తాటి ముంజులకు గిరాకీ

ప్రజాశక్తి – కాళ్ల

వేసవి రాకతో భానుడు ప్రతాపం చూపుతున్నాడు. ఎండల తీవ్రతకు ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. అయితే వేసవిలో మాత్రమే లభించే తాటి ముంజులను కొనుగోలు చేసేందుకు జనం ఆసక్తి చూపుతున్నారు. వేడి వాతావరణంలో తాటి ముంజులు ఉపశమనం కలిగిస్తాయని వైద్యులు సూచిస్తున్నారు. శరీరంలో లవణాలు, పోషకాలను పోనీయకుండా వేసవి తాపం నుంచి తాటి ముంజులు ఉపశమనం కలిగిస్తాయంటున్నారు. దీంతో వీటికి గిరాకీ పెరిగింది. వేసవిలో ఏప్రిల్‌, మే నెలల్లో ఈ వ్యాపారం జోరుగా సాగుతుంది.ఇక ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న ఈ తాటి ముంజులు తినడానికి చాలా మంది ఇష్టపడుతుంటారు. వాటిని ఎంతో మంది ఇష్టంగా తింటారు. అయితే డయాబెటీస్‌ ఉన్నవారు తాటి ముంజులు తినొచ్చా లేదా అని ఆలోచిస్తుంటారు. మండలంలోని పలు ప్రధాన గ్రామాల కూడలితో పాటు పలు గ్రామాల్లో కొంతమంది ప్రజలు తాటి ముంజులు జీవనోపాధి పొందుతున్నారు.ఏలూరుపాడు, జువ్వలపాలెం, దొడ్డనపూడి, కాళ్ల, సీసలి, జక్కరం, పెదఅమిరం గ్రామాల్లో తాటి ముంజుల వ్యాపారం జోరుగా సాగుతోంది. తాటి ముంజులు డజను 50 రూపాయలకు విక్రయిస్తున్నారు. వాటిలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. అంతే కాకుండా క్యాలరీలు తక్కువగా ఉండటం వల్ల కాల్షియం, ఫైటో న్యూట్రియెంట్స్‌, విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. వీటిని తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు వైద్యులు. తాటి ముంజులను సమ్మర్‌లో తినడం వల్ల డీహైడ్రేషన్‌ సమస్యల నుంచి బయటపడొచ్చు. వికారం, వాంతులు వంటి లక్షణాల నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది. అంతేకాకుండా డయాబెటీస్‌ రోగులకు కూడా ఇది మంచి చేస్తుంది.ప్రకృతివరం తాటిముంజులు..వేసవిలో ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు తాటి ముంజలు ఎంతగానో ఉపయోగపడతాయి. తాటిముంజు మనిషికి ఎంతగానో మేలు చేస్తుంది. మనిషి శరీరంలోని ఉష్ణోగ్రత తగ్గి జీర్ణక్రియ బాగా జరుగుతుంది. శరీరానికి మంచి చల్లదనాన్ని అందిస్తుంది. చిన్నారులకు, పెద్దలకు, సుగర్‌ వ్యాధిగ్రస్తులకు, స్థూలకాయులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆరోగ్యానికి దోహదం చేయడంతో పాటు దాహార్తికి కూడా మంచి విరుగుడు, తాటిముంజు లో ఎక్కువ మొత్తంలో శరీరానికి కావాల్సి శక్తినిస్తుంది.

➡️