ప్రజాశక్తి – ఆకివీడు
ప్రస్తుతం ఉండి నియోజకవర్గంలో ప్రజాపాలన లేదని, రాక్షస పాలన సాగుతోందని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జెఎన్‌వి.గోపాలన్ విమర్శించారు. మండలంలోని ఐ.భీమవరం గ్రామంలో రోడ్ల పక్కనే ఉన్న ఇళ్ల తొలగింపు కార్యక్రమాన్ని నిరసిస్తూ సిపిఎం చేపట్టిన ఆందోళనలో మంగళవారం సాయంత్రం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆకివీడు పొలిమేర నుండి సంఘటనా స్థలం వరకు బాధితులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. అనంతరం మండల కార్యదర్శి కె.తవిటినాయుడు అధ్యక్షతన జరిగిన సభలో గోపాలన్ మాట్లాడారు. రఘురామకృష్ణంరాజు నుంచి రఘురాముని పాలన ఆశించామని, దానికి విరుద్ధంగా రాక్షస పాలన సాగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఏ ఎంఎల్‌ఎ కూడా ఇంత దుర్మార్గం చేయలేదన్నారు. ఇళ్ల ఖాళీకి సమయం కోరడంతోపాటు ఇళ్ల స్థలాలు కేటాయించిన ప్రాంతంలో మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరినా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. శ్రామిక మహిళ జిల్లా కార్యదర్శి డి.కళ్యాణి మాట్లాడుతూ స్థలాలిస్తాం, ఇళ్ల పట్టాలిస్తాం, ఇల్లు కట్టించి ఇస్తాం అంటూ ఇచ్చిన మాటలు నీటి మూటలుగా మిగిలిపోయాయన్నారు. ఇల్లు పీకేసి అభివృద్ధి అనుకుంటే అది తిరోగమనమన్నారు. నిర్వాసితులకు పట్టాలిచ్చి పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆమె డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఎంఎల్‌ఎ ఇంటి ముందే దీక్షలు, ధర్నాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో గొర్ల రామకృష్ణ, బివి.వర్మ, బి.రాంబాబు, ధనుష్, రవితేజ, డోకల లక్ష్మి, ఎస్.ఉదయకుమారి, సందక సూరిబాబు తదితరులు మాట్లాడారు.