వ్యకాస నేత సత్యనారాయణ రాజు మృతి

పాలకొల్లు మండలం అరటికట్లలో విషాద ఛాయలు

ప్రజాశక్తి – పాలకొల్లు

పాలకొల్లు మండలం అరట్లకట్ట గ్రామానికి చెందిన సిపిఎం సీనియర్‌ నాయకులు, వ్యవసాయ కార్మిక ఉద్యమ నేత కూనపరాజు సత్యనారాయణరాజు (సత్తిరాజు) (80) ఆదివారం మృతి చెందారు. ఆయనకు భార్య సత్యవతి, కుమారుడు సుందరయ్య ఉన్నారు. ఆయన తుదిశ్వాస వరకూ సిపిఎం కార్యకర్తగా పనిచేశారు. భార్య సత్యవతితో వ్యవసాయ కార్మికుల జీవనగతులు పెంచడానికి నిత్యం పోరాటం చేశారు. ఆయన మృతదేహంపై సిపిఎం నేతలు పార్టీ జెండాను కప్పి నివాళులర్పించారు. ఆయన వ్యవసాయ కార్మిక ఉద్యమానికి చేసిన సేవలను కొనియాడారు. ఆయన మృతదేహం వద్ద పలువురు విలపిస్తూ ఆయన సేవలను గుర్తుకు తెచ్చుకున్నారు. సాయంత్రం ఆయనకు అంత్యక్రియలు నిర్వహించారు.జిల్లా సిపిఎం సంతాపం..సత్యనారాయణరాజు మృతి పట్ల సిపిఎం జిల్లా కమిటీ, సిపిఎం సీనియర్‌ నాయకులు, మాజీ ఎంఎల్‌ఎ రుద్రరాజు సత్యనారాయణ రాజు (ఆర్‌ఎస్‌), సిపిఎం రాష్ట్ర సెక్రటేరియట్‌ సభ్యులు మంతెన సీతారాం, సీనియర్‌ నాయకులు జుత్తిగ నర్శింహమూర్తి, కేతా సూర్యారావు, వలవల శ్రీరామ్మూర్తి, జిల్లా సెక్రటేరియట్‌ సభ్యులు సంతాపం తెలిపారు. సిిపిఎం జిల్లా కార్యదర్శి బి.బలరాం ఒక ప్రకటనలో సత్తిరాజు సిపిఎం పూర్తికాలం కార్యకర్తగా, నర్సాపురం, పాలకొల్లు డివిజన్‌ కమిటీ సభ్యునిగా, వ్యవసాయ కార్మిక సంఘం డివిజన్‌ నాయకునిగా అంకితభావంతో, క్రమశిక్షణతో పనిచేశారని పేర్కొన్నారు. గ్రామంలో పేదలు, రైతులు, కౌలు రైతులు, ప్రజల సమస్యలపై విశేష కృషి చేశారన్నారు. భార్య సత్యవతి సిపిఎం సభ్యురాలిగా, మహిళా సంఘం నాయకురాలిగా మహిళల సమస్యలపై కృషి చేశారని పేర్కొన్నారు. ఇరువురు సాధారణ జీవితంతో గ్రామంలో అందరి మన్ననలూ పొందారన్నారు. సత్యనారాయణ రాజు ఇటీవల ప్రమాదంలో గాయపడడంతో కాలికి సర్జరీ జరిగి చాలా ఇబ్బంది పడి కోలుకుంటున్న తరుణంలో ఆకస్మికంగా మృతి చెందారని తెలిపారు. ఆయన మృతి సిపియం పార్టీకి ,ప్రజా సంఘాలకు ,ప్రజా ఉద్యమాలకు తీరని లోటన్నారు.సత్తి రాజు కు సిపియం జిల్లా కమిటీ తరపున ఘనంగ నివాళులు ,జోహార్లు అర్పించారు.భార్య సత్యవతి,ఏకైక కుమారుడు సుందరయ్య ,ఇతర కుటుంబ సభ్యులకు,బంధు మిత్రులకు బలరాం ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాగే అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్‌, రాష్ట్ర కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు, సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శి ఎ.రవి సంతాపం తెలిపారు. సంతాపం తెలిపిన వారిలో మండల కార్యదర్శి జవ్వాది శ్రీనివాస్‌, మాజీ ఎంఎల్‌ఎ దిగుపాటి రాజగోపాల్‌, సిహెచ్‌.సోమేశ్వరరావు, కె.బలరాం, టి.కోటేశ్వరరావు, తిరుమల రాజు, వలవల రవి ఉన్నారు.పెనుమంట్ర : సిపిఎం సీనియర్‌ నేత, వ్యకాస ఉద్యమ నేత కూనపరాజు సత్యనారాయణ రాజు మృతికి పలువురు నాయకులు సంతాపం తెలిపారు. నిస్వార్థంగా, క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలా పనిచేశారని తెలిపారు. ఆయన ఆకస్మిక మృతి సిపిఎం పార్టీకి, ప్రజా సంఘాలకు, ప్రజా ఉద్యమాలకు తీరని లోటని అన్నారు. సిపిఎం నాయకులు కేతా గోపాలన్‌, ఆకుల హరేరామ్‌, ఎం.సుబ్బరాజు, కోడి ప్రసాద్‌ జోహార్లు అర్పించారు. వీరవాసరం : అరట్లకట్ల గ్రామానికి చెందిన వ్యవసాయ కార్మిక సంఘం మాజీ జిల్లా అధ్యక్షుడు కూనపరాజు సత్యనారాయణరాజు మృతి సిపిఎం పార్టీకి తీరని లోటని పార్టీ సీనియర్‌ నాయకులు జుత్తిగ నరసింహమూర్తి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మృతికి సంతాపం తెలిపారు. అనేక రైతు ఉద్యమాల్లో పాల్గొన్న సత్యనారాయణరాజు లేని లోటు తీర్చలేనిదన్నారు. మండల కార్యదర్శి పోతుల మృత్యంజయ, యాళ్ళబండి నారాయణమూర్తి, బాలం విజయకుమార్‌, యండమూరి సుబ్బారావు సంతాపం తెలిపిన వారిలో ఉన్నారు.గణపవరం ఫోటో ఒకటి సిపిఎఫ్‌ ఫ్యాక్టరీ వద్ద మూడవరోజు నిరసన దీక్షల చేస్తున్న కార్మికులు

➡️