ్యక్తమవుతోంది. నరసాపురం పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఆచంట, పాలకొల్లు, నరసాపురం, భీమవరం, ఉండి, తాడేపల్లిగూడెం, తణుకు నియోజకవర్గాలు ఉన్నాయి. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉదయమే బారులు తీరినప్పటికీ రాత్రి 11 గంటల వరకు పోలింగ్‌ ప్రక్రియ సాగింది. జిల్లావ్యాప్తంగా 82.60 శాతం పోలింగ్‌ నమోదైంది. ఆచంట నియోజకవర్గంలో 82.80 శాతం, పాలకొల్లులో 82.28 శాతం, నరసాపురంలో 84.38 శాతం, భీమవరంలో 79.35 శాతం, ఉండిలో 86.20 శాతం, తణుకులో 82.16 శాతం, తాడేపల్లిగూడెంలో 81.86 శాతం పోలింగ్‌ నమోదైంది. ఒక్క భీమవరం నియోజకవర్గం మినహా మిగిలిన ఆరు నియోజకవర్గంలో పోలింగ్‌ 80 శాతానికిపైగా నమోదు కావడం విశేషం. అయితే పోలింగ్‌ అధిక శాతం నమోదు కావడంతో అభ్యర్థుల గెలుపోటములపై ప్రధాన చర్చ సాగుతోంది. ఎవరిని విజయ వరిస్తుంది, ఎవరు పరాజయం పాలవువుతారనే దానిపై లెక్కలు కడుతున్నారు. అయితే జిల్లాలో టిడిపి కూటమి బలంగా ఉన్నప్పటికీ ఎంపీ స్థానంపై క్రాస్‌ఓటింగ్‌ గుబులు వెంటాడుతోంది. నర్సాపురం ఎంపీ స్థానంలో వైసిపి అభ్యర్థిగా గూడూరి ఉమాబాల, బిజెపి అభ్యర్థిగా భూపతిరాజు శ్రీనివాస్‌వర్మ, కాంగ్రెస్‌ అభ్యర్థిగా కెబిఆర్‌.నాయుడుతోపాటు మొత్తం 21 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. గడిచిన ఎన్నికల్లో పొత్తులో భాగంగా బిజెపి నుంచి పోటీ చేసిన క్షత్రియ సామాజిక తరగతికి చెందిన సినీనటుడు కృష్ణంరాజు, గోకరాజు గంగరాజు గెలుపొందారు. అప్పట్లో ప్రధాన పార్టీలు సైతం క్షత్రియ సామాజిక తరగతికి చెందిన అభ్యర్థులనే బరిలోకి దింపాయి. ఈసారి వైసిపి సరికొత్త వ్యూహానికి తెరలేపి శెట్టిబలిజ సామాజిక తరగతికి చెందిన బిసి అభ్యర్థిని బరిలోకి దింపింది. ఆచంట, పాలకొల్లు, భీమవరం, తణుకు వంటి పలు నియోజకవర్గాల్లో శెట్టిబలిజ ఓటర్లు పెద్దసంఖ్యలో ఉన్నారు. వైసిపి సైతం సంస్థాగతంగా బలంగానే ఉంది. గడిచిన ఎన్నికల్లో ఇక్కడున్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఐదు స్థానాలను వైసిపి గెలుచుకోవడంతోపాటు నరసాపురం ఎంపీ స్థానాన్ని సైతం కైవనం చేసుకుంది. దీన్నిబట్టి నరసాపురం లోక్‌సభ స్థానంలో వైసిపి బలంగా ఉంది. దీంతో ఇక్కడ గెలుపోటములపై ప్రధానంగా చర్చ సాగుతోంది. అసెంబ్లీ స్థానంలో నచ్చిన పార్టీ అభ్యర్థికి ఓటు వేసుకున్నా ఎంపీ ఓటు మాత్రం గూడూరి ఉమాబాలకు వేయాలని శెట్టిబలిజ సామాజిక తరగతిలో విస్తృత ప్రచారం సాగింది. ఈ నేపథ్యంలో క్రాస్‌ ఓటింగ్‌ అధికంగా జరుగుంటుందనే చర్చ ప్రధానంగా ఉంది. నరసాపురం, ఆచంట, పాలకొల్లు, భీమవరం, తణుకు నియోజకవర్గాల్లో క్రాస్‌ఓటింగ్‌ జరిగినట్లు స్పష్టంగా తెలుస్తోంది. దీంతోపాటు మహిళలు, వృద్ధుల సైలెంట్‌ ఓటింగ్‌ వైసిపికి కలిసొచ్చే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. ప్రభుత్వ వ్యతిరేకత ఓటు అసెంబ్లీ స్థానంలో ప్రభావం చూపినా ఎంపీ ఓటు విషయంలో ఆ వ్యతిరేకత కన్పించలేదని చెబుతున్నారు. అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులు పోటాపోటీగా సొమ్ము పంచడం కూడా రెండు ఓట్లలో కూటమికి ఒకటి, వైసిపికి ఒకటి అనే రీతిన క్రాస్‌ ఓటింగ్‌ సాగిందనే విశ్లేషణ కూడా తెరపైకి వచ్చింది. ఏదేమైనా క్రాస్‌ఓటింగ్‌ మాత్రం ఎంపీ అభ్యర్థుల విజయావకాశాలపై ప్రభావం చూపుతాయనేది అందరి అంచనా. అయితే ఇది బిజెపికి అనుకూలమా, లేక వైసిపికి అనుకూలమా అనేది ఎవరికి వారు తమకే అంటే తమకే అని ధీమా వ్యక్తం చేస్తుండటం విశేషం. అదే క్రమంలో ఇండియా వేదిక తరఫున కాంగ్రెస్‌ అభ్యర్థిగా కెబిఆర్‌.నాయుడుకు సైతం అధికంగా ఓట్లు పోలైనట్లు తెలుస్తోంది. బిజెపి వ్యతిరేక ఓటింగ్‌తోపాటు సిపిఎం, సిపిఐ మద్దతుతో గణనీయమైన ఓట్లు సాధించినట్లు సమాచారం. ఇండియా వేదిక అభ్యర్థి ప్రభావం కూడా ఇతర అభ్యర్థుల విజయావకాశాలపై ఉంటుందనడంలో ఎటువంటి సందేహమూ లేదు. ఈ క్రమంలో క్రాస్‌ ఓటింగ్‌ ఎవరికి లాభం.. ఎవరికి నష్టమో తెలియాలంటే జూన్‌ నాలుగో తేదీ వరకూ వేచిచూడాల్సిందే.

➡️