చెట్ల తొలగింపు పేరుతో విధ్వంసం

పాలకోడేరు విద్యుత్‌ శాఖ అధికారుల తీరుపై విమర్శలు

భీమవరం : గొల్లలకోడేరు పంచాయతీ పరిధిలోని ఎఎస్‌ఆర్‌ నగర్‌లో విద్యుత్‌ శాఖ అధికారులు చెట్ల కొమ్మల తొలగింపు పేరుతో విధ్వంసం సృష్టించారు. విద్యుత్తు తీగలకు అడ్డు లేకపోయినా విలువైన మొక్కలు, చెట్లను అతి దారుణంగా తొలగించారు. గొల్లలకోడేరులో 11 కెవి విద్యుత్‌ లైన్లు మీద ఉన్న చెట్లు, కొమ్మలు, కొబ్బరి ఆకులు తొలగించేందుకు ఆదివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ ఎన్‌.వెంకటేశ్వరరావు శనివారం ప్రకటన ద్వారా విద్యుత్‌ వినియోగదారులకు తెలియజేశారు. అయితే చెట్లు కొమ్మలు, కొబ్బరి ఆకుల తొలగింపు మాట ఎలా ఉన్నా విద్యుత్‌ లైన్లకు ఇబ్బంది లేకుండా ఉన్న, పెరట్లో పెంచుకున్న విలువైన మొక్కలను ప్రోక్లైన్‌తో అతి దారుణంగా తొలగించేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీనిపై విద్యుత్‌ శాఖ అధికారులను వివరణ కోరగా జెసిబి వెళ్లేందుకు మార్గం లేకపోవడంతోనే చెట్లను తొలగించి ఉంటారేమోనని బదులిచ్చారు. . దీనిపై పాలకోడేరు ఎఎస్‌ఆర్‌ నగర్‌ వాసులు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసేందుకు సన్నద్ధమయ్యారు.

➡️