మండుటెండలో ఉపాధి హామీ కూలీలు విలవిల
ప్రజాశక్తి – కాళ్ల
ఉపాధి హామీ కూలీలు మండుటెండలో మలమలా మాడిపోతున్నారు. ఫిబ్రవరి నెలాఖరు నుంచే ఎండ తీవ్రత పెరగడంతో పని ప్రదేశాల్లో పడుతున్న కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. గత వైసిపి ప్రభుత్వ హయాంలో నీడ కోసం ఇవ్వాల్సిన పరదాలు మూడేళ్లపాటు ఇవ్వలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుంటున్న దాఖలాలు కన్పించడం లేదని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం గ్రామాల్లో అధికార పార్టీ నేతల కనుసన్నల్లోఉపాధి హామీ పనులు జరుగుతున్నాయి. కూలీలకు సక్రమంగా వంద రోజులు కూడా పనులు కల్పించడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఇక వేసవి తీవ్రత నేపథ్యంలో మజ్జిగ, తాగునీరు, టెంట్లు ఏర్పాటు చేయడంతోపాటు సమ్మర్ అలవెన్స్ అందించాల్సి ఉంది. రెండు పూటలా పని విధానం, ముఖ ఆధారిత హాజరు తీసివేయాలని కూలీలు డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఉపాధి కూలీలు చేసిన పనులకు సంబంధించి బకాయిలు పెండింగ్‌లో ఉండటం గోరుచుట్టుపై రోకలిపోటులా ఉందనడంలో ఎటువంటి సందేహమూ లేదు.పందిళ్లు వేసుకోవాలంట..! మండలంలోని పలు గ్రామాల్లో చెరువులు, కాలువల పనులు చేస్తున్నారు. ఉదయం ఆరు గంటల నుంచి 12 వరకు పని చేయాలని అధికారులు సూచిస్తున్నారు. ఇటీవల గ్రామాల్లో చలువ పందిళ్లు వేసుకోవాలని ప్రభుత్వం నుంచి ఎపిఒలకు ఆదేశాలు వచ్చాయి. కర్రలు, గడ్డి, తాటి కొమ్మలు ఎక్కడి నుంచి తెచ్చుకోవాలని ఉపాధి కూలీలు ప్రశ్నిస్తున్నారు. పైగా టెంట్లు ఇస్తే పని ప్రదేశాల్లో వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దానికి భిన్నంగా పందిళ్లు అంటే వేరే పని ప్రదేశాలకు తరలించేది ఎలాగని ప్రశ్నిస్తున్నారు. గతంలో ఒఆర్‌ఎస్ ప్యాకెట్లు, మజ్జిగ ఇచ్చేవారు. ప్రస్తుతం ఇవేవీ ఇవ్వడం లేదు. తాగునీటిని కూడా ఇంటి నుంచే తెచ్చుకుంటున్నామని కూలీలు వాపోతున్నారు. కాళ్ల మండలంలో 5,815 మందికి జాబ్‌కార్డులు ఉన్నాయి. పనుల పర్యవేక్షణకు ప్రత్యేకంగా కమిటీలను కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది.అందని వేతనాలు ఉపాధి కూలీలకు చేసిన పనులకు సంబంధించిన కూలి సొమ్ము చాలా రోజులుగా చెల్లించలేదు. మండలంలో కూలీలకు రూ.56 లక్షల వరకు బకాయిలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. 15 రోజులకు ఒకసారి చెల్లించాల్సిన బిల్లులు రెండు నెలలు గడిచినా అందకపోవడంతో కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిధుల విడుదలలో జాప్యంతో సమస్య వచ్చిందని అధికారులు చెబుతున్నారు.ఇబ్బందుల్లేకుండా చూస్తాంవాసా విజరు మణికంఠకుమార్, టెక్నికల్ అసిస్టెంట్, కాళ్ల ఎండ తీవ్రత నుంచి ఊరట పొందడానికి పని ప్రదేశంలో పందిళ్లు వేసుకోవాలని ఆదేశాలొచ్చాయి. ఈ మేరకు క్షేత్ర సహాయకులకు తెలియజేశాం. కూలీలు ఎండ దెబ్బకు గురికాకుండా, ఎటువంటి ఇబ్బందులూ లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటాం.