ప్రజాశక్తి – భీమవరం టౌన్
మన ఆరోగ్య రక్షణ కోసం ప్లాస్టిక్ నిషేదించాలని, ప్రభుత్వం చేస్తున్న కృషికి ప్రజలందరూ సహకరించాలని బార్ అసోసియేషన్ అధ్యక్షులు యేలేటి న్యూటన్ అన్నారు. ఆదివారం భీమవరం పురపాలక సంఘం, శ్రీవిజ్ఞానవేదిక ఆధ్వర్యంలో సంత మార్కెట్‌లో ప్రజలకు ఉచితంగా గుడ్డ సంచులను పంపిణీ చేశారు. ప్లాసిక్‌కు బదులుగా జిల్లా కలెక్టర్, యంత్రాంగం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసారని, వాటిని వినియోగించుకోవాలని అన్నారు. నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ ప్లాస్టిక్ నిషేదంలో అందరూ భాగస్వాములై స్వచ్చందంగా ప్లాస్టిక్‌ను నిషేధించాలని తెలిపారు. అనంతరం గ్రంధి వెంకటేశ్వరరావు సంత మార్కెట్‌లో 200 మంది ప్రజలకు వబిలిశెట్టి రామకృష్ణ, కంతేటి వెంకటరాజు సహకారంతో గుడ్డ సంచులను అందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ సిహెచ్.వెంకటేశ్వరరావు, రామాయణం సత్యనారాయణ పాల్గొన్నారు.