విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దిన ధీశాలి

కృష్ణవేణి ఉద్యోగ విరమణ అభనందన సభలో ఉపాధ్యాయులు

ఆచంట : నిబద్ధత, అంకిత భావం, సహృదయం, సేవాభావం, విశిష్ట లక్షణాలతో విద్యార్థుల శ్రేయస్సే పరమావధిగా 42 సంవత్సరాల పాటు సుదీర్ఘ సేవలందించిన ధీశాలి నెక్కంటి కృష్ణవేణి అని ఎంఇఒ-1, ఎ.ఉషారాణి, పి.రాజేంద్రప్రసాద్‌లు అన్నా రు. ఆచంట వేమవరం, జెఎన్‌బిఎం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో నెక్కంటి కృష్ణవేణి ఉద్యోగవిరమణ అభినందన సభ శనివారం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎంఇఒలు పాల్గొని మాట్లాడుతూ సమర్థపాలన దీక్షకురాలుగా అధికారులు, తల్లిదండ్రులు, విద్యార్థుల ఆదరాభిమానాలతో ప్రశంసలు అందుకున్న అసమాన ప్రజ్ఞశాలి కృష్ణవేణి అని కొనియాడారు. 42 సంవత్సరాలుగా ఉపాధ్యాయ జీవితంలో, 17 సంవత్సరాలపాటు ఎస్‌జిటిగాను, 19 సంవత్సరాల పాటు ఎల్‌ఎఫ్‌ఎల్‌ ప్రధానోపాధ్యాయులుగా, 6 సంవత్సరాలు హైస్కూల్‌ ప్రధానోపాధ్యాయులుగా పనిచేసిన ప్రతి పాఠశాలలోనూ అత్యున్నత ప్రమాణాలతో తీర్చిదిద్దిన ధీశాలి అని కొనియాడారు. 2002వ సంవత్సరంలో నర్సాపురం మండలంలో మండల ఉత్తమ ఉపాధ్యాయునిగా, 2007లో జిల్లా ఉత్తమ ప్రధాన ఉపాధ్యాయునిగా, 2008లో జిల్లా ఉత్తమ మహిళా ఉపాధ్యాయునిగా, 2017లో సావిత్రిబాయి పూలే రాష్ట్రస్థాయి ఉత్తమ మహిళా ఉపాధ్యాయునిగా ఎన్నికై ఆనాటి విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాస్‌ చేతుల మీదగా అవార్డులు తీసుకోవడం అభినందనీయమని కొనియాడారు. ఈ సందర్భంగా కృష్ణవేణి దంపతులను ఉపాధ్యాయులు ఘనంగా సత్కరించారు.

➡️